మస్క్ కు గడ్డి పెట్టిన కమల్ హాసన్.. తాజా పోస్టులో వాయించేశాడు
గడిచిన రెండు.. మూడు రోజులుగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేస్తున్న పోస్టుల పంచాయితీ తెలిసిందే.
By: Garuda Media | 10 Oct 2026 11:00 PM ISTగడిచిన రెండు.. మూడు రోజులుగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేస్తున్న పోస్టుల పంచాయితీ తెలిసిందే. భారత ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ అతను చేస్తున్న విమర్శలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మస్క్ పోస్ట్ పెట్టినంతనే కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల గాంధీ స్పందించిన వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారతదేశ ప్రధాని పదవిలో కూర్చునేందుకు తహతహలాడుతున్న రాహుల్.. మస్క్ చేస్తున్న దాడిని అర్థం చేసుకునే విషయంలో ప్రదర్శిస్తున్న వైఖరిపై కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ప్రముఖ నటుడు కం రాజకీయ నేత కమల్ హాసన్ స్పందించిన తీరు చూస్తే.. ఈ మాత్రం అవగాహన రాహుల్ లో మిస్ అయ్యిందన్న భావన కలుగక మానదు.
మస్క్ పెడుతున్న పోస్ట్ లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కమల్ హాసన్. ‘‘మిస్టర్ మస్క్.. భారతీయుడైనా.. అమెరికన్ అయినా ఏ బిలియనీర్ కూడా ఒక దేశ విధానాల్ని శాసించకూడదు’’ అంటూ సింఫుల్ గా ఒక్క ముక్కలో తేల్చేశారు. స్టార్ లింక్ కంపెనీకి అనుమతులు ఇచ్చే విషయంలో అంతులేని జాప్యం జరుగుతుందన్న మస్క్ మాటల్లో వాస్తవం కొంతమాత్రమే. ఆయన తరహాలోనే సేవలు అందించేందుకు మస్క్ మాదిరే లైసెన్స్ కోసం దరఖాస్తు చేస్తున్న రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ సంస్థలకు కూడా భారత ప్రభుత్వం అనుమతులను పెండింగ్ లో ఉంచింది. ఈ వాస్తవాన్ని చెప్పని మస్క్.. తనకు మాత్రమే ఏదో అన్యాయం జరుగుతుందని పోస్ట్ లు పెట్టటం.. తన పోస్ట్ లతో భారత ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయటం ఏ మాత్రం సమర్థనీయం కాదు.
ఇదంతా చూస్తున్నప్పుడు.. మస్క్ ఆడుతున్న మైండ్ గేమ్ లో రాహుల్ ఎందుకు పావుగా మారారు? అన్నది ప్రశ్న. ఆ మాటకు వస్తే రాహుల్ మాదిరే బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ సైతం అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఆయన కూడా మస్క్ పోస్ట్ కు స్పందించారు. మస్క్ వ్యాఖ్యలను తప్పు పట్టిన కమల్ హాసన్ మరిన్ని వ్యాఖ్యలు చేశారు. కమల్ తాజా పోస్ట్ ను చూస్తే.. మస్క్ తీరును తప్పు పట్టటమే కాదు.. ఒక దేశ ప్రయోజనాల్ని ఆ దేశ ప్రజలు.. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలే తప్పించి.. మరెవరూ కాదన్న విషయాన్ని స్పష్టం చేశారు. కమల్ పోస్ట్ స్పష్టత.. ఆయన ప్రస్తావించిన అంశాల్ని చూస్తున్నప్పుడు.. భారతదేశ ప్రతిపక్ష నేతలో ఇంతటి అవగాహన ఎందుకు మిస్ అయ్యిందన్న భావన కలుగక మానదు.
తన సుదీర్ఘ పోస్ట్ లో కమల్ మరిన్ని అంశాన్ని ప్రస్తావించారు. అవేమంటే.. ‘‘మన నెట్ వర్క్ లు.. స్పెక్ట్రమ్ కేవలం వాణిజ్య ఆస్తులు కావు. అవి వ్యూహాత్మక మౌలిక సదుపాయాలన్న విషయం భారతదేశానికి తెలుసు. ప్రతి దేశం తన సొంత ప్రయోజనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటుంది. పాశ్చాత్య దేశాలు తమ దేశంలో సంరక్షణవాదాన్ని పాటిస్తూ స్వేచ్ఛా మార్కెట్ల గురించి బోధించలేవు. అమెరికా తన దేశీయ పరిశ్రమను రక్షించుకోవటానికి చైనా ఎలక్ట్రిక్ వాహనాలపై వంద శాతం సుంకాల్ని విధించింది. అదే విధంగా భారతదేశం కూడా తన దేశీయ తయారీదారులను రక్షించుకోవటానికి చర్యలు తీసుకుంటుంది.ప్రజాస్వామ్య దేశంగా మా బలాలు.. బలహీనతల గురించి భారతీయులు అంతర్గతంగా చర్చించుకుంటారు. ప్రశ్నించుకుంటారు. పరిష్కరించుకుంటారు. భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం. వలస దేశం కాదు. మేం ప్రపంచాన్ని స్వాగతిస్తాం. మా భవిష్యత్తును మేమే నిర్ణయించుకుంటాం. ఏ బిలియనీర్ నిర్ణయించలేరు’’ అంటూ చేసిన పోస్ట్ ను చూసినప్పుడు రాహుల్.. కేటీఆర్ లాంటి రాజకీయ నేతలు దేశ ప్రజల ప్రయోజనాల్ని ఎలా విస్మరించారన్న భావన కలుగకమానదు.
