రాజ్యసభను షేక్ చేసిన కమలాసన్.. స్పీచ్ గూస్ బాంబ్స్ అంతే
రాజ్యసభలో లోకనాయకుడు కమల్ హాసన్ చేసిన తొలి ప్రసంగం ఒక పొలిటికల్ థ్రిల్లర్‌ను తలపించింది.
By: A.N.Kumar | 5 Feb 2026 12:00 PM ISTరాజ్యసభలో లోకనాయకుడు కమల్ హాసన్ చేసిన తొలి ప్రసంగం ఒక పొలిటికల్ థ్రిల్లర్‌ను తలపించింది. సినిమాల్లో తన నటనతో మెప్పించే కమల్ పార్లమెంటు వేదికగా తన వాక్చాతుర్యంతో లోతైన విశ్లేషణతో అందరినీ ఆశ్చర్యపరిచారు. మరీ ముఖ్యంగా మహాకవి శ్రీశ్రీ కవిత్వాన్ని ఉటంకిస్తూ ఆయన చేసిన ప్రసంగం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.
రాజ్యసభ వేదికగా మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ బుధవారం గంభీరమైన గళం వినిపించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా ఎంపీగా తన తొలి ప్రసంగం చేసిన కమల్ ఎన్నికల కమిషన్ పనితీరుపై నిప్పులు చెరిగారు. ఓటు హక్కును కాలరాసే విధంగా సాగుతున్న ప్రక్రియలపై ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో ప్రకంపనలు సృష్టించాయి.
శ్రీశ్రీ కవిత్వంతో ప్రారంభం.. ప్రజాస్వామ్య హెచ్చరిక!
తన ప్రసంగంలో కమల్ హాసన్ తెలుగు మహాకవి శ్రీశ్రీ రాసిన ప్రసిద్ధ పంక్తులను గుర్తుచేసుకున్నారు. "జగన్నాథ రథచక్రాలొస్తున్నాయ్... వస్తున్నాయ్... దారి ఇవ్వండి" అంటూ భారత ప్రజాస్వామ్య ప్రస్థానాన్ని రథంతో పోల్చారు. ప్రజాస్వామ్యం అనే ఈ రథచక్రాలు ముందుకు సాగుతూనే ఉంటాయని ఆ ప్రవాహానికి ఎవరూ అడ్డుపడకూడదని హితవు పలికారు.
'ఎస్‌ఐఆర్' పై యుద్ధం: కోటి మంది ఓటర్ల భవిష్యత్తు?
ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియపై కమల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం స్పెల్లింగ్ తప్పులు లేదా అడ్రస్ మార్పుల పేరుతో ఓటర్లను జాబితా నుంచి తొలగించడాన్ని ఆయన తప్పుబట్టారు. "తమిళనాడులో సుమారు కోటి మంది ఓటర్లను 'బతికుండగానే చనిపోయినట్లు' చిత్రించే ప్రమాదం ఉంది. ఈసీ ఇక్కడ ఇంగ్లిష్ కోచ్‌లా వ్యవహరించకూడదు" అని ఎద్దేవా చేశారు. గతంలో బీహార్‌లో జరిగిన ఎస్‌ఐఆర్ వల్ల ఆ రాష్ట్రం "జీవచ్ఛవాల భూమి"గా మారిందని, అదే వ్యాధి దేశమంతటా వ్యాపించకుండా చూడాలని హెచ్చరించారు.
స్టాలిన్, అణ్ణాదురైలకు కృతజ్ఞతలు
తాను ఈ సభకు రావడానికి కారణమైన తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కు, డీఎంకే మిత్రపక్షాలకు కమల్ ధన్యవాదాలు తెలిపారు. తనపై సి.ఎన్. అణ్ణాదురై, మహాత్మా గాంధీ, పెరియార్ వంటి మహనీయుల ప్రభావం ఉందని పేర్కొంటూ... "మన భాష, సంస్కృతి, హక్కులపై దాడి జరిగినప్పుడు మౌనంగా ఉండకూడదు" అన్న అణ్ణాదురై బోధనలను గుర్తుచేశారు.
జెన్-జీ చూస్తోంది.. మేల్కొనండి!
ప్రసంగం ముగింపులో కమల్ యువత గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. "ఏ ప్రభుత్వమూ శాశ్వతం కాదు.. ఎవరూ అమరజీవులు కారు. మనల్ని జెన్-జీ యువతరం గమనిస్తోంది. వారి భవిష్యత్తు కోసం మనం మరింత పరిణతి చెందిన ప్రజాస్వామ్యాన్ని అందించాలి" అని పిలుపునిచ్చారు.
కమల్ హాసన్ ప్రసంగం కేవలం ఒక రాజకీయ ప్రసంగంలా కాకుండా ప్రజాస్వామ్య విలువలపై ఒక గట్టి వాదనలా సాగింది. ముఖ్యంగా తెలుగు కవిత్వాన్ని జాతీయ వేదికపై ప్రస్తావించడం తెలుగు ప్రజలను కూడా ఆకర్షించింది.
