Begin typing your search above and press return to search.

జగన్ కే నో చెప్పిన వైసీపీ కీలక నేత ?

అంతే కాకుండా పార్టీలో తమకు అధికారంలో ఉన్నపుడు పెద్దగా ప్రాధాన్యత లభించని వైనాన్ని సైతం గుర్తు తెచ్చుకుంటూ అన్ని పరిస్థితులను బేరీజ్ వేసుకునే పనిలో ఉన్నారుట.

By:  Satya P   |   24 Oct 2025 9:30 AM IST
జగన్ కే నో చెప్పిన వైసీపీ కీలక నేత ?
X

వైసీపీలో ఇంకా స్తబ్దత అలా కొనసాగుతూనే ఉంది. పార్టీ ఓటమి చెంది ఏణ్ణర్ధానికి దగ్గర పడుతున్నా కూడా వైసీపీలో అయితే చురుకుదనం పుట్టడం లేదు, అధినేత సైతం బెంగళూరు టూ తాడేపల్లిగా టూర్లు వేస్తున్నారు అని అంటున్నారు. దాంతో పాటుగా పార్టీలో సీనియర్లు అయితే ఇంకా ఫీల్డ్ లోకి దిగటం లేదు, రాష్ట్రంలో రాజకీయాలను గమనిస్తున్నారు అని అంటున్నారు. అంతే కాకుండా పార్టీలో తమకు అధికారంలో ఉన్నపుడు పెద్దగా ప్రాధాన్యత లభించని వైనాన్ని సైతం గుర్తు తెచ్చుకుంటూ అన్ని పరిస్థితులను బేరీజ్ వేసుకునే పనిలో ఉన్నారుట.

ఆయన ఉలుకూ లేదు :

ఇక ప్రకాశం జిల్లాలో కందుకూరు నియోజకవర్గం ఉంది. అదిపుడు నెల్లూరులో చేరింది. ఇది చాలా కీలకమైన రాజకీయ ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గంగా చెబుతారు. ఈ నియోజకవర్గంలో మంచి పట్టు ఉన్న మానుగుంట మహీధర్ రెడ్డి ఇపుడు పూర్తిగా మౌన ముద్రలో ఉన్నారని అంటున్నారు. దానికి కారణం 2024 ఎన్నికల్లో జగన్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు, కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న బుర్రా మధుసూదన యాదవ్ ని తెచ్చి కందుకూరు టికెట్ ఇచ్చారు. దాంతో ఎన్నికల ముందే ఆయన పార్టీ మారుతారు అని వినిపించింది కానీ అవేమీ జరగలేదు, ఒక వైసీపీ ఓటమి తరువాత అయినా ఆయన పార్టీకి గుడ్ బై కొడతారు అని అనుకున్నారు. కానీ ఆయన మాత్రం పూర్తిగా సైలెంట్ గా ఉండిపోతున్నారు.

బలమైన నాయకత్వం :

కందుకూరులో మంచి బలం ఉన్న నాయకత్వంగా మానుగుంట మహీధర్ రెడ్డిది చెబుతారు. ఆయన తండ్రి కాలం ముంచి రాజకీయాల్లో ఉన్నారు. అలాగే తండ్రి ఆదినారాయణరెడ్డి మూడు సార్లు కందుకూరు నుంచి గెలిస్తే కుమారుడిగా మహీధర్ రెడ్డి మరో మూడు సార్లు గెలిచారు. అంతలా పట్టున్న నేత కావడంతోనే ఆయన ఉంటే పార్టీకి ప్లస్ అని అంటారు. మంత్రిగా కూడా పనిచేసిన మానుగుంట విషయంలో అధినాయకత్వం అధికారంలో ఉన్నపుడు ఉదాశీనంగా వ్యవహరించింది అని అంటారు. మానుగుంట ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రి పదవి అయితే ఆయనకు ఇవ్వలేదు. దాంతోనే ఆయన అసంతృప్తి చెందారు అనుకుంటే 2024లో ఏకంగా టికెట్ ని నిరాకరించడంతో ఆయన పూర్తిగా మౌనం వహించారు అని అంటున్నారు.

జగన్ కోరినా :

ఇదిలా ఉంటే తాజాగా జగన్ కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిస్థితులను పరిగణలోకి తీసుకుని మానుగుంటను పిలిచి మాట్లాడాలని అనుకున్నారుట. ఆయన పిలిచినా కూడా వెళ్ళేందుకు ఈ సీనియర్ నేత అంగీకరించలేదని ప్రచారం అయితే సాగుతోంది. దాంతో ఇది ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. మానుగుంట పార్టీలో ఉంటారా లేక వేరే ఆలోచనలు చేస్తున్నారా అన్నది కూడా వైసీపీలో చర్చించుకుంటున్నారు. కందుకూరులో చూస్తే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు అయింది. నాటి నుంచి పార్టీ యాక్టివిటీస్ పెద్దగా సాగడం లేదు అని అంటున్నారు.

కలకలం రేపిన హత్య :

ఇదిలా ఉంటే ఇటీవల కందుకూరులో ఒక హత్య పెను సంచలనం రేపింది. రెండు సామాజిక వర్గాల మధ్య గ్యాప్ కి దారి తీసే విధంగా ఈ హత్య అనంతరం పరిణామాలు కూడా సాగాయి. ఇతర ప్రాంతాల నుంచి వైసీపీ నేతలు వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కానీ మానుగుంట మాత్రం ఎక్కడా కనిపించడం లేదు అని అంటున్నారు. దాంతో కందుకూరులో కూటమి రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కూడా వైసీపీ యాక్టివ్ కాలేకపోయింది అని అంటున్నారు.

గుడ్ బై కొడతారా :

ఇక మానుగుంట వైఖరి చూస్తే ఆయన రాజకీయాలకు గుడ్ బై కొడతారు అని అంటున్నారు. ఆయన ఈ మధ్య ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాలలోనే కనిపిస్తున్నారు అని అంటున్నారు. అందుకే ఆయన ఏ పార్టీ వైపు చూడడం లేదని అంటున్నారు. చేసిన రాజకీయం చాలు అని ఆయన నిర్ణయించుకుంటే కనుక వైసీపీకి కందుకూరులో పెద్ద దెబ్బ పడినట్లే అని అంటున్నారు మానుగుంట వంటి బిగ్ షాట్ ని చేజార్చుకోవడం మంచిది కాదనే అంటున్నారు. ఏదో విధంగా ఆయనను కానీ లేక ఆయన వారసులను కానీ తీసుకుని వస్తేనే వైసీపీకి అక్కడ మంచి భవిష్యత్తు ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.