Begin typing your search above and press return to search.

క‌మిష‌న్‌పై క‌ల‌క‌లం.. ఏం చేద్దాం: కేసీఆర్

వాస్త‌వానికి ఈ క‌మిష‌న్ 665 పేజీల సుదీర్ఘ‌ రిపోర్టు ఇచ్చి కూడా మూడు వారాలు అయింది. దీనిపై రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారుల క‌మిటీని ఏర్పాటు చేసి దీనిని కుదించి 65 పేజీల‌కు మార్చింది

By:  Garuda Media   |   23 Aug 2025 6:00 AM IST
క‌మిష‌న్‌పై క‌ల‌క‌లం.. ఏం చేద్దాం:  కేసీఆర్
X

కాళేశ్వ‌రం ప్రాజెక్టులో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌లు, మేడిగ‌డ్డ రిజ‌ర్వాయ‌ర్ కుంగుబాటు స‌హా ఇత‌ర ప్రాజెక్టుల్లో అవినీతి జ‌రిగింద‌ని పేర్కొంటూ.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం వేసిన మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్‌ పినాకి చంద్ర‌ఘోష్ క‌మిష‌న్ పై త‌దుప‌రి కార్యాచర‌ణ ఏంట‌నే విష‌యంపై మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా పార్టీ కీల‌క నాయ‌కులు,మాజీ మంత్రుల‌తో ఎర్ర‌వ‌ల్లిలోని త‌న ఫాం హౌస్‌లో మంత‌నాలు జ‌రిపారు. వాస్త‌వానికి ఈ క‌మిష‌న్ 665 పేజీల సుదీర్ఘ‌ రిపోర్టు ఇచ్చి కూడా మూడు వారాలు అయింది. దీనిపై రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారుల క‌మిటీని ఏర్పాటు చేసి దీనిని కుదించి 65 పేజీల‌కు మార్చింది.

ఈ రిపోర్టుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వివ‌రించారు. కేసీఆర్‌ను టార్గెట్ చేసుకుని.. ఆయ‌న అప్ప‌ట్లో కీల‌క వ్యాఖ్య‌లు చే శారు. అసెంబ్లీలోనే దీనిపై చ‌ర్చిస్తామ‌ని.. ద‌మ్ముంటే అసెంబ్లీకి వ‌చ్చి త‌ప్పు చేయ‌లేద‌ని చెప్పాల‌ని కూడా సీఎం రేవంత్ రెడ్డి స‌వాల్ రువ్వారు. ఈ ప‌రిణామాల‌పైనేరుగా స్పందించ‌ని కేసీఆర్‌.. హైకోర్టును ఆశ్ర‌యించారు. అస‌లు ఈ క‌మిష‌న్ వృథా అని రాజ‌కీయ దురుద్దేశంతో ఏర్పాటు చేశార‌ని ఆయ‌న తెలిపారు. దీనిని కొట్టి వేయాల‌ని కోర్టును అభ్య‌ర్థించారు. తాము ఇచ్చిన వివ‌రాల‌ను కూడా క‌మిష‌న్ ప‌ట్టించుకోలేద‌ని కోర్టుకు వివ‌రించారు. ఈ కేసును వ‌రుస‌గా రెండు రోజులు విచారించిన కోర్టు.. ఐదు వారాల‌కు వాయిదా వేసింది.

కానీ, మ‌రోవైపు.. ప్ర‌భుత్వం ఈ క‌మిష‌న్ రిపోర్టుపై అసెంబ్లీ స‌మావేశాల్లో చ‌ర్చించాల‌ని నిర్ణ‌యించింది. ఈ స‌మావేశాలు త్వ‌ర‌లో నే ప్రారంభం కానున్నాయి. వ‌ర్షాకాల స‌మావేశాల్లో దీనిని ప్ర‌వేశ పెట్టి.. చ‌ర్చించేందుకు స్పీక‌ర్ కూడా ప్ర‌భుత్వానికి అనుమ‌తి ఇచ్చిన‌ట్టు తెలిసింది. అయితే.. హైకోర్టు ఈ విష‌యంలో ప్ర‌భుత్వానికి ఎలాంటి అడ్డు చెప్ప‌లేదు. అసెంబ్లీలో చ‌ర్చ‌కు పెట్టొచ్చా.. లేదా? అనే విష‌యాల‌ను హైకోర్టు ప్ర‌స్తావించ‌లేదు. ఈ నేప‌థ్యంలో స‌ర్కారు త‌న‌కు ల‌భించిన అవ‌కాశాన్ని వదులుకునే ప్ర‌స‌క్తి లేదు. త్వ‌ర‌లోనే స్థానిక ఎన్నిక‌లు కూడా ఉండ‌డంతో ఈ క‌మిష‌న్‌పై చ‌ర్చ జ‌రిగితే రాజ‌కీయంగా బీఆర్ ఎస్‌కు ఇబ్బందులు త‌ప్ప‌వు.

ఈ నేప‌థ్యంలోనే కేసీఆర్ మాజీ మంత్రి హ‌రీష్ రావు స‌హా, పార్టీ కీల‌క నాయ‌కుల‌తో తాజాగా భేటీ అయ్యారు. త‌దుప‌రి కార్యాచ ర‌ణ ఏంట‌న్న విష‌యంపై ఆయ‌న స‌మాలోచ‌న‌లు జ‌రిపారు. ఈ క‌మిష‌న్ రిపోర్టును అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టి, చ‌ర్చించ‌కుండా ఆదేశాలు ఇచ్చేలా హైకోర్టులోమ‌రో పిటిష‌న్ వేసే అవ‌కాశం ఉందా? అనే అంశంపై న్యాయ వ‌ర్గాల అభిప్రాయాలు తీసుకోవాల‌ని హ‌రీష్‌రావుకు సూచించిన‌ట్టు తెలిసింది. ఒక‌వేళ అది కుర‌క‌పోతే.. అసెంబ్లీలో చ‌ర్చ‌కు పెడితే.. స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొట్టే వ్యూహాల‌ను కూడా సిద్ధం చేసుకోవాల‌ని హ‌రీష్ రావు స‌హా నాయ‌కుల‌కు సూచించారు. దీనిపై మ‌రోసారి చ‌ర్చించాల‌ని కూడా నిర్ణ‌యించారు.