Begin typing your search above and press return to search.

చిరంజీవి-బాలయ్య వివాదం: కామినేని నష్ట నివారణ

సినీ నటులపై తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ రాష్ట్ర శాసనసభలో వివరణ ఇచ్చారు.

By:  A.N.Kumar   |   27 Sept 2025 4:38 PM IST
చిరంజీవి-బాలయ్య వివాదం: కామినేని నష్ట నివారణ
X

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు నిన్న మాజీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు, దానికి నందమూరి బాలకృష్ణ తీవ్రంగా స్పందించడం, ఆపై చిరంజీవి ప్రకటనతో రగిలిన వివాదం.. చివరకు కామినేని ఉపసంహరణతో మరో మలుపు తిరిగింది. తాను చేసిన వ్యాఖ్యలు అపార్థానికి దారితీశాయని చెబుతూ, వాటిని సభ రికార్డుల నుంచి తొలగించాలని కోరుతూ కామినేని శ్రీనివాసరావు స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ మొత్తం పరిణామం రాజకీయంగా అధికార టీడీపీకి లాభం కంటే నష్టమే ఎక్కువ చేసిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

సినీ నటులపై తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ రాష్ట్ర శాసనసభలో వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వద్దకు వెళ్లిన సినిమా నటులను అవమానించేలా తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేకాకుండా, ఆ వ్యాఖ్యలను సభా రికార్డుల నుంచి తొలగించాలని కూడా స్పీకర్‌ను కోరారు.

దీనిపై స్పందించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు, ఇది మంచి పరిణామంగా అభివర్ణించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడితో మాట్లాడి ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని ఆయన సభకు తెలియజేశారు. కామినేని తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని రికార్డుల నుంచి తొలగించాలని కోరడంతో, కొద్ది రోజులుగా సాగుతున్న ఈ వివాదానికి తెరపడినట్లైంది.

బాలకృష్ణ వ్యాఖ్యలతో రాజుకున్న వివాదం

వాస్తవానికి కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై ఆ తరువాత హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్స్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చర్చకు దారి తీశాయి. ఈ నేపథ్యంలోనే కామినేని తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

జనసేన ఎమ్మెల్యేల హర్షం

కామినేని వ్యాఖ్యల ఉపసంహరణపై జనసేన ఎమ్మెల్యేలు సుందరపు విజయ్ కుమార్, బొలిశెట్టి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడుతూ.. సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడటం సరికాదనే అభిప్రాయంతోనే ఎమ్మెల్యే కామినేని ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని చెప్పారని, ఇది స్వాగతించదగిన పరిణామం అని అన్నారు.

సభలో కేవలం ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి మాత్రమే తమకు సమయం ఉంటుందని జనసేన ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. కేవలం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం మాత్రమే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని వారు పునరుద్ఘాటించారు. ఈ మొత్తం ఎపిసోడ్‌తో సినీ నటులపై చేసిన వ్యాఖ్యల వివాదం ముగిసినట్లు అయింది.