కవిత రాజకీయ మానసిక సమస్య
తెలంగాణ ఉద్యమంలో కవిత పెద్దగా చురుకైన పాత్ర పోషించలేదనే వాదన బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణుల్లోనే ఉంది.
By: A.N.Kumar | 4 Sept 2025 11:30 AM ISTకల్వకుంట్ల కవిత తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక సంక్లిష్టమైన దశను ఎదుర్కొంటున్నారు. తండ్రి స్థాపించిన బీఆర్ఎస్ నుంచి ఆమె సస్పెండ్ అయ్యారు. బయటకు రాగానే రాజీనామా చేస్తూ హరీష్, సంతోష్ రావు, కేటీఆర్ ల తీరును ప్రజల ముందు పెట్టారు. ఒకప్పుడు బీఆర్ఎస్ లో ఎంతో ఎత్తుకు ఎదిగిన కవిత... గతంలో ఎంపీగా, ఆ తర్వాత ఎమ్మెల్సీగా కొనసాగారు. అయితే ఇప్పుడు ఆమెను పార్టీ నుంచి సాగనంపడంతో కవిత రాజకీయ ప్రయాణం సవాళ్లతో నిండిపోయింది. బీఆర్ఎస్ వదిలేయడంతో రాజకీయాల్లో.. ప్రజల్లో ఆమెకు ఉన్న స్థానం బలహీనంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కొత్త పార్టీ పెట్టినా ఆమెకు ప్రయోజనం ఉండదన్న వాదన విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.
-ప్రత్యక్ష ఎన్నికల్లో బలహీనత
కవిత ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో ఆశించినంత విజయం సాధించలేకపోయారు. నిజామాబాద్ ఎంపీగా ఓటమి తరువాత, ఆమె తిరిగి ఎమ్మెల్సీ మార్గం ఎంచుకోవడం ఆమె రాజకీయ బలహీనతను సూచిస్తుంది. తెలంగాణ వంటి రాష్ట్రంలో ప్రజల నుంచి నేరుగా గెలిచిన నాయకులకు ఉండే గౌరవం, ప్రాబల్యం ఆమెకు దక్కడం లేదనే అభిప్రాయం ఉంది.
- ఉద్యమంలో పాత్రపై ప్రశ్నలు
తెలంగాణ ఉద్యమంలో కవిత పెద్దగా చురుకైన పాత్ర పోషించలేదనే వాదన బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణుల్లోనే ఉంది. ఉద్యమ సమయంలో కీలక బాధ్యతలు తీసుకోకపోవడం వల్ల.. పార్టీలోని కార్యకర్తలకు ఆమె పట్ల ఆశించిన సానుభూతి, మద్దతు లేదనే భావన బలంగా కనిపిస్తోంది.
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ - కుటుంబంలోనే వ్యతిరేకత
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆమె పాత్రపై వచ్చిన ఆరోపణలు కవిత రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి. కుటుంబ సభ్యులకు తెలియకుండా ఈ కేసులో ఆమె ప్రమేయం ఉండటం కుటుంబంలోనూ విభేదాలకు దారి తీసిందని ప్రచారం జరుగుతోంది. ఇది పార్టీలో ఆమె స్థానాన్ని మరింత బలహీనపరిచిందని పార్టీ వర్గాల్లో ఓ చర్చ సాగుతోంది..
- ప్రజా మద్దతు లోపం
కవిత మీడియా సమావేశాలు, బహిరంగ ప్రసంగాలు ప్రజల్లో పెద్దగా ప్రభావం చూపడం లేదనే భావన ఉంది. ఆమెకు సామాన్య ప్రజల్లో బలమైన ఫాలోయింగ్ లేదని, ఆమెను మాస్ లీడర్‌గా ఎవరూ చూడటం లేదని పలు విశ్లేషణలు పేర్కొంటున్నాయి.
-ఇతర నాయకులతో పోలిక
కేటీఆర్, హరీష్ రావు వంటి నాయకులకు పార్టీలోనూ, ప్రజల్లోనూ బలమైన మద్దతు ఉంది. వారికి కచ్చితంగా గెలిచే స్థానాలు ఉన్నాయి. కానీ కవితకు అలాంటి గ్యారెంటీ సీటు లేకపోవడం, ఆమెను మాస్ లీడర్‌గా కాకుండా ఒక సాధారణ రాజకీయ నాయకురాలిగా చూస్తున్నారనే అభిప్రాయాన్ని బలోపేతం చేస్తోంది.
మొత్తంగా కవిత ప్రస్తుతం అనేక రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ప్రజల్లో నమ్మకం, పార్టీ శ్రేణుల్లో మద్దతు సంపాదించుకోవడం ఆమెకు అతిపెద్ద సవాలుగా మారింది. ఆమెకు తక్షణమే ఒక గెలుపు సీటు, లేదా బలమైన నాయకత్వ పాత్ర లభించడం కష్టం అని చెప్పవచ్చు. ఆమె ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితిని నిజంగానే ఒక "రాజకీయ మానసిక సమస్య"గా భావించవచ్చు.
