Begin typing your search above and press return to search.

కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ సంచలనం...వాట్ నెక్స్ట్ ?

తెలంగాణాలో పోలవరం స్థాయిలో భారీ ప్రాజెక్ట్ కి కేసీఆర్ ప్రభుత్వం రూపకల్పన చేసింది.

By:  Satya P   |   4 Aug 2025 11:38 PM IST
కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ సంచలనం...వాట్ నెక్స్ట్ ?
X

తెలంగాణాలో పోలవరం స్థాయిలో భారీ ప్రాజెక్ట్ కి కేసీఆర్ ప్రభుత్వం రూపకల్పన చేసింది. దాదాపుగా లక్ష కోట్లతో చేపట్టిన ఈ పధకం ఇపుడు తెలంగాణా రాజకీయాల్లో సరికొత్త మంటలను రేపుతోంది మొదటి నుంచి ఈ ప్రాజెక్ట్ విషయంలో ఏకపక్షంగా దూకుడుగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించింది అని విపక్షాలు నాడు ఆరోపించాయి. ఇక 2023లో జరిగిన తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల వేళ కాళేశ్వరం అవినీతి అంశం మీదనే కాంగ్రెస్ నేతలు జనం ముందుకు వచ్చి ఘాటైన విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వస్తే ప్రాజెక్ట్ వెనక దాగిన అవినీతి నిగ్గు తేలుస్తామని కూడా చెప్పుకొచ్చారు.

665 పేజీల కమిషన్ నివేదిక :

ఏకంగా 17 నెలల పాటు పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద పూర్తి స్థాయి విచారణ జరిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ మీద నివేదిక కోరుతూ 2024 మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. సుదీర్ఘంగా విచారణ చేసి 665 పేజీలతో ఒక సమగ్రమైన సంపూర్ణమైన నివేదికను పీసీ ఘోష్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఇక తెలంగాణా మంత్రివర్గ సమావేశంలో ఈ నివేదికను ఆమోదించారు. ఈ నివేదికలో సంచలన విశేషాలు అనేకం ఉన్నాయని చెబుతున్నారు.

కాళేశ్వరం కధా కమామీషూ :

తెలంగాణాలో తొలి ప్రభుత్వాన్ని 2014లో ఏర్పాటు చేసిన కేసీఆర్ 2016లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ని తలపెట్టారు. తెలంగాణాకు సాగు నీటి కొరత లేకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్ట్ ని చేపట్టినట్లుగా కేసీఆర్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఏకంగా లక్ష కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్ట్ కోసం వెచ్చించారు అని అంటున్నారు. మూడేళ్ళలో ఈ ప్రాజెక్టుని పూర్తి చేశారు. 2019లో దీనిని ప్రారంభించారు. ఇక ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కేసీఆర్ ప్రభుత్వం అధిక వడ్డీలకు ఎనభై నాలుగు వేలకోట్ల రూపాయలను రుణాలుగా తెచ్చారని కమిషన్ పేర్కొంది.

లోపాలెన్నో ఉన్నయంటూ :

అంతే కాదు ప్రాణహిత చేవేళ్ళ ప్రాజెక్టుని కాస్తా కాళేశ్వరంగా మార్చారని ఇందులో కేసీఆర్ దే కీలక పాత్ర అని కమిషన్ తేల్చిందని చెబుతున్నారు. ఈ భారీ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం లేదని కూడా కమిషన్ వెల్లడించడం విశేషం. ఈ భారీ ప్రాజెక్ట్ విషయంలో పెద్ద ఎత్తున ప్రజా ధనం దుర్వినియోగం అయినట్లుగా పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికలో పేర్కొందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ప్రాజెక్ట్ డిజైన్, ప్రాజెక్టు నిర్వహణతో పాటుగా నిర్మాణంలో లోపాలున్నాయని కమిషన్ స్పష్టం చేసిందని అంటున్నరు. అదే విధంగా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టుల పునాదుల్లోనే లోపాలున్నాయని తెలిపింది.

అంచనాల మీద కూడా :

ఈ భారీ ప్రాజెక్ట్ విషయంలో పలు మార్లు అన్చనాలను సవరించారని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ స్పష్టం చేసిందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ప్రజల సొమ్ముని కాంట్రాక్టర్లకు అప్పగించారని విమర్శిస్తున్నారు. రుణాలు తీసుకొచ్చే విషయంలోనూ గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని చెప్పారు. అన్ని విధాలుగా ఈ ప్రాజెక్ట్ లోపభూయిష్టమని కుప్ప కూలిందని ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ పెట్టి మరీ విమర్శించారు.

అసెంబ్లీకి నివేదిక :

కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద జస్టిస్ పీసీ ఘోష్ నివేదికలో అనేక సార్లు అప్పటి జల వనరుల శాఖ మంత్రి హరీష్ రావు పేరు ఉందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ముమ్మాటికి ఇది అవినీతి ప్రాజెక్ట్ అని పేర్లు మార్చి చేసినదే తప్ప మరేమీ కాదని అంటున్నారు. ఈ నివేదికను అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి అందరి అభిప్రాయాలను తెలుసుకోవాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కమిషన్ నివేదికపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఆయన చెప్పారు. రాజకీయ కక్షలతో కాకుండా ప్రజల కోసమే ఈ నివేదిక మేరకు ప్రభుత్వం వ్యవహరిస్తుందని అంటున్నారు. మొత్తానికి చూస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద వచ్చిన నివేదిక అసెంబ్లీలో పెట్టిన తరువాత వరసబెట్టి యాక్షన్ మొదలవుతుందని అంటున్నారు.