Begin typing your search above and press return to search.

కవిత సీటు ఆయనకేనా...జాక్ పాట్ కొట్టినట్లే !

అయితే ఈ విధంగా ఖాళీ అయిన సీటు అజారుద్దీన్ కే అని అంటున్నారు. ఆయన కొద్ది నెలల క్రితం మంత్రి పదవిని కూడా అందుకున్నారు.

By:  Satya P   |   8 Jan 2026 9:30 AM IST
కవిత సీటు  ఆయనకేనా...జాక్ పాట్ కొట్టినట్లే !
X

తెలంగాణా జాగృతి నాయకురాలు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అయితే అది జరిగి చాలా కాలం అయినా ఆమోద ముద్ర మాత్రం పడలేదు. అయితే కవిత తాజాగా జరిగిన అసెంబ్లీ వింటర్ సెషన్ లో శాసనమండలికి వెళ్ళి మరీ తన రాజీనామా ఆమోదం కోసం సభా ముఖంగానే పట్టుబట్టారు. ఆమె రాజీనామా చేసిన కారణాలను చెబుతూ చైర్మన్ తనకు ఇచ్చిన అవకాశాన్ని కూడా అలా వాడుకున్నారు. బీఆర్ఎస్ మీద ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేశారు. ఒక దశలో కన్నీరు సైతం పెట్టారు.

అనూహ్యంగా ఆమోదం :

అయితే శాసనమండలిలో గుత్తా సుఖేందర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నారు. అక్కడ బీఆర్ఎస్ కే మెజారిటీ ఉంది. దాంతో రాజీనామా ఆమోదం పొందకపోవచ్చు అని అనుకున్నారు. ఎందుకంటే ఈ దశలో బీఆర్ఎస్ నుంచి ఎవరు రాజీనామా చేసినా కూడా ఆ సీటు కాంగ్రెస్ కే దక్కుతుంది. మెజారిటీ వారికే ఎమ్మెల్యేల రూపంలో ఉంది. అందుకే ఇంత కాలం ఆగారా అన్నది ఒక చర్చ. అయితే కవిత తన రూట్ మార్చి ఏకంగా సభాముఖంగానే రాజీనామా ఆమోదించాలని కోరారు. ఒక ఆడబిడ్డగా తన కష్టాన్ని కన్నీళ్ళ రూపంలో వ్యక్తం చేశారు. దాంతో అది జరిగిన వెంటనే మండలి చైర్మన్ ఆమె రాజీనామాను ఆమోదించారు. దాంతో ఒక సీటు మండలిలో ఖాళీ అయింది.

అజారుద్దీన్ కేనా :

అయితే ఈ విధంగా ఖాళీ అయిన సీటు అజారుద్దీన్ కే అని అంటున్నారు. ఆయన కొద్ది నెలల క్రితం మంత్రి పదవిని కూడా అందుకున్నారు. ఆయన ఇప్పటికీ ఏ సభలోనూ సభ్యుడు కాదు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనల మేరకు అజారుద్దీన్ కి వ్యూహాత్మకంగా మంత్రి పదవిని కట్టబెట్టారు. అయితే ఈలోగా ఏదో ఒక సభలో ఆయన సభ్యుడు కావాలి. పరిస్థితి చూస్తే ఎమ్మెల్సీ ఖాళీలు అయితే ఎక్కడా లేవు. దాంతో అజారుద్దీన్ మంత్రి పదవి మూన్నాళ్ళ ముచ్చటేనా అన్న చర్చ కూడా వచ్చింది. అయితే కవిత రాజీనామా ఆమోదంతో ఎన్నికలు పెడితే కనుక అజారుద్దీన్ ఎమ్మెల్సీ అవుతారు అని అంటున్నారు.

స్థానిక కోటాలో :

అయితే ఇక్కడో చిక్కు ఉంది. నిజమాబాద్ నుంచి స్థానిక సంస్థల ప్రతినిధుల కోటాలో కవిత ఎమ్మెల్సీ అయ్యారు. ఇపుడు ఆ స్థానిక సంస్థల పదవీ కాలం గడువు ముగుస్తోంది. దాంతో ఈ గడువులోగా కేంద్ర ఎన్నికల సంఘం కనుక నోటిఫికేషన్ జారీ చేస్తే అజారుద్దీన్ ఎమ్మెల్సీ అయిపోవచ్చు. మిగిలిన కాలానికి ఆయన ఎమ్మెల్సీగా కొనసాగవచ్చు. అలా కాదు అనుకుంటే కనుక స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తరువాత అపుడు ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహించాల్సి వస్తుంది. మరి అప్పటికి ఆరు నెలల పదవీ కాలం మంత్రిగా ఆయనది పూర్తి అయిపోతే ఏమి చేస్తారు అన్నది మరో చర్చ. ఏది ఏమైనా ఇపుడు ఖాళీ అయింది ఎమ్మెల్సీ సీటు అని కేంద్ర ఎన్నికల సంఘానికి మండలి నుంచి సమాచారం వెళ్ళింది కాబట్టి అక్కడ నుంచి వచ్చే సూచనల మేరకు ఎన్నికలు జరితే మాత్రం అజారుద్దీన్ కే ఈ సీటు అని అంటున్నారు.