Begin typing your search above and press return to search.

పార్టీ పెట్టాలంటే భయపడుతున్న కవిత?

బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండైన తర్వాత కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ పెడతారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్న వేళ, ఆమె చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

By:  A.N.Kumar   |   23 Oct 2025 11:00 PM IST
పార్టీ పెట్టాలంటే భయపడుతున్న కవిత?
X

బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండైన తర్వాత కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ పెడతారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్న వేళ, ఆమె చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కొత్త పార్టీ ఏర్పాటుపై ఆమె మరోసారి సందేహాలు వ్యక్తం చేయడమే కాకుండా, ఓ రకంగా భయపడినట్టుగా మాట్లాడారు. అవే ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

'జాగృతి' పార్టీగా మారడం పెద్ద విషయం కాదు... కానీ?

తెలంగాణ జాగృతి సంస్థను పార్టీగా మార్చడం పెద్ద విషయం కాదని కవిత వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రం ఏపీలో మూడు ప్రాంతీయ పార్టీలున్న విషయాన్ని కూడా ఆమె గుర్తు చేశారు. అయితే, ఇక్కడే ఆమె అసలు విషయం చెప్పకనే చెప్పారు. "ప్రజలకు మేలు చేయాలంటే పార్టీనే ఉండాల్సిన అవసరం లేదని" ఆమె వ్యాఖ్యానించారు.

షర్మిల తరహా భయమేనా?

ఈ మాటలను బట్టి చూస్తే, కొత్త పార్టీ పెట్టే విషయంలో కవిత కొంత వెనకడుగు వేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల తరహాలో అటు ఇటూ కాకుండా పోతుందేమోనన్న భయం కవితలో ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చినా, సొంతంగా బలమైన రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకోలేకపోయిన షర్మిల పరిస్థితి కవితకు ఓ పాఠంగా మారిందా? అని విశ్లేషకులు భావిస్తున్నారు.

బీఆర్‌ఎస్‌కు తిరిగి వెళ్తారా?

కొత్త పార్టీపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం, 'ప్రజలు కోరుకుంటే పార్టీ వస్తుంది' అంటూ దాటవేయడం చూస్తుంటే... ప్రస్తుత పరిస్థితులు అనుకూలించకపోతే, కవిత మళ్లీ బీఆర్‌ఎస్‌ గూటికే చేరే అవకాశాలు ఉన్నాయా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. బీఆర్‌ఎస్‌లో ఎదురైన అవమానాలు, కుట్రల గురించి కవిత మాట్లాడినా, చివరికి సొంత రాజకీయ ప్రయాణంలో ఎదురుదెబ్బలు తగిలితే, తండ్రి పార్టీనే శరణ్యమా? అన్న చర్చ సాగుతోంది.

దాటవేత ధోరణి

"ప్రజలు కోరుకుంటే పార్టీ వస్తుందని, అందులో పెద్ద ఇబ్బందేమీ లేదని" కవిత స్పష్టం చేసినప్పటికీ, పార్టీ పెట్టేందుకు ఆమెకు నమ్మకం లేదా? సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారా? లేక పార్టీ పెట్టడం కంటే 'జాగృతి' సంస్థ ద్వారా సామాజిక అంశాలపై దృష్టి పెట్టడం ద్వారానే భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నారా? అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా, కొత్త పార్టీ ఏర్పాటు విషయంలో కవిత తీసుకుంటున్న కాలయాపన, ఆమెలో ఉన్న సందేహాలను, భయాన్ని ప్రతిబింబిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.