దేశంలోనే అతి పెద్ద కుంభకోణం.. కాళేశ్వరం: సభలో చర్చ
లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కూడా 2 లక్షల ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేక పోయారని ఉత్తమ్ కుమార్ విమర్శిం చారు.
By: Garuda Media | 1 Sept 2025 12:40 AM ISTతెలంగాణలో గత బీఆర్ ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపి స్తూ.. ప్రస్తుత ప్రభుత్వం నియమించిన పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును తాజాగా ఆదివారం సాయంత్రం అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈ నివేదికను సభలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. దేశంలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. జరిగిన అతి పెద్ద ప్రాజెక్టుల కుంభకోణం ఇదేనని చెప్పారు. లక్షల కోట్ల రూపాయల మేరకు ఖర్చుచేసిన ఈ ప్రాజెక్టులో అడుగడుగునా అవినీతి చోటు చేసుకుందని తెలిపారు.
లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కూడా 2 లక్షల ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేక పోయారని ఉత్తమ్ కుమార్ విమర్శిం చారు. కాళేశ్వరం ద్వారా ఐదేళ్ల కాలంలో కేవలం 162 టీఎంసీల నీటిని మాత్రమే తోడిపోశారని.. దీని వల్ల ఎవరికి లాభం కలిగిందో చెప్పాలని నిలదీశారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే.. మేడిగడ్డ కుంగిపోయిందని.. అయినా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహ రించారని, కనీసం దానిని పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 80 వేల కోట్ల రూపాయలు ఖర్చుచేశా రని.. కానీ, ఈ ప్రాజెక్టులో గుండెకాయ వంటి మేడిగడ్డ కుంగిపోయిందని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో లక్ష కోట్లకు పైగానేకావాల్సి ఉందని.. దీనిని కూడా సమకూర్చకుండానే నిర్మాణం చేశారని అన్నారు. ఈ ప్రాజెక్టు డిజైన్‌లోనే కాకుండా.. నిర్మాణ నాణ్యతలో కూడా తీవ్ర లోపాలు ఉన్నాయని.. కమిషన్ తన రిపోర్టులో స్పష్టం చేసిందని ఉత్తమ్ చెప్పారు. వాస్తవానికి అప్పటికే పూర్తయిన ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుకు పేరు మార్చి కాళేశ్వరం కట్టారని ఆరోపించారు. కమిషన్ రిపోర్టు చూస్తే.. ఎన్నో అక్రమాలు బయట పడుతున్నాయన్నారు. అనేక లోపాలు ఉన్నాయని.. కోట్ల రూపాయల సొమ్ము దుర్వినియోగం అయిందని స్పష్టంగా ఉన్నట్టు ఉత్తమ్ పేర్కొన్నారు.
కాగా, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ప్రసంగాన్నికొనసాగిస్తున్న సమయంలో విపక్ష బీఆర్ ఎస్ నాయకులు సభలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అది కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ కాదని.. కాంగ్రెస్ కమిషన్ అంటూ.. నినాదాలు చేశారు. ఒక దశలో ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు నిమిషాలు తన ప్రసంగాన్ని నిలుపుదల చేశారు. అయినా.. సభ్యులు శాంతించలేదు. దీంతో ఆయన తమ ప్రసంగాన్ని కొనసాగించారు. కమిషన్ రిపోర్టును ఇప్పటికే అందరికీ అందించామని.. దీనిని సంపూర్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే తాము సభలో మాట్లాడుతున్నామని చెప్పారు. ``మీరు కట్టిన ప్రాజెక్టు మీ హయాంలోనే కుంగిపోయింది. దీనిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు`` అని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.
