కాళింగ నేతలు వెయింటింగ్ మోడ్ లో ?
వేచి చూసే ధోరణి అన్నది మంచిదే. అయితే ఆలస్యం అమృతం విషం అన్నట్లుగా మరీ లేట్ అయితేనే ఇబ్బంది.
By: Satya P | 26 Jun 2026 9:21 AM ISTవేచి చూసే ధోరణి అన్నది మంచిదే. అయితే ఆలస్యం అమృతం విషం అన్నట్లుగా మరీ లేట్ అయితేనే ఇబ్బంది. అయితే రాజకీయాల్లో వేచి చూడడం అన్నది కూడా అతి ముఖ్యమైన వ్యూహంలో భాగం. శ్రీకాకుళం జిల్లాను ఒకనాడు ఏకచత్రాధిపత్యంగా ఏలిన కాళింగ నేతలు ఇపుడు చూస్తే నిర్లిప్తంగా ఉండిపోతున్నారు. శ్రీకాకుళం ఎంపీ సీటు అంటే కాళింగులదే. అలాగే రాజకీయంగా ముఖ్య భూమికను పోషించి జిల్లాలో మంత్రులుగా తమ హవా చాటుకున్న వైనం అంతా గత వైభవంగా మారిపతోంది. ఇదే ఇపుడు వారిలో ఆందోళన పెంచుతోంది.
వైసీపీ లో చూస్తే :
ఇక జిల్లాలో వెలమలు కాళింగులు, తూర్పు కాపులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ మూడు సామాజిక వర్గాలే జిల్లా రాజకీయాలను శాసిస్తూ వస్తున్నాయి. ఇటీవలనే తూర్పు కాపులు జిల్లాలో ఆత్మీయ సమావేశం నిర్వహించి వచ్చే ఎన్నికల్లో తన ఉనికిని బలంగా చాటుతామని స్పష్టం చేశారు. మరో వైపు చూస్తే వెలమ సామాజిక వర్గం జిల్లాలో రాజకీయ ఆధిపత్యం చలాయిస్తోంది. అటు వైసీపీలో ఇటు టీడీపీలో కూడా వారిదే అగ్ర తాంబూలంగా ఉంది. టీడీపీలో వైసీపీలో కాళింగులలో అసంతృప్తి కూడా ఈ విషయాల మీదనే ఉంది. అయితే అధికారంలో ఉన్న వారు అంత తొందరగా బయటపడలేకపోతున్నారు. విపక్షంలో వైసీపీలో అయితే కాళింగ సామాజిక వర్గం నేతల పరిస్థీతి మరింత ఇబ్బందిగా ఉందని అంటున్నారు.
దిగ్గజ నేతలుగా ఉంటూ :
ఇక జిల్లా రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించి మంత్రిగా స్పీకర్ గా కూడా పనిచేసిన తమ్మినేని సీతారాం అయితే భవిష్యత్తు రాజకీయాల మీద అంతర్మధనం చెందుతున్నారని చర్చ సాగుతోంది. తాను ఉన్న వైసీపీలో ఆయన ప్రస్తుతానికి మౌనంగా ఉంటున్నారు. సరైన భరోసా కోసం చూస్తున్నారని అంటున్నారు. తన కుమారుడికి తనకు కూడా తగిన హామీ దక్కాలన్నది ఆయన అభిమతంగా కనిపిస్తోంది. ఇక రాజకీయంగా వేరే ఆప్షన్లు చూస్తున్నా సమీపంలో కనిపించడం లేదని అంటున్నారు.
కేంద్ర మంత్రిగా చేసినా :
ఇక మరో సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కాళింగ సామాజిక వర్గంలో మహిళా నాయకురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆమె పరిస్థితి కూడా ఇపుడు కొంత ఆలోచించాల్సిన తీరులోనే ఉందని అంటున్నారు. కాంగ్రెస్ లో చేరిన కృపారాణి వచ్చే ఎన్నికల నాటికి ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నారు. అలాగే తన సొంత నియోజకవర్గం టెక్కలి నుంచి ఎంపీగా పోటీకి దిగాలని కూడా ఉంది. అయితే సరైన రాజకీయ వేదిక ఏది అన్నదే చర్చగా ఉంది. వైసీపీలోకి తిరిగి రావాలని అనుకుంటే ధర్మాన బ్రదర్స్ వైఖరి ఎలా ఉంటుందో అన్న దాని మీదనే ఆధారపడి ఉందని అంటున్నారు. టీడీపీలో చేరేందుకు ఆస్కారం లేదు, అక్కడ కీలక నేతలు పలువురు ఉన్నారు. దాంతో వెయిటింగ్ మోడ్ లోనే ఆమె ఉన్నారని అంటున్నారు.
ఈయన సంగతి అయితే :
ఇక వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంగతి అయితే మరీ గందరగోళంగా ఉంది అని అంటున్నారు. ఆయన వైసీపీలో చేరాలనుకుంటే అసలు కుదిరే వ్యవహారంలా లేదని అంటున్నారు. టీడీపీలో అచ్చెన్నాయుడుతో విరోధం ఉంది. జనసేనలో చేరాలని చూస్తున్నా అక్కడ కూడా కొందరు నుంచి బ్రేకులు పడుతున్నాయని చెబుతున్నారు. ఇక జనసేన తాజాగా జాయినింగ్ కమిటీని వేసింది. ఈ కమిటీ ద్వారా ప్రతీ జిల్లాలో బలమైన నేతలను తీసుకుంటున్నారు. మరి ఈ ముగ్గురు కాళింగ నేతల విషయం ఏమిటి అన్నది చూడాల్సి ఉందని అంటున్నారు. ఏది ఏమైనా ఈసారి సిక్కోలులో తూర్పు కాపులు ఒక వైపు పట్టుదలగా ఉన్నారు. కాళింగులు కూడా అదే విధంగా కనిపిస్తున్నారు. చూడాలి మరి రాజకీయం ఏ రూపు తీసుకుంటుంది అన్నది.
