107 డేస్ : బైడెన్ పై కమలా హారిస్ బిగ్ బాంబ్.. అమెరికా రాజకీయాలు షేక్
అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తన ఆత్మకథ “107 డేస్” ద్వారా అమెరికా రాజకీయ వాతావరణంలో సంచలనాలు రేపారు.
By: A.N.Kumar | 11 Sept 2025 11:08 PM ISTఅమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తన ఆత్మకథ “107 డేస్” ద్వారా అమెరికా రాజకీయ వాతావరణంలో సంచలనాలు రేపారు. ఈ పుస్తకం సైమన్ అండ్ షూస్టర్ ద్వారా విడుదల కాగా, ఇందులో ఆమె మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ బాంబుల్లా మారాయి.
బైడెన్ అహంకారమే ఓటమికి కారణం?
హారిస్ పుస్తకంలో 2024 అధ్యక్ష ఎన్నికల ఓటమికి ప్రధాన కారణం బైడెన్ అహంకారం, అవివేకం అని స్పష్టం చేశారు. మరోసారి పోటీకి దిగాలని తీసుకున్న ఆయన నిర్ణయం "దేశ ప్రయోజనాల కంటే వ్యక్తిగత అహంకారం" ఆధారంగా ఉందని తీవ్ర విమర్శలు చేశారు. “ఇది క్షమాశీలత కాదు, ఇది అవివేకం” అంటూ బైడెన్ నిర్ణయాన్ని ఆమె తిప్పికొట్టారు.
డిబేట్ వైఫల్యం.. ఎన్నికల పరాజయం
2024 జులైలో జరిగిన అధ్యక్ష ఎన్నికల డిబేట్‌లో బైడెన్ పేలవ ప్రదర్శన తర్వాత రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కానీ అప్పటికే నష్టం జరిగిపోయిందని, ఆ తర్వాత తాను పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగినా రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓటమి తప్పలేదని హారిస్ స్పష్టం చేశారు.
వైట్ హౌస్‌లో పక్కన పెట్టిన హారిస్?
తన ఉపాధ్యక్ష పదవికాలంలో వైట్ హౌస్‌తో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ఆమె మరో సంచలనాన్ని బయటపెట్టారు. బైడెన్ సన్నిహితులు తనను పక్కన పెట్టారని, ఎన్నికల ప్రచారంలో తన ప్రాధాన్యాన్ని తగ్గించారని ఆరోపించారు. ప్రత్యేకించి, అమెరికా–మెక్సికో సరిహద్దు సమస్యపై తాను చేసిన ప్రయత్నాలకు మద్దతు ఇవ్వకుండా “border czar” అంటూ వ్యతిరేక ప్రచారం జరిపారని అసంతృప్తి వ్యక్తం చేశారు. గాజా సమస్యపై తన ప్రసంగాలు వైరల్ అయిన సమయంలో కూడా వైట్ హౌస్‌లోని వెస్ట్ వింగ్ అసహనం వ్యక్తం చేసిందని వ్యాఖ్యానించారు.
డెమొక్రటిక్ పార్టీలో విబేధాల బహిర్గతం?
“107 డేస్” పుస్తకం డెమొక్రటిక్ పార్టీలోని అంతర్గత విబేధాలను బహిర్గతం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది రాబోయే రోజుల్లో పార్టీకి తలనొప్పిగా మారే అవకాశం ఉందని, ముఖ్యంగా ట్రంప్ లాంటి నాయకులకు ఇది బలమైన ఆయుధమని అంటున్నారు.
కమలా హారిస్ పుస్తకం కేవలం రాజకీయ స్మృతిగ్రంథం మాత్రమే కాదు, డెమొక్రటిక్ పార్టీలోని లోతైన విభేదాలను బహిర్గతం చేసే పత్రంగా మారింది. బైడెన్‌పై చేసిన విమర్శలు, వైట్ హౌస్ లోపలున్న అనుభవాల వర్ణన అమెరికా రాజకీయాల్లో మరోసారి చర్చకు దారి తీస్తున్నాయి. ఈ పుస్తకం నిజంగానే కొత్త చరిత్రను రాస్తుందా లేక కేవలం ఒక రాజకీయ ప్రతీకార కబురుగా మిగిలిపోతుందా అన్నది చూడాల్సి ఉంది.
