కాకినాడపై పట్టు కోల్పోతున్న కన్నా.. ఏం జరిగింది ..!
కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నుంచి 2019లో విజయం దక్కించుకున్న కన్నబాబు.. గత ఎన్నికల్లో ఓడిపోయారు.
By: Garuda Media | 28 Oct 2025 7:00 AM ISTకాకినాడ రూరల్ నియోజకవర్గంలో నుంచి 2019లో విజయం దక్కించుకున్న కన్నబాబు.. గత ఎన్నికల్లో ఓడిపోయారు. వైసీపీ హయాంలో వ్యవసాయ మంత్రిగా పనిచేసినా.. అనుకున్న రేంజ్‌లో ఆయన పట్టు సాధించలేక పోయారన్న వాదనా ఉంది. దీనికి తోడు.. నియోజకవర్గంలో ఎక్కువగా రైతులు ఉండడం.. వ్యవసాయ భూములు కూడా ఉన్న నేపథ్యంలో తమకు న్యాయం చేస్తారని.. ఇక్కడి రైతులు ఆశించారు. కానీ, ఆయన పాలనా కాలంలో పెద్దగా సంచలన నిర్ణయాలు ఏవీ తీసుకోలేక పోయారు.
ఇక, ఇప్పుడు కన్నబాబుకు రెండు పదవులు ఇచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు వైసీపీ ఇంచార్జ్‌గా ఆయనను నియమించారు. మాజీ ఎమ్మెల్యేగా కాకినాడ రూరల్ ఇంచార్జ్‌గా కూడా ఆయనే ఉన్నారు. ఈ రెండు పదవు లను కూడా ఆయన సరిగా నిర్వహించలేక పోతున్నారన్నది వైసీపీలో జరుగుతున్న చర్చ. ఇక, ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఓ వర్గం ఆయనను దూరం పెట్టింది. ఇప్పటికీ రెండు వర్గాలుగా కాకినాడ రూరల్‌లో వ్యవహరిస్తున్నాయి. ఫలితంగా కన్నబాబుకు పెద్దగా ఫాలోయింగ్ లేకుండా పోయింది.
పార్టీ తరఫున ఇటీవల కందుకూరు హత్యపై నిరసన చేపట్టినప్పుడు.. ఆయన రోడ్డెక్కినా.. పెద్దగా జనాలు రాలేదు. పార్టీలో తనను సమర్థించే కొందరు మాత్రమే వచ్చారు తప్ప.. గత 2019లో తన విజయానికి కారణ మైన కాపు సామాజిక వర్గం నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు.ఈ వ్యవహారంపై కన్నబాబు సమీక్షించు కున్నారు. మనోళ్లు ఏమయ్యారంటూ.. ఆరా తీశారు. అయితే.. అధికారంలో ఉన్నప్పుడు వారిని పట్టించు కోలేదన్న చర్చ తెరమీదకి వచ్చింది. దీనిలో తన తప్పులేదని.. ఆయన చెప్పుకొచ్చారు.
మరోవైపు ఉత్తరాంధ్ర రాజకీయాలకు అనుకూలంగా కన్నబాబు ఇప్పటికీ నిర్ణయాలు తీసుకోలేక పోతున్నా రు. ఇక్కడి రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. గతంలో సాయిరెడ్డి చూపించిన దూకుడు కన్నబాబు చూపించలేక పోవడానికి కారణం ఇదే. పైగా.. ఆయన కాకినాడ టు.. విశాఖ టూర్లు చేస్తున్నారు. ఇతర రెండు జిల్లాల్లో ఇప్పటి వరకు దృష్టి పెట్టలేదు. ఫలితంగా ఉత్తరాంధ్రలో కన్నబాబు బలమైన ముద్ర వేయలేక పోతున్నారు. ప్రస్తుతం ఎవరికి వారుగా ఉన్న ఉత్తరాంధ్ర వైసీపీ నేతలను ఐక్యం చేసేందుకు కూడా కన్నబాబు ప్రయత్నించలేక పోతున్నారని నాయకులు చర్చించుకుంటున్నారు.
