కేసీఆర్.. మజాకా: హైకోర్టుకు చేరిన కాళేశ్వరం పంచాయతీ!
ఈ క్రమంలో మాజీ సీఎంకేసీఆర్.. కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్టు కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి.
By: Garuda Media | 20 Aug 2025 2:00 AM ISTతెలంగాణ రాష్ట్రాన్ని గత కొన్నాళ్ల కిందట తీవ్రస్థాయిలో కుదిపేసిన కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల వ్యవహారం గురించి తెలిసిందే. దీనిపై నియమించిన పినాకి చంద్రఘోష్(పీసీ ఘోష్) విచారణ, అనంతరం ఇచ్చిన 665 పేజీల నివేదిక వంటివి రాజకీయంగా కూడా దుమారం రేపాయి. కాళేశ్వరంపై కమిషన్ కాదని.. కాంగ్రెస్ కమిషన్ అంటూ.. ప్రతిపక్ష బీఆర్ ఎస్ నాయకులు తీవ్రస్థాయి లో విమర్శలు గుప్పించారు. ఇక, ఈ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ ను కూడా ప్రశ్నించింది. దీనికి ముందు.. అప్పటి మంత్రులు ఈటల రాజేందర్, హరీష్‌రావులను కూడా పలుమార్లు విచారించింది.
పది రోజుల కిందట ఈ కమిషన్ నివేదికపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం 65 పేజీల సారాంశంతో కూడిన నివేదికను తెప్పించింది. ఇక, ఈ నివేదికను అసెంబ్లీలో పెట్టి.. చర్చించిన తర్వాత చర్యలు తీసుకుందామని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి వర్గం లోనూ స్పష్టం చేశారు. మరో 15-20 రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు వచ్చి కేసీఆర్ తన నిజాయితీని నిరూపించుకోవాలంటూ.. అధికార పక్షం నుంచి పెద్ద ఎత్తున సవాళ్లు కూడా వచ్చాయి. మొత్తంగా కాళేశ్వరం వ్యవహారం.. ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో కొంత నెమ్మదించినా.. ముందు ముందు మరింత మంటలు రేపనుంది.
ఈ క్రమంలో మాజీ సీఎంకేసీఆర్.. కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్టు కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిని నిజం చేస్తూ.. తాజాగా మంగళవారం మధ్యాహ్నం.. ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ``కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కొట్టి వేయండి`` అని పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించారు. కేసీఆర్‌తో పాటు.. మాజీ మంత్రి హరీష్‌రావు కూడా ఇదే అభ్యర్థనతో మరో పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. టెక్నికల్ కారణాలతో మంగళవారం.. ఈ పిటిషన్‌కు నెంబరు కేటాయించలేదు. దీంతో ఇది బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
ముహూర్తం చూసుకుని..
సెంటిమెంటును నమ్ముకునే మాజీ సీఎం కేసీఆర్.. హైకోర్టులో పిటిషన్ వేసేందుకు కూడా ముహూర్తం చూసుకున్నట్టు తెలిసింది. మంగళవారం బలమైన ఏకాదశి తిథి ఉన్నప్పటికీ.. మధ్యాహ్నం 2 గంటల వరకు వర్జ్యం ఉండడంతో ఆ సమయం తర్వాత.. ఆయన పిటిషన్‌పై సంతకం చేశారని సమాచారం. అనంతరం హుటాహుటిన బీఆర్ ఎస్ తరఫున న్యాయవాదులు.. హైకోర్టు రిజిస్ట్రీకి పిటిషన్ పత్రాలను అప్పగించారు. అయితే.. అప్పటికే సమయం మించి పోవడంతో దానికి నెంబర్ కేటాయించలేదని న్యాయవాదులు ఆఫ్ దిరికార్డుగా తెలిపారు.
పిటిషన్‌లో ఏముంది?
కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రధానంగా నాలుగు అంశాలు ఉన్నాయని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి.
1) విధాన పరమైన నిర్ణయాలపై విచారణ చేయడాన్ని గతంలో సుప్రీంకోర్టు తప్పుపట్టిన విషయాన్ని ప్రస్తావించారు.
2) మంత్రివర్గంలో చర్చించిన తర్వాతే కాళేశ్వరం, మేడిగడ్డ, సుందుళ్ల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపామని.. ఇది వ్యక్తిగత నిర్ణయం కాదని పేర్కొన్నారు.
3) పీసీ ఘోష్ కమిషన్ వేయడమే విరుద్ధం.
4) ఈ కమిషన్ తాము చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.
