లోకల్ ఫైట్ కు కవిత సిద్ధం..?
తెలంగాణలో కొత్త పార్టీ ప్రారంభించాలని ఉవ్విళ్లూరుతున్న ఎమ్మెల్సీ కవిత ఈ నెలలో జరిగే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలకు పరిశీలిస్తున్నారు.
By: Tupaki Political Desk | 1 Oct 2025 1:29 PM ISTతెలంగాణలో కొత్త పార్టీ ప్రారంభించాలని ఉవ్విళ్లూరుతున్న ఎమ్మెల్సీ కవిత ఈ నెలలో జరిగే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలకు పరిశీలిస్తున్నారు. ఈ విషయంలో సన్నిహితులు, అనుచరులతో సమాలోచనలు జరుపుతున్నారు. వారి అభిప్రాయం తెలుసుకునేందుకు బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. గ్రామస్థాయిలో జరిగే ఈ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా తన బలం ఏంటో నిరూపించుకోవాలని ఆమె ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన కవిత ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ పరిస్థితుల్లో సొంతంగా ఎదగాలని భావిస్తున్న కవిత స్థానిక ఎన్నికల్లో పోటీచేస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుందనే విషయమై బీఆర్ఎస్ పార్టీకి టెన్షన్ పుట్టిస్తోందని చెబుతున్నారు.
గత నెలలో బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కవిత.. కొత్త పార్టీ ఏర్పాటుపై సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో తాను నడిపిన సాంస్కృతిక సంస్థ తెలంగాణ జాగృతిని పార్టీగా మార్చాలని ప్రతిపాదన పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో బీసీ వర్గాలను ఆకట్టుకునేలా తన పార్టీ ఉండాలని భావిస్తున్న కవిత తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనే పేరుతో కొత్త దుకాణం తెరవాలని ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండటం వల్ల పార్టీ ప్రకటన ఇప్పుడేనా? లేక మరికొన్నాళ్లు వేచిచూసిన తర్వాత ప్రకటన చేయాలా? అనే తర్జనభర్జనలో ఉన్న కవిత స్థానిక ఎన్నికలను అందివచ్చిన అవకాశం మార్చుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
గతంలో నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన కవిత ఉత్తర తెలంగాణ ప్రాంతంలో మంచిపట్టు సాధించారు. అయితే 2019 ఎన్నికలలో ఆమె అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయిన కవిత జాగృతి ద్వారా ప్రజలతో సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే తన తండ్రి స్థాపించిన బీఆర్ఎస్ పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం ఉండటం లేదనే ఆలోచనతో సొంత పార్టీ ఏర్పాటు చేయాలని ఆమె ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన బలం నిరూపించుకునేందుకు స్థానిక ఎన్నికలకు ఒక అవకాశంగా మార్చుకోవాలని ఆమె ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే స్థానిక ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల కావడం, నెల రోజుల్లోనే మొత్తం ప్రక్రియ ముగియడం వల్ల పోటీకి దిగితే ఎలాంటి ఫలితాలు వస్తాయనే ఆలోచనతో ఆమె తీవ్ర తర్జనభర్జన పడుతున్నట్లు చెబుతున్నారు.
ఈ విషయంలో సహచరుల అభిప్రాయం తెలుసుకోవాలని నిర్ణయించి వారితో ప్రత్యేక భేటీ నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో కవిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. ప్రధానంగా కవిత నిర్ణయం బీఆర్ఎస్ ను టెన్షన్ పెడుతోంది. స్థానిక ఎన్నికల్లో కవిత గ్రూపు పోటీకి దిగితే తమ ఓట్లకే చిల్లు పడే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారు. నిజానికి స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికార పార్టీకి కాస్త అడ్వాంటేజ్ అవుతుందని గత చరిత్ర చెబుతోంది. అయితే ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అది తమకు లాభిస్తుందని బీఆర్ఎస్ ఊహిస్తోంది. కవిత గ్రూపు పోటీకి దిగకపోతే తమ పార్టీ మెజార్టీ సీట్లు దక్కించుకోవడం ఖాయమని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అయితే బీఆర్ఎస్ టెన్షన్ తో సంబంధం లేకుండా కవిత నిర్ణయం తీసుకుంటారా? లేక సమయం తక్కువగా ఉన్నందున పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటారా? అన్నది ఉత్కంఠ రేపుతోంది. లోకల్ పైట్ కు దిగకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయని, విజయమో వీర స్వర్గమో అన్నట్లు పోటీ చేయడమే మంచిందని మరికొందరు సూచిస్తున్నారు. అయితే ఫలితాలు అనుకూలంగా లేకపోతే ఆదిలోనే హంసపాదులా రాజకీయ జీవితం తలకిందులయ్యే అవకాశం కూడా ఉందని కవిత సన్నిహితులు భయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కవిత తీసుకోబోయే నిర్ణయం ఆసక్తికరంగా మారింది.
