సభకు రాకున్నా మూడు ముక్కలాట ఉందా లేదా చెప్పేయ్ జగన్
ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలు పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By: Garuda Media | 25 Sept 2025 9:34 AM ISTప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలు పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారింది. అమరావతి రాజధానిగా ఉందా? లేదంటే మూడు ముక్కలాటేనా? అన్నది పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అన్ని మంత్రిత్వ శాఖల తరఫున మాట్లాడే సజ్జల.. అమరావతిపై ప్రకటన చేస్తే సరిపోదని పేర్కొన్నారు.
జగన్ సభకు రావట్లేదని.. తనకు నచ్చిన మీడియా సంస్థల్ని ఎంపిక చేసి మాట్లాడుతుంటారని.. అందుకే సభకు రాని పులివెందుల ఎమ్మెల్యే అమరావతిపై తన అభిప్రాయాన్నిచెప్పాలన్నారు. మూడు ముక్కలాట మీద స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా అమరావతిపై జగన్ తీసుకున్న నిర్ణయం కారణంగా వేలాది మంది కార్మికుల కష్టం వేస్టు అయిపోయిందన్నారు.
2014-19 మధ్యన అమరావతిలో 30 వేల మంది కార్మికులు పని చేశారని.. 2019-24 మధ్య అమరావతిని అడవిగా మార్చిన జగన్ కారణంగా ఏపీ రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితికి తీసుకొచ్చారన్నారు. రాజధాని అమరావతి ప్రాంతాన్నిజగన్ అడవిలా మార్చారన్న కామినేని..కొవిడ్ సందర్భంగా చోటుచేసుకున్న ఒక ఉదంతం గురించి చెప్పుకొచ్చారు.
జగన్ మైండ్ సెట్ ఎలా ఉంటుందన్న విషయాన్ని వివరించే క్రమంలో కామినేని ఒక ఉదంతం గురించి చెప్పుకొచ్చారు. ఇందులో నిజం ఎంతన్నది పక్కన పెడితే.. జగన్ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసేలా ఆయన ఉదాహరణ ఉందని చెప్పాలి. ‘‘రిటైర్ అయిన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి 2020 మార్చి 15న ఉదయం పది గంటల వేళలో జగన్ ను కలిశారు. కరోనా రెండో దశ వస్తుందని.. కేంద్రం నుంచి సూచన వచ్చినట్లుగా వివరించారు. జగన్ మాత్రం అదేమీ లేదని కొట్టిపారేశారు. రాత్రి ప్రభువు తనతో మాట్లాడారని రెండో దశ రావటం లేదని.. మీరేమీ పట్టించుకోవద్దని చెప్పారు. ఎవరి దేవుడు వారికి గొప్ప. అంతా గౌరవించాల్సిందే. తప్పకుండా మేమూ గౌరవిస్తాం’ అని చెప్పారు.
ఇంతలో కరోనా బాంబు పేలిందని.. అప్పట్లో ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పంచాయితీ ఎన్నికల్ని వాయిదా వేయటంతో జగన్ ఉగ్రరూపాన్ని చూసి అధికారులంతా భయపడిపోయారన్నారు. ఎవరూ ఇళ్ల నుంచి కదల్లేని పరిస్థితుల్లో నిజంగా పంచాయితీ ఎన్నికలు జరిగి ఉంటే.. రాష్ట్రంలో మరెన్ని మరణాలు సంభవించేవో.. ఇలా ఉంటుంది జగన్ మైండ్ సెట్ అంటూ.. చెప్పుకొచ్చారు.
