మెట్రో నగరాల కంటే చిన్న పట్టణాలే డేంజర్? కాంచీపురం రికార్డు చూస్తే షాక్!
ఒకప్పుడు డేటింగ్ సంస్కృతి అంటే కేవలం మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమైన అంశాలుగా భావించేవారు.
By: Tupaki Political Desk | 22 Jun 2026 8:00 PM ISTఒకప్పుడు డేటింగ్ సంస్కృతి అంటే కేవలం మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమైన అంశాలుగా భావించేవారు. కానీ, గత కొన్నేళ్లుగా దేశంలో సామాజిక ముఖచిత్రం వేగంగా మారుతోందని చెబుతున్నారు. మారుమూల ప్రాంతాల్లో కూడా స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరగడం, హై-స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యంతో ప్రజల జీవనశైలి, ఆలోచనా దృక్పథం పూర్తిగా మారుతోందని అంటున్నారు. తాజా గణాంకాలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి: ఇప్పుడు సంబంధాలను ప్రోత్సహించే డేటింగ్ యాప్‌ల వినియోగం మెట్రో నగరాల కంటే చిన్న పట్టణాల్లోనే ఎక్కువగా ఉందనే సమాచారం తీవ్ర సంచలనంగా మారింది.
అగ్రస్థానంలో కాంచీపురం
డేటింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రముఖ గ్లోబల్ డేటింగ్ ప్లాట్‌ఫామ్ ‘యాష్లే మాడిసన్’ వెల్లడించిన నివేదిక ప్రకారం, ఈ జాబితాలో తమిళనాడులోని కాంచీపురం నగరం వరుసగా రెండో ఏడాది దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. పట్టుచీరలకు, ఆధ్యాత్మిక క్షేత్రాలకు ప్రసిద్ధి చెందిన ఈ నగరం, ఇప్పుడు డిజిటల్ డేటింగ్ యాప్‌ల వినియోగంలో సంచలనం సృష్టిస్తోంది. కాంచీపురం తర్వాతి స్థానాల్లో కోయంబత్తూరు, తిరువళ్లూరు, చెన్నై వంటి నగరాలు ఉండటం గమనార్హం. దీనిని బట్టి దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడులో ఈ ధోరణి ఎంత వేగంగా విస్తరిస్తుందో అర్థం చేసుకోవచ్చునని అంటున్నారు.
టాప్-3 దేశాల్లో భారత్ ఒకటి
భారతదేశంలో ఈ యాప్‌ల వినియోగం కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాలేదని అంటున్నారు. గ్లోబల్ స్థాయిలో ఈ ధోరణిని గమనిస్తే, గత ఏడాది 20 దేశాల జాబితాలో 8వ స్థానంలో ఉన్న భారత్, ఈ ఏడాది ఏకంగా 3వ స్థానానికి చేరుకోవడం విశేషం. అంతేకాకుండా, ‘గ్లీడెన్’ వంటి ఇతర ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లలో కూడా భారతీయ యూజర్ల సంఖ్య 40 లక్షల మార్కును దాటిందని అంటున్నారు. దేశంలో పెరుగుతున్న ఈ డిజిటల్ కమ్యూనిటీ ఎటు దారితీస్తుందోనన్న టెన్షన్ ఎక్కవవుతోందని అంటున్నారు. యువతతో పాటు వివాహితులు కూడా ఈ యాప్‌ల వైపు మొగ్గు చూపడం సామాజిక విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
చిన్న పట్టణాల్లో ఇటువంటి యాప్‌ల వినియోగం పెరగడానికి పలు కారణాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా దాంపత్య జీవితంలో ఏర్పడుతున్న కమ్యూనికేషన్ గ్యాప్, ఒంటరితనం, దైనందిన జీవితంలో ఎదురయ్యే విసుగు నుంచి బయటపడటానికి కొందరు ఇంటర్నెట్ వేదికలను ఆశ్రయిస్తున్నారు. అలాగే, డిజిటల్ మాధ్యమాల్లో గోప్యత భద్రంగా ఉంటుందనే నమ్మకం కూడా ఒక కారణంగా మారుతోంది. పాత తరం ఆలోచనలకు భిన్నంగా, నేటితరం తమ వ్యక్తిగత స్వేచ్ఛకు, కోరికలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుండటం ఇందుకు ప్రధాన ఊతమిస్తోందని చెబుతున్నారు.
ఈ ధోరణిని కేవలం ఒక వ్యక్తిగత ఎంపికగా చూడలేమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది భారతీయ కుటుంబ వ్యవస్థ పునాదులపై లోతైన ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఆధునిక సాంకేతికత అందిస్తున్న స్వేచ్ఛా వాతావరణం, మరోవైపు సాంప్రదాయ విలువలకు, నమ్మకానికి మధ్య పెరుగుతున్న సంఘర్షణ భవిష్యత్తులో అనేక సామాజిక సవాళ్లకు దారితీయవచ్చునని అంటున్నారు. ‘సంబంధాల విషయంలో ఓపెన్ మైండ్‌తో ఉండటం’ అనేది వ్యక్తిగత స్వేచ్ఛ అయితే, అది భావోద్వేగ భద్రతను, కుటుంబ స్థిరత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే అంశంపై మరింత లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు.
