కవితతో కేసీఆర్ పార్టీ పెట్టిస్తున్నాడా? అసలు నిజం ఇదీ
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నుంచి సస్పెండైన తర్వాత కల్వకుంట్ల కవిత రాజకీయ ప్రస్థానం మళ్లీ చురుకు గా మారింది.
By: A.N.Kumar | 27 Oct 2025 11:08 AM ISTభారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నుంచి సస్పెండైన తర్వాత కల్వకుంట్ల కవిత రాజకీయ ప్రస్థానం మళ్లీ చురుకు గా మారింది. ఈ పరిణామం తెలంగాణ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు, సమీకరణాలకు దారితీస్తోంది. ఇప్పటివరకు పార్టీ ఏర్పాటుపై కేవలం ఊహాగానాలు మాత్రమే ఉన్నా, ఆమె తాజా కార్యకలాపాలు, వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి.
'జనం బాట'తో ప్రజల్లోకి కవిత
కవిత ప్రస్తుతం “జనం బాట” పేరుతో ప్రజల్లోకి చురుగ్గా వెళ్లుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆమె తన అత్తవారిళ్లైన నిజామాబాద్ నుంచి ప్రారంభించారు. ఈ పర్యటనల ద్వారా ఆమె కేవలం ప్రజా సమస్యలపైనే కాకుండా, బీఆర్‌ఎస్‌లోని అంతర్గత వ్యవహారాలపై కూడా బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు.
*బీఆర్‌ఎస్‌పై అసంతృప్తి
తన ఓటమికి పార్టీ లోపల నుంచే ప్రయత్నాలు జరిగాయని, పార్టీలోనే తనకు ఇబ్బందులు కల్పించారని కవిత స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. ఆమె మాటల్లో గులాబీ పార్టీ నేతలపై ఉన్న అసంతృప్తి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పేర్లు ప్రస్తావించకపోయినా, ఈ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌లో అంతర్గతంగా ఉన్న విభేదాలను వెల్లడిస్తున్నాయి.
పార్టీ ఏర్పాటుపై కవిత సంచలన వ్యాఖ్యలు
రాజకీయ పార్టీ ఏర్పాటు గురించి కవిత చేసిన తాజా వ్యాఖ్యలు ఈ మొత్తం చర్చకు కేంద్ర బిందువుగా మారాయి. ఆమె మాట్లాడుతూ “నాతో పార్టీ పెట్టించడానికి కేసీఆర్ గారు బయటకు పంపించారని అంటున్నారు. కానీ అది నిజం కాదు. కేసీఆర్ గారికి అలాంటి అవసరం లేదు. నాకు ఆధారాలు ఉన్నప్పుడే మాట్లాడుతాను. అవసరమైతే రాజకీయ పార్టీని కచ్చితంగా పెడతాను. కాంగ్రెస్ ఇప్పుడు మునిగిపోతున్న నావలాంటిది, ఆ పార్టీ మద్దతు అవసరం లేదు.”
ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త శక్తి ఆవిర్భవించేందుకు మార్గం సుగమం చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె 'జాగృతి' పేరిటే పార్టీని ప్రారంభిస్తారా లేక కొత్త పేరుతో ముందుకు వస్తారా అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
మొత్తానికి, కల్వకుంట్ల కవిత అడుగులు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని మళ్లీ వేడెక్కిస్తున్నాయి. ఆమె కొత్త పార్టీ ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందనేది వేచి చూడాలి. కానీ, ఆమె రాజకీయ ప్రస్థానం ప్రతి ప్రధాన పార్టీకీ ఆలోచనలో పడేలా చేస్తోందా? ఏపీలో షర్మిలలా వీగిపోతుందా? అన్నది వేచిచూడాలి.. కవిత తీసుకునే తదుపరి నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారనుంది.
