Begin typing your search above and press return to search.

అక్కడ పెదనాన్న వర్సెస్ అబ్బాయి...రంజుగానే ?

విజయనగరం జిల్లాలో మొత్తానికి మొత్తం సీట్లను కూటమి 2024 ఎన్నికల్లో గెలుచుకుంది. అంతా బాగుంది అనుకుంటే మూడు పార్టీల మధ్య సర్దుబాటు సమస్యగా ఉంది.

By:  Satya P   |   27 Jun 2026 10:00 AM IST
అక్కడ పెదనాన్న వర్సెస్ అబ్బాయి...రంజుగానే ?
X

విజయనగరం జిల్లాలో మొత్తానికి మొత్తం సీట్లను కూటమి 2024 ఎన్నికల్లో గెలుచుకుంది. అంతా బాగుంది అనుకుంటే మూడు పార్టీల మధ్య సర్దుబాటు సమస్యగా ఉంది. ఇక సొంత పార్టీలో కూడా తేడాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఒక కీలక నియోజకవర్గంలో పెదనాన్న వర్సెస్ అబ్బాయిగా రాజకీయం రంజుగా సాగుతోంది అని అంటున్నారు. ఆ నియోజకవర్గం చీపురుపల్లి. ఈ నియోజకవర్గానికి 2024 ఎన్నికల్లో సడెన్ గా దిగుమతి అయిన నేత మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు. నిజానికి ఆయన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల సీటుని కోరుకున్నారు. 2014లో అక్కడ నుంచే గెలిచారు. 2019లో ఓడినా 2024 దాకా గట్టిగా పనిచేసి గెలుపు గుర్రం ఎక్కుదామని అనుకున్న తరుణంలో అనూహ్యంగా మార్చేశారు. బదిలీ చేసేశారు. దాంతో ఆయన అయిష్టంగానే విజయనగరం జిల్లా చీపురుపల్లికి వచ్చారు.

అబ్బాయి సీటుకు ఎసరు :

అయితే చీపురుపల్లిలో కళా వెంకట్రావు తమ్ముడు కొడుకు నాగార్జున చీపురుపల్లి ఇంచార్జిగా ఉన్నారు. ఆయన 2019 లోనే రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. సీనియర్ నేత బొత్స సత్యనారాయణను గట్టిగా ఢీ కొట్టారు. అయితే వైసీపీ వేవ్ లో ఆయనకు ఓటమి తప్పింది కాదు, అయితే ఆయన 2024 ఎన్నికల వరకూ జనంతో ఉంటూ ఎంతో కష్టపడ్డారు. ఫలితంగా ఈసారి ఎమ్మెల్యే అవుతాను అని లెక్క వేసుకున్నారు. అయితే సొంత పెదనాన్న కదా అని సర్దుకుని పోయారు. కానీ అయిదేళ్ళకు మాత్రమే అన్న కండిషన్ ని పక్కాగా అప్లై చేస్తున్నారు అబ్బాయి. ఇక కిమిడి నాగార్జునకు మంత్రి నారా లోకేష్ మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు. ఆయన టీం లో చురుకుగా ఉన్నారు. అందుకే ఆయనకు విజయనగరం జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ పదవితో పాటుగా డీసీసీబీ చైర్మన్ పదవి కూడా దక్కింది.

ఈసారి గురి తప్పదు :

దీంతో ఈసారి అంటే 2029 ఎన్నికల్లో పోటీ చేయడానికి అబ్బాయి నాగార్జున అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దాంతో తన వర్గాన్ని తన బలాన్ని పటిష్టం చేసుకుంటూ వస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా కిమిడి కళా వెంకట్రావు ఉన్నా నాగార్జున హవాయే నియోజకవర్గంలో సాగుతోంది అని ప్రచారంలో ఉంది. దీంతో కళా వర్గీయులు అంతా గుస్సా అవుతున్నారు. తాము అనుకున్న పనులు జరగడం లేదని వారు వాపోతున్నారు. కళా కూడా తాను ఎమ్మెల్యే కాబట్టి తన మాట చెల్లాలని గట్టిగానే పట్టుబడుతున్నారని అంటున్నారు. దీంతో స్మూత్ గానే ఒక లడాయి అయితే ఈ నియోజకవర్గంలో వచ్చింది అని అంటున్నారు.

ముందస్తు జాగ్రత్తగా :

ఇదిలా ఉంటే కళా వెంకట్రావు అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరు. ఇది పూర్తిగా కన్ఫర్మ్ అయినది అని అంటున్నారు. కానీ తన రాజకీయ వారసుడిగా కుమారుడు రామ మల్లిక్ నాయుడుని తీసుకుని రావాలని చూస్తున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచే ఈసారి సీటు కోరాలని అనుకుంటున్నారు. అయితే అక్కడ టీడీపీ నుంచి ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఉన్నారు. అలాగే బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఈశ్వరరావు ఉన్నారు. దాంతో పాటు జనసేన కూడా సీటు మీద కర్చీఫ్ వేసింది అని చెబుతున్నారు. దాంతో ఒకవేళ ఈ తీవ్రమైన పోటీలో కనుక తన కుమారుడికి సీటు దక్కకపోతే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని ప్లాన్ బీగా వేసుకున్నట్లుగా ప్రచారం సాగుతోంది. దాంతో ఈ సీటు విషయంలో అబ్బాయి నాగార్జున పెదనాన్న కళాల మధ్య గట్టి పోటీ ఏర్పడింది అని అంటున్నారు.