Begin typing your search above and press return to search.

క్షమాపణ కోరుతున్నా... కవిత ఏమోషనల్

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ప్రాణత్యాగం చేసిన అమర వీరుల కుటుంబాలకు తాను క్షమాపణ కోరుతున్నానని భావోద్వేగంతో తెలిపారు.

By:  A.N.Kumar   |   25 Oct 2025 1:46 PM IST
క్షమాపణ కోరుతున్నా... కవిత ఏమోషనల్
X

జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం ఒక కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ప్రాణత్యాగం చేసిన అమర వీరుల కుటుంబాలకు తాను క్షమాపణ కోరుతున్నానని భావోద్వేగంతో తెలిపారు. తెలంగాణ సాధించిన తర్వాత వారి ఆశయాలను నెరవేర్చడంలో విఫలమయ్యామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

కవిత మాట్లాడుతూ “ఉద్యమకారుల కోసం నేను మంత్రిగా లేకపోయినా, ఎంపీగా ఉన్నప్పుడు న్యాయం జరగాలని ప్రభుత్వాన్ని కోరాను. కానీ అనుకున్న మేరకు అమర వీరుల కుటుంబాలకు న్యాయం జరగలేదు. అందుకే వారందరికీ బహిరంగ క్షమాపణ చెబుతున్నాను” అని అన్నారు.

తెలంగాణ కోసం 1200 మందికి పైగా అమరవీరులు ప్రాణత్యాగం చేశారని, కానీ ఇప్పటి వరకు కేవలం 500 కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు అందించగలిగామని తెలిపారు. ఉద్యమకారుల్లో కొంతమందికి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, జెడ్పిటిసి, ఎంపీపీ స్థాయిలో అవకాశాలు లభించినా, ఇంకా చాలా మందిని పక్కనపెట్టారని కవిత అంగీకరించారు. “అమర వీరుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే వచ్చే ప్రభుత్వం ఇవ్వడం చూసుకుంటాను” అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఇకపై తన పోరాట పంథా మారుతుందని కవిత స్పష్టం చేశారు.

కవిత మాట్లాడుతూ “33 జిల్లాలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జాగృతి జనం బాట యాత్ర చేయబోతున్నాను. ప్రతి వర్గానికి సమాన అవకాశాలు రావాలి. అగ్రవర్ణాల్లో కూడా అన్ని కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలి. అందరి కోసం సాధించిన తెలంగాణలో అందరికీ స్థానం ఉండాలి” అని పిలుపునిచ్చారు.

“జిల్లాల్లో అభివృద్ధి ఎక్కడ ఆగిపోయిందో అక్కడికి వెళ్ళి పోరాటం చేస్తాను. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ తిరిగి ఉండే దాకా మన పోరాటం ఆగదు. సామాజిక తెలంగాణ కోసం మనమంతా కలిసిరావాలి” అని కవిత పిలుపునిచ్చారు.

తమతో మనస్పర్థలు ఉన్నా వాటిని పక్కన పెట్టాలని, జాగృతిలో పనిచేసిన వారందరికీ స్వాగతం అని ఆమె స్పష్టం చేశారు. “అందరం కలిసే ఉంటేనే ఆత్మగౌరవ తెలంగాణ బలపడుతుంది. సమానత్వం, సుస్థిర అభివృద్ధి కలిగిన తెలంగాణకై కొత్త ఉద్యమం ప్రారంభిద్దాం” అని ఆమె ప్రకటించారు.

కవిత చివరగా జోష్‌తో నినదించారు.. “ఈ ప్రభుత్వంపై జంగ్ సైరన్ చేద్దాం… సామాజిక తెలంగాణ కోసం మనం మరోసారి ఉద్యమించాలి!”

కవిత పాదయాత్రకు శ్రీకారం

జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణలో మరోసారి ప్రజా యాత్రకు సిద్ధమయ్యారు. “జాగృతి జనం బాట” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ పాదయాత్ర ద్వారా అమర వీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, సాధారణ ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకోబోతున్నట్లు తెలిపారు.

33 జిల్లాల్లో పాదయాత్ర

కవిత ఈ పాదయాత్రను రాష్ట్రంలోని 33 జిల్లాలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాలు దాటేలా ప్రణాళిక చేశారు. ప్రజలతో నేరుగా మమేకమై, వారి సమస్యలను వినడమే లక్ష్యమని తెలిపారు

కవిత పాదయాత్ర తెలంగాణ రాజకీయాల్లో మరో మలుపుగా భావిస్తున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమం ద్వారా రాష్ట్రం సాధించిన కవిత, ఇప్పుడు సామాజిక సమానత్వం కోసం కొత్త ఉద్యమానికి నాంది పలుకుతున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.