జనసేన వాయిస్ లో ఛేంజ్..? కూటమికి పవన్ మాత్రమే కారణం అంటున్న మంత్రి దుర్గేశ్
ఉప ముఖ్యమంత్రిపై మంత్రి కందుల దుర్గేశ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
By: Tupaki Political Desk | 25 July 2026 12:06 AM ISTఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై మంత్రి కందుల దుర్గేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల సమావేశంలో పవన్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఎక్కడ నెగ్గాలో కాదు... ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడు పవన్ అంటూ కీర్తించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి, రెండేళ్లుగా కూటమి ప్రభుత్వంలో అత్యద్భుత పాలన అందేందుకు పవన్ కారణమంటూ మంత్రి వ్యాఖ్యానించారు. విజయవాడ నగరంలో పార్టీ బలోపేతం కోసం నిర్వహిస్తున్న కార్యకర్తల సమావేశంలో మంత్రి దుర్గేశ్ ఈ వ్యాఖ్యలు చేస్తుండగా కార్యకర్తలు ఈలలు, కేకలతో హంగామా చేశారు.
ఉప ముఖ్యమంత్రిపై మంత్రి కందుల దుర్గేశ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయవాడలో శుక్రవారం జరిగిన సమావేశంలో జనసేన కీలక నేతలు అంతా పాల్గొన్నారు. భుజం నొప్పికారణంగా అధినేత పవన్ ఈ సమావేశానికి హాజరుకాలేదు. కానీ, మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ ప్రసంగించిన తీరు తీవ్ర చర్చకు దారితీస్తోంది. సమావేశంలో తొలుత మాట్లాడిన మంత్రి నాదెండ్ల మనోహర్ స్థానిక ఎన్నికల్లో పోటీతోపాటు పార్టీలో గ్రూపులు లేవని, అందరం పవన్ గ్రూపు మాత్రమేనంటూ చెప్పుకొచ్చారు. ఇక సాయంత్రం మంత్రి దుర్గేశ్ మాట్లాడుతూ పవన్ పై ఓ రేంజ్ లో పొగడ్తెలు కురిపించారు.
ఇలా కార్యకర్తల సమావేశంలో జనసేన మంత్రులు అధినేత కోసం గొప్పలు చెప్పడానికి పోటీ పడుతుండటం చర్చనీయంశం అవుతోంది. ప్రధానంగా కూటమిలో పవన్ లేకపోతే ప్రభుత్వమే లేదన్నట్లు మంత్రులు మాట్లాడిన మాటలు ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి. తమ త్యాగాల వల్లే కూటమి ప్రభుత్వం ఏర్పడిందని, తాము వెనక్కి తగ్గడం వల్లే ఆ నాడు కూటమి గెలిచిందని, తమ చొరవతోనే కూటమి వచ్చిందని జనసేన నేతలు పదేపదే చెబుతుండటం వెనుక ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా? అంటూ విశ్లేషకులు చర్చిస్తున్నారు.
అయితే కూటమిలో తాము లేకపోతే ఏమీ లేదని, తమకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే జనసేన నేతలు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కూటమి కోసం అంటూ జనసేనాని మళ్లీ వెనక్కి తగ్గితే స్థానిక ఎన్నికల్లో కార్యకర్తల ఒత్తిడి తట్టుకోలేమన్న భావనతో మిగిలిన మిత్రపక్షాలకు తమ ప్రాధాన్యం గుర్తు చేయాలనే ఆలోచనతో మంత్రులు ఈ తరహా ప్రకటనలు చేస్తున్నారని చెబుతున్నారు. అంతేకాకుండా కూటమిలో తమ న్యాయబద్ధమైన వాటా కోసం మంత్రులు కూడా గట్టిగా మాట్లాడుతున్నారని చెప్పడం కూడా ఇందులో ప్రధాన ఉద్దేశం అయివుండొచ్చని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి ఎన్నడూ లేనట్లు కూటమి విషయంలో పవన్ చొరవను గుర్తు చేస్తూ జనసేన నేతలు గట్టిగా చేస్తున్న సౌండ్ ఏపీ పాలిటిక్స్ లో సరికొత్త చర్చగా మారిందని అంటున్నారు.
