Begin typing your search above and press return to search.

పోటీకి దూరం.. డీఎంకేకు పూర్తి మద్దతు.. ఇదేంది కమలహాసనా?

రాజ్యసభ సభ్యుడిగా ఇటీవల ఎన్నికైన సీనియర్ నటుడు, మక్కళ్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ తాజాగా జరుగుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు.

By:  Garuda Media   |   30 March 2026 12:08 PM IST
పోటీకి దూరం.. డీఎంకేకు పూర్తి మద్దతు.. ఇదేంది కమలహాసనా?
X

రాజ్యసభ సభ్యుడిగా ఇటీవల ఎన్నికైన సీనియర్ నటుడు, మక్కళ్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ తాజాగా జరుగుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈసారి ఎన్నికల్లో తాము పోటీ చేయటం లేదని.. అధికార డీఎంకేకు షరతుల్లేని మద్దతు ఇస్తామని చెప్పి రాజకీయ వర్గాల్ని ఆశ్చర్యానికి గురి చేశారు. కమల్ హాసన్ ప్రకటనతో ఆయన పార్టీలో కీలకంగా పని చేసిన వారంతా తీవ్ర నిరాశకు గురయ్యే పరిస్థితి. 2018లో పురుడు పోసుకున్న కమల్ హాసన పార్టీ 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దిగటం.. ఒక్క స్థానంలోనూ విజయాన్ని సాధించని సంగతి తెలిసిందే. 2021లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి అనుబంధంగా మరో ఆరు పార్టీలతో కలిసి ప్రత్యేక కూటమిగా ఏర్పాటై.. ఎన్నికల బరిలో నిలవటం.. 183 స్థానాల్లో ఈ కూటమి పోటీకి దిగటం తెలిసిందే.

ఆ ఎన్నికల్లోనూ ఒక్క సీటు సాధించనప్పటికి 2.62 శాతం ఓట్లను సొంతం చేసుకుంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే కూటమికి మద్దతు తెలిపి.. ఒక్క సీటులోనూ పోటీకి దిగలేదు. కూటమి గెలుపు కోసం ప్రచారం చేశారు కమల్ హాసన్. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తు పెట్టుకొని కనీసం పది - పన్నెండు సీట్లలో పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. కమల్ హాసన్ పార్టీ పెట్టిన ఎనిమిదేళ్లలో ఎంతోమంది ఆయన్ను నమ్ముకొని పార్టీ కోసం పని చేస్తున్నారు.

అలాంటి వారి కష్టాన్ని బూడిదలో పోసేలా.. తాజా నిర్ణయం ఉందంటున్నారు. అయితే.. కమల్ హాసన్ పన్నెండు సీట్లు అడిగితే.. డీఎంకే రెండు సీట్లకు ఓకే చెప్పిందని.. ఇంత తక్కువ సీట్లతో పోటీ చేస్తే బాగోదన్న ఉద్దేశంతోనే.. పోటీ నుంచి దూరంగా ఉంటూ.. అధికార డీఎంకేకు షరతుల్లేని మద్దతు ఇవ్వాలన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. ఏమైనా.. పార్టీ అధినేతలు బాగానే ఉంటారు. కానీ.. సదరు పార్టీని భుజాన వేసుకొని దతిరిగిన నేతలు.. కార్యకర్తల సంగతేంటి? అన్నదే ఇప్పుడు అసలు చర్చ. మొత్తానికి తన నిర్ణయంతో కమల్ హాసన్ షాకిచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.