సీబీఐ ఈటెతో ఆయనను గుచ్చుతున్నారా ?
ఇక సీబీఐ ఎంట్రీ ఇస్తే కనుక ఈ కేసుకు సంబంధించి ఆనాడు ప్రభుత్వంలో ఉన్న వారు అందరినీ విచారణ చేస్తుంది అని అంటున్నారు.
By: Satya P | 2 Sept 2025 1:00 AM ISTకాళేశ్వరం ప్రాజెక్ట్ లో భారీ అవినీతి జరిగింది అన్నది గత ఆరేళ్ళుగా జరిగిన రాద్ధాంతం అంతా చివరికి సీబీఐ ముంగిట తేలింది. అది కూడా తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళకు దగ్గర పడుతున్న తరుణంలో ఇది చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే సీబీఐ విచారణ అంటే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ. తెలంగాణాలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కాళేశ్వరం మీద విచారణ జరిపిస్తామన్న మాట మేరకు వచ్చిన వెంటనే పీసీ ఘోష్ కమిషన్ తో విచారణ జరిపించారు. ఆ నివేదిక చూస్తే ఏకంగా ఆరు వందల పేజీలు ఉంది. ఇది సమగ్రమైన నివేదిక అని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు గట్టిగా చెబుతూంటే పీసీ ఘోష్ నివేదిక కాదు అని పీసీసీ నివేదిక అని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు.
సీబీఐకి ఎందుకంటే :
ఇదిలా ఉంటే ఒక రోజంతా దీని మీదనే తెలంగాణా అసెంబ్లీలో చర్చ సాగింది. ఇక అర్ధరాత్రి దాటాక ఈ చర్చకు బదులిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసుని సీబీఐకి అప్పగిస్తామని ప్రకటించడం విశేషం. దీంతో ఇపుడు ప్రతిష్టాత్మకమైన కేంద్ర దర్యాప్తు సంస్థ ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటోంది అన్న మాట. ఇక కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రభుత్వం చేతిలో సీఐడీ ఉంది, ఇతర దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. ప్రత్యేకంగా సిట్ ని కూడా ఏర్పాటు చేయవచ్చు. కానీ ఎందుకు సీబీఐకి అంటే కేసీఆర్ ని రాజకీయంగా తాము ఇబ్బంది పెట్టామన్న విమర్శ తమకు రాకూడదని ముందు ఆలోచనతోనేనా అన్నది చర్చగా ఉంది.
బీజేపీ వైపే చూపు :
కేంద్రంలోని బీజేపీ వైపు ఇపుడు అందరి చూపూ ఉంది. సీబీఐకి ఒక కేసుని రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా ఇస్తామని అంటోంది. దాంతో ఈ కేసుని టేకప్ చేసి నిగ్గుని తేల్చాల్సిన బాధ్యత కచ్చితంగా సీబీఐ వంటి సంస్థకు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ ఏ కేసుని అయినా విచారణకు స్వీకరిస్తుంది పైగా లక్షా నలభై వేల కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఒక ప్రాజెక్ట్ అని చెబుతున్నారు కాబట్టి ఎంతో బరువైన కేసు ఇది అని అంటున్నారు సో తొందరలోనే సీబీఐ ఎంట్రీ ఉండొచ్చు అని అంటున్నారు.
ఈటెల కూడానా :
ఇక సీబీఐ ఎంట్రీ ఇస్తే కనుక ఈ కేసుకు సంబంధించి ఆనాడు ప్రభుత్వంలో ఉన్న వారు అందరినీ విచారణ చేస్తుంది అని అంటున్నారు. ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటే ఆర్థిక మంత్రిగా ఈటెల రాజెందర్ ఉన్నారు జలవనరుల శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు. ఈ కేసులో విచారణ జరిగితే ఈటెలను కూడా ప్రశ్నిస్తారు అని అంటున్నారు. అయితే ఈటెల ప్రస్తుతం మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా ఉన్నారు. ఆయన బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. మరి సీబీఐ ఈ కేసు అంటే బీజేపీకి చెందిన ఎంపీని కూడా విచారిస్తుందా అన్నదే చర్చగా ఉంది.
సొంత పార్టీలో ప్రత్యర్థులు :
ఈటెలకు సొంత పార్టీలో ప్రత్యర్ధులు ఉన్నారని ప్రచారంలో ఉంది. ఆ మధ్యన కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్సెస్ ఈటెలగా ఒక ఎపిసోడ్ నడిచింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతి మీద సీబీఐకి విచారణకు అప్పగించడం మంచి పరిణామం అని బండి సంజయ్ చేసిన ట్వీట్ ఇపుడు చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ మొదటి నుంచి ఈ కేసులో నిగ్గు తేలాలి అంటే సీబీఐ జోక్యం అవసరం అని చెబుతోంది అని ఆయన అంటున్నారు. అంతే కాదు ఆనాటి బీఆర్ ఎస్ ప్రభుత్వంలో ముఖ్యులుగా ఉంటూ ఈ ప్రాజెక్ట్ విషయంలో కీలకంగా వ్యవహరించిన వారి అందరి విషయంలోనూ సీబీఐ విచారణ చేస్తుందని అంటున్నారు. అంటే ఈ రోజున ఈటెల బీజేపీ ఎంపీగా ఉన్నా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రిగా ఉన్నారు. సో ఆయనను సైతం విచారించాలన్నది దీని భావనా అని కూడా చర్చ సాగుతోంది.
బీజేపీకి పరీక్ష :
కాంగ్రెస్ ఈ కేసుని సీబీఐకి అప్పగించడం ద్వారా వ్యూహాత్మకంగా వ్యహరించింది అని అంటున్నారు. ఎందుకంటే తమ చేతికి మట్టి అంటించుకోకుండా బీజేపీకే బాధ్యతను అప్ప్గించింది. దాంతో బీజేపీ ఏమి చేస్తుంది అన్నదే అంతా ఆలోచిస్తున్నారు. పైగా ఈటెల బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఆయనను పక్కన పెట్టి కేసుని విచారిస్తామంటే కుదరదు, అలాగని ఆయనతో పాటు అంటే తమ ఎంపీ మీదనే విచారణ జరిపిస్తారా అన్నది మరో చర్చ. ఏది ఏమైనా ఇపుడు బీజేపీకే ఈ కేసు ఒక అగ్ని పరీక్షగా మారింది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
