రజనీ వ్యాఖ్యలపై కమల్ రియాక్షన్.. 20 ఏళ్ల సీక్రెట్ రివీల్!
కోలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే కాకుండా యావత్ దక్షిణ భారత రాజకీయ, సినీ వర్గాల్లో ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.
By: A.N.Kumar | 17 May 2026 11:46 PM ISTకోలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే కాకుండా యావత్ దక్షిణ భారత రాజకీయ, సినీ వర్గాల్లో ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. సినిమా రంగంలోనే కాక, రాజకీయ తెరపైనా తమదైన ముద్ర వేస్తున్న అగ్ర నాయకుల మధ్య సంబంధాల గురించి రజనీకాంత్ మాట్లాడిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా తమిళనాడు నూతన ముఖ్యమంత్రి, 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) అధినేత విజయ్‌పై తనకు ఎలాంటి అసూయ లేదని రజనీకాంత్ స్పష్టం చేయడం.. ఈ వ్యవహారంపై లోకనాయకుడు కమల్ హాసన్ స్పందిస్తూ తామిద్దరి మధ్య ఉన్న 20 ఏళ్ల నాటి రహస్య ఒప్పందాన్ని బయటపెట్టడం తమిళ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది.
ఇటీవల తమిళనాడులో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రజనీకాంత్ లక్ష్యంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సినీ నటుడు విజయ్ రాజకీయాల్లోకి వచ్చి అనతికాలంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం సంచలనం సృష్టించింది. అయితే సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్‌ను కలవాల్సిందిగా రజనీకాంత్‌కు ఆహ్వానం అందినప్పటికీ ఆయన వెళ్లకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.
మరోవైపు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్‌ను రజనీకాంత్ స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి కలవడం రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలకు తావిచ్చింది. విజయ్ సాధించిన రాజకీయ ఎదుగుదలను, ఆయన సీఎం కావడాన్ని రజనీకాంత్ జీర్ణించుకోలేకపోతున్నారని, ఆ అసూయ వల్లే విజయ్‌కు దూరంగా ఉంటున్నారంటూ సోషల్ మీడియా వేదికగా రజనీపై తీవ్ర ప్రచారం సాగింది.
రజనీకాంత్ కౌంటర్.. "నాకు అసూయ ఉంటే అది కమల్‌పైనే ఉండాలి!"
ఈ సుదీర్ఘ వివాదంపై తాజాగా మీడియా ముందుకు వచ్చిన సూపర్‌స్టార్ రజనీకాంత్ తనదైన శైలిలో స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న విమర్శలను నవ్వుతూ కొట్టిపారేసిన ఆయన.. విజయ్ ఎదుగుదలపై తనకు ఎలాంటి ఈర్ష్యా ద్వేషాలు లేవని స్పష్టం చేశారు. "నాకు ఒకవేళ సినీ రంగంలో ఎవరిపైనైనా అసూయ ఉండాలి అనుకుంటే అది నా సమకాలీనుడు, గొప్ప నటుడైన కమల్ హాసన్‌పై ఉండాలి. అంతేగానీ విజయ్‌పై నాకు అసూయ ఎందుకు ఉంటుంది?" అని రజనీకాంత్ వ్యాఖ్యానించారు.
విజయ్ ఇంత త్వరగా సీఎం కావడం తనకు కొంత షాక్ ఇచ్చిందనే విషయాన్ని రజనీ అంగీకరించినప్పటికీ.. రాజకీయాల్లో ఎవరైనా సరే ప్రజా మద్దతుతోనే ఎదుగుతారని, విజయ్ సాధించిన విజయానికి ప్రజా బలమే కారణమని ఆయన పేర్కొన్నారు.
కమల్ హాసన్ పరిణతి.. 20 ఏళ్ల పాత ఒప్పందం వెలుగులోకి..
రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై విశ్వనాయకుడు కమల్ హాసన్ స్పందించిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకోవడమే కాకుండా వారి మధ్య ఉన్న బంధాన్ని చాటిచెప్పింది. రజనీ వ్యాఖ్యలను కమల్ ఎంతో పరిపక్వతతో స్వాగతించారు. తామిద్దరి మధ్య ఉన్నది కేవలం ఆరోగ్యకరమైన పోటీ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ గత ఇరవయ్యేళ్ల క్రితం తామిద్దరూ చేసుకున్న ఒక ఆసక్తికరమైన ఒప్పందాన్ని బహిర్గతం చేశారు. ‘‘తామిద్దరం ఇరవయ్యేళ్ల వయసులో కెరీర్ ప్రారంభంలో ఉన్నప్పుడే ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నామని కమల్ చెప్పారు. వృత్తిపరంగా ఎంతటి పోటీ ఉన్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకోకూడదని ఆనాడే ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. తాము సినిమా రంగంలోనే కాకుండా ఒకవేళ క్రికెట్ వంటి మరే ఇతర రంగంలో ఉన్నా కూడా తమ మధ్య ఇదే తరహా ఆరోగ్యకరమైన పోటీ ఉండేదని కమల్ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా రజనీకాంత్, కమల్ హాసన్ వ్యాఖ్యలపై నెటిజన్లు, సినీ విశ్లేషకులు విస్తృతంగా చర్చిస్తున్నారు. ఒకవైపు తమిళనాడు రాజకీయాలు వేడెక్కుతున్న తరుణంలో.. దశాబ్దాల కాలంగా పరిశ్రమను ఏలుతున్న ఇద్దరు అగ్ర నటులు పరస్పర గౌరవాన్ని ఎలా కాపాడుకుంటున్నారో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సమకాలీన రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలతో వాతావరణం కలుషితమవుతున్న వేళ రజనీ-కమల్‌ల నడుమ ఉన్న ఈ సత్సంబంధాలు.. పరిణతి యువ తరానికి ఆదర్శంగా నిలుస్తాయని చెప్పక తప్పదు.
