Begin typing your search above and press return to search.

నిజామాబాద్ లో అందుకే నన్ను కుట్ర పన్ని ఓడించారు : కవిత

తన ఓటమిపై కార్యకర్తల ముందు కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడిన కవిత “నిజామాబాద్‌లో నా ఓటమి కుట్రనా.. కాదా?” అంటూ నేరుగా కార్యకర్తలను ప్రశ్నించారు.

By:  A.N.Kumar   |   25 Oct 2025 7:30 PM IST
నిజామాబాద్ లో అందుకే నన్ను కుట్ర పన్ని ఓడించారు : కవిత
X

భారత రాష్ట్ర సమితి బహిష్కృత నేత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి రాజకీయ వేదికపై సంచలనం సృష్టించారు. నిజామాబాద్‌లో ‘జాగృతి జనం బాట’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో చర్చకు దారితీశాయి.

తన ఓటమిపై కార్యకర్తల ముందు కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడిన కవిత “నిజామాబాద్‌లో నా ఓటమి కుట్రనా.. కాదా?” అంటూ నేరుగా కార్యకర్తలను ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు అక్కడి రాజకీయ వాతావరణాన్ని కాసేపు కదిలించాయి.

కార్యకర్తలను ఉద్దేశించి కవిత మాట్లాడుతూ “నేను గత 20 ఏళ్లుగా కేసీఆర్ గారి స్ఫూర్తితో, బీఆర్ఎస్ సిద్ధాంతాల కోసం నిరంతరం పనిచేశాను. నిజామాబాద్ అభివృద్ధి కోసం నా శక్తివంచన లేకుండా కృషి చేశాను. అయినప్పటికీ నా ఓటమి వెనుక అసలు కథ ఏమిటో కార్యకర్తలు ఆలోచించాలి. మనం ఎక్కడ తప్పు చేశాం, లేక ఇది ఎవరో పన్నిన కుట్రమా?” అని ప్రశ్నించారు.

* మళ్లీ విశ్వాసాన్ని నెలకొల్పాలి

ఈ సందర్భంగా ప్రజలతో మమేకమవుతూ కవిత భావోద్వేగంగా మాట్లాడారు. “మనం ఉద్యమం నుంచి వచ్చాం. తెలంగాణ కోసం పోరాడాం. కానీ ఇప్పుడు మన సొంత రాష్ట్రంలోనే మనం అపార్థాల బారిన పడకూడదు. నిజాన్ని తెలుసుకోవాలి, ప్రజలలో మళ్లీ విశ్వాసాన్ని నెలకొల్పాలి” అని పిలుపునిచ్చారు.

జాగృతి జనం బాట ప్రారంభ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పునరుద్ధరణకు తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం కోసం జిల్లావారీగా పర్యటనలు కొనసాగిస్తానని తెలిపారు.

కవిత తాజా వ్యాఖ్యలతో నిజామాబాద్ రాజకీయాల్లో ఆమె ఓటమిపై మళ్లీ చర్చ మొదలైంది. ఇది రాజకీయ కుట్రనా లేక వ్యూహపరమైన తప్పిదమా అనే ప్రశ్న ప్రస్తుతం రాజకీయ విశ్లేషణకు, చర్చకు దారితీసింది.

కవిత పాదయాత్రకు శ్రీకారం

జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణలో మరోసారి ప్రజా యాత్రకు సిద్ధమయ్యారు. “జాగృతి జనం బాట” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ పాదయాత్ర ద్వారా అమర వీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, సాధారణ ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకోబోతున్నట్లు తెలిపారు.

33 జిల్లాల్లో పాదయాత్ర

కవిత ఈ పాదయాత్రను రాష్ట్రంలోని 33 జిల్లాలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాలు దాటేలా ప్రణాళిక చేశారు. ప్రజలతో నేరుగా మమేకమై, వారి సమస్యలను వినడమే లక్ష్యమని తెలిపారు కవిత పాదయాత్ర తెలంగాణ రాజకీయాల్లో మరో మలుపుగా భావిస్తున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమం ద్వారా రాష్ట్రం సాధించిన కవిత, ఇప్పుడు సామాజిక సమానత్వం కోసం కొత్త ఉద్యమానికి నాంది పలుకుతున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.