రేవంత్ ను 2 సార్లు ఉరితీయాలి.. హరీశ్ లాలూచీ పడ్డారు... కవిత
ప్రస్తుతం శాసన మండలి సమావేశాలు జరుగుతున్నందున తన రాజీనామాను అంగీకరించే ముందు మాట్లాడే అవకాశం కల్పించాలని కోరారు.
By: Tupaki Political Desk | 2 Jan 2026 3:29 PM ISTబీఆర్ఎస్ నుంచి సస్పెండైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గులాబీ పార్టీ నుంచి బయటకు వచ్చే ముందు టార్గెట్ గా చేసుకున్న మేన బావ హరీశ్ రావుపై మరోసారి నిప్పులు చెరిగారు. నీళ్ల శాఖ మంత్రిగా ఆయన అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. కేసీఆర్ ను ఉరితీయాలంటూ తన తండ్రి పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కవిత తీవ్రంగా ఖండించారు. శాసన మండలి సభ్యత్వానికి సెప్టెంబరు 3నే రాజీనామా చేశానని దానిని ఆమోదించాల్సిందిగా చైర్మన్ ను అడుగుతానని చెప్పారు. తెలంగాణ శాసన మండలి లాంజ్ లో శుక్రవారం కవిత మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడారు. నాలుగు నెలల నుంచి తన రాజీనామాను అంగీకరించలేదని తెలిపారు. ప్రస్తుతం శాసన మండలి సమావేశాలు జరుగుతున్నందున తన రాజీనామాను అంగీకరించే ముందు మాట్లాడే అవకాశం కల్పించాలని కోరారు. అనంతరం రాజీనామా ఆమోదింపచేసుకుంటానని పేర్కొన్నారు.
పాలమూరుకు రేవంత్ తీరని ద్రోహం..
ఉమ్మడి పాలమూరుకు తీరని ద్రోహం చేస్తున్నది సీఎం రేవంత్ రెడ్డేనని కవిత అన్నారు. కేసీఆర్ ను ఉద్దేశించి ఉరి తీయాలంటూ ఆయన మాట్లాడడం సరికాదని..అలాగైతే రేవంత్ ను రెండుసార్లు ఉరితీయాలని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఒక ఉద్యమ నాయకుడు అని గుర్తుచేస్తూ, ఆయనను పట్టుకుని అలా మాట్లాడతారా? అని నిలదీశారు.
హరీశ్ కు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవా?
మాజీ మంత్రి హరీశ్ రావు పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల్లో అక్రమాలకు పాల్పడ్డారని, అయినా అలాంటివారిని శాసన సభ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ చేయడం ఏమిటని కవిత నిలదీశారు. పాలమూరు ఎత్తిపోతల్లో హరీశ్ ప్యాకేజీలను అమ్ముకున్నారని ఆరోపించారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడితే అంతా మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుందని కవిత అన్నారు. గతంలో సీఎం రేవంత్ తో ఆయన చాంబర్ లో హరీశ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారని.. అలాంటి వ్యక్తి నీళ్ల గురించి మాట్లాడితే బీఆర్ఎస్ నష్టపోతుందని తెలిపారు.
బీఆర్ఎస్ పై మనసు విరిగింది..
తనకు బీఆర్ఎస్ పట్ల మనసు విరిగిందని, స్వయంగా కేసీఆర్ పిలిచినా మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లేది లేదని కవిత స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు సోర్స్ పాయింట్ ను ఎందుకు మార్చారో కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చెప్తే బాగుంటుందని అన్నారు. తాను మొదటి నుంచి స్వతంత్రంగా పనిచేశానని, కేటీఆర్, హరీశ్ రావు మాత్రం కేసీఆర్ డైరెక్షన్ లో పనిచేశారని కవిత చెప్పారు. తాను జాగృతి జెండాతో ముందుకెళ్లానని, ఇప్పుడు రాష్ట్రానికి రాజకీయ పార్టీ అవసరం ఉందని, అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీతో పోటీ చేస్తానని కవిత వివరించారు.
