Begin typing your search above and press return to search.

కమ్మ సామాజికవర్గం 'పవర్' ప్లే.. డిప్యూటీ సీఎం పదవి కోసం డిమాండ్!

తమిళనాడు అసెంబ్లీకి మరో మూడు నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీలు ఎన్నికల సన్నాహాలు మొదలుపెట్టాయి.

By:  Tupaki Political Desk   |   9 Feb 2026 9:00 PM IST
కమ్మ సామాజికవర్గం పవర్ ప్లే.. డిప్యూటీ సీఎం పదవి కోసం డిమాండ్!
X

సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బలమైన ముద్ర వేసిన కమ్మ సామాజికవర్గంలో ఇంకా అసంతృప్తి ఉందా? రాజకీయంగా తమ ప్రభావం మరింత పెంచుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా కావాలని కోరుకుంటుందా? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గణనీయమైన రాజకీయ అధికారం చెలాయిస్తున్న కమ్మ సామాజికవర్గం పక్కనే ఉన్న తమిళనాడులోనూ ప్రభావం చూపాలని ఆకాంక్షిస్తోంది. తమిళనాట దాదాపు 8 శాతం ఓటు బ్యాంకు ఉన్న కమ్మ సామాజికవర్గం ఈ సారి ఎన్నికల్లో ఎక్కువ సీట్లు, ఉప ముఖ్యమంత్రి పదవి కోరుకుంటోంది. ఇందుకోసం పార్టీలపై ఒత్తిడి తీసుకురావడానికి కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ పేరిట ఆదివారం చెన్నైకి సమీపంలోని శ్రీపెరంబదూరులో భారీ సభ నిర్వహించింది.

తమిళనాడు అసెంబ్లీకి మరో మూడు నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీలు ఎన్నికల సన్నాహాలు మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో తమ రాజకీయ లక్ష్యాలను చేరుకునేలా కమ్మ సామాజికవర్గం పావులు కదుపుతోంది. తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన జెట్టి కుసుమకుమార్ నేతృత్వంలో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ పేరిట భారీ సమావేశం నిర్వహించారు. గతంలో హైదరాబాద్ లో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన కుసుమకుమార్ ఆదివారం చెన్నైకి సమీపంలో కమ్మ సమ్మేళనం ఏర్పాటు చేశారు.

తమిళనాట దాదాపు 65 లక్షల మంది కమ్మ సామాజికవర్గం వారు నివసిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. వీరంతా ప్రధానంగా చెన్నై, తిరువళ్లూరు, కోయంబత్తూరు, ఈరోడ్, మధురై, విరుదునగర్, రాజపాళయం వంటి ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు చెబుతున్నారు. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో ఈ వర్గం అత్యంత శక్తివంతమైనదిగా ఉంది. రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో కమ్మల ఓటు బ్యాంకు ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తుందని అంటున్నారు. వీరి ఓట్లతో గెలుపోటములు తారుమారు అయ్యే అవకాశం ఉండటంతో కమ్మ సామాజికవర్గానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని చెబుతున్నారు.

అయితే ఓట్ల పరంగా తమను వాడుకోవడమే కానీ, రాజకీయంగా సరైన అవకాశాలు కల్పించడం లేదని తమిళనాడులో నివసిస్తున్న కమ్మ సామాజికవర్గం అసంతృప్తిగా ఉందని అంటున్నారు. దీంతో ఇప్పటివరకు తమిళనాడు రాజకీయాల్లో తెరవెనుక చక్రం తిప్పిన కమ్మ సామాజికవర్గం వారు ఇక నుంచి అధికార పీఠంలో వాటా కోరాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం ద్వారా తమ రాజకీయ ఆకాంక్షలను బహిరంగంగానే వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపోటములను శాసించే స్థాయిలో ఉన్న తాము.. కేవలం ఓటర్లుగానే కాకుండా, డిప్యూటీ సీఎం పదవిని పొందే స్థాయికి ఎదగాలని కోరుకోవడం ఇప్పుడు ద్రవిడ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

తమిళ రాజకీయాల్లో ఇప్పటివరకు సైలెంట్ ఓటర్లుగా ఉన్న కమ్మ సామాజికవర్గం, ఇప్పుడు 'కమ్మ గ్లోబల్ ఫెడరేషన్' వేదికగా గళమెత్తడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తాము కేవలం ఓటు బ్యాంకు మాత్రమే కాదని, పాలనలో భాగస్వాములమని కమ్మ నేతలు కోరుకుంటుండటం హాట్ టాపిక్ గా మారింది. వీరి డిమాండ్లను ద్రవిడ పార్టీలు ఎలా స్పందిస్తాయో, రాబోయే ఎన్నికల సమీకరణాలు ఎలా మారుతాయో వేచి చూడాలని అంటున్నారు.

ఇక తమిళనాట 8 శాతం ఓటు బ్యాంకు ఉన్న 65 లక్షల మంది కమ్మ సామాజికవర్గం వారితో పాటు ఇతర తెలుగువారు, తెలుగు మూలాలు ఉన్న ఓటర్లు ఎన్నికల్లో కీలకంగా మారనున్నారని చెబుతున్నారు. తమిళనాడులో దాదాపు 2.5 కోట్ల మంది తెలుగు మూలాలు ఉన్నవారు నివసిస్తున్నట్లు అంచనా. వీరిలో ఎక్కువ మంది ఇళ్లల్లో తెలుగు మాట్లాడుతున్నా, బయట మాత్రం తమిళులుగానే చలామణీ అవుతున్నారు. అయితే రాజకీయంగా తమ ప్రభావం చూపే సమయంలో తెలుగు మూలాలను తెరపైకి తీసుకువస్తుంటారని అంటున్నారు. దీంతో ఈసారి తమిళ రాజకీయాల్లో తెలుగు ప్రభావం కూడా ఘననీయంగా ఉండనుందని అంచనా వేస్తున్నారు.