అశ్లీల డ్యాన్స్ చేసిన కంకిపాడు హోంగార్డు సస్పెన్షన్
తాజాగా అలాంటి ఉదంతమే ఏపీలోని కంకిపాడులో చోటు చేసుకుంది. ఒక హోంగార్డు అశ్లీల డ్యాన్సులు చేసిన వీడియో వైరల్ అయ్యింది.
By: Garuda Media | 26 Nov 2025 4:29 PM ISTకాలం మారింది. మీడియాకు మించిన సోషల్ మీడియా అంతకంతకూ దూసుకుపోతూ.. ప్రపంచంలోని ఏ మూలన ఏం జరిగినా.. నిమిషాల్లో వైరల్ అవుతున్న వేళ.. కాసింత ఒళ్లు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాల్సిన పరిస్థితి. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే.. మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని ఇప్పటికి ప్రముఖులు గుర్తించని పరిస్థితి. అదే సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన రంగాల్లో పని చేస్తున్నవారు సైతం.. తాము చేస్తున్న చేష్టలకు సోషల్ మీడియాలో వైరల్ వీడియోలతో తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు.
తాజాగా అలాంటి ఉదంతమే ఏపీలోని కంకిపాడులో చోటు చేసుకుంది. ఒక హోంగార్డు అశ్లీల డ్యాన్సులు చేసిన వీడియో వైరల్ అయ్యింది. రీల్ లో మాదిరి.. రియల్ లైఫ్ లో తాను విధులు నిర్వర్తిస్తున్న శాఖలో బాధ్యతగా ఉండాలన్న కనీస విషయాన్ని మిస్ అయ్యారు. అందుకు తగ్గట్లే ఆయన శాఖాపరమైన శిక్షకు గురయ్యారని చెప్పాలి. కంకిపాడు రూరల్ సీఐ జీప్ డ్రైవర్ గా పని చేస్తున్న హోంగార్డు అజయ్ కుమార్ చిన్నారుల ఎదుట అశ్లీల డ్యాన్సులు చేయటాన్నిజిల్లా ఎస్పీ తీవ్రంగా పరిగణించారు.
ఒక కార్యక్రమంలో అతడు అశ్లీల డ్యాన్సులు చేయటం.. అది కూడా చిన్నారుల ఎదుట కావటం.. దానికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. హోంగార్డు తీరుపై మిశ్రమ స్పందన వ్యక్తం కాగా.. జిల్లా ఎస్పీవిద్యాసాగర్ నాయుడు మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీస్ శాఖ ప్రతిష్ఠను దెబ్బ తీసేలా వ్యవహరించటంపై మండిపడిన జిల్లా ఎస్పీ.. హోంగార్డు డ్యాన్సులపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని స్థానిక పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అదే సమయంలో సదరు హోంగార్డును విధులను నుంచి తప్పిస్తూ.. సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చేశారు. పోలీసు సిబ్బంది ప్రవర్తన పోలీసు శాఖ ప్రతిష్ఠను పెంచేలా ఉంచాలని.. అప్రతిష్ఠకు గురి చేసేలా ఎవరు వ్యవహరించినా.. వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవన్న వార్నింగ్ ఇచ్చేశారు. మొత్తానికి హద్దులు దాటిన హోంగార్డుకు షాకింగ్ అనుభవం ఎదురైందని చెప్పక తప్పదు.
