విద్యార్థిని - యువకుడు.. హత్య - ఆత్మహత్య.. అసలేం జరిగింది?
అవును... ఓ యువకుడు ఓ విద్యార్థిని వెనుక 9వ తరగతి నుంచి ప్రేమిస్తున్నానని వెంటపడడ్డాడు.
By: Raja Ch | 2 Oct 2025 2:48 PM ISTప్రేమించడం అంటే ప్రేమను ఇవ్వడం, ప్రేమను పంచడం. ఈ విషయం చాలా మంది మరిచిపోతున్నారు.. ప్రేమకు ఉన్న పవిత్ర అర్ధాలను మారుస్తూ.. సరికొత్త నానార్ధాలు తీస్తున్నారు! మరికొంతమంది ప్రేమించినవారు అంగీకరించలేదనో, బ్రేకప్ చెప్పారనో ఏకంగా హత్యలకు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీంతో పవిత్రమైన ప్రేమే పలువురి పాలిట పాశమైపోతోంది.
అవును... ఓ యువకుడు ఓ విద్యార్థిని వెనుక 9వ తరగతి నుంచి ప్రేమిస్తున్నానని వెంటపడడ్డాడు. దీంతో ఆ బాలిక కుటుంబసభ్యులు సదరు యువకుడిని గతంలో గట్టిగా హెచ్చరించినట్లు తెలిసింది. అయితే ఇద్దరికీ సెల్ ఫోన్ లో పరిచయం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా షాపుకని వెళ్లిన బాలిక ఆ యువకుడితో బైక్ పై వెళ్లిపోయినట్లు చెబుతున్నారు.
అయితే.. షాపుకని వెళ్లిన బాలిక ఎంత సమయమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడుతున్నారు! కట్ చేస్తే.. కాలువగట్టుపై ఆ బాలిక రక్తపు మడుగులో శవమై కనిపించింది. మరోవైపు ఆమెను తీసుకెళ్లినట్లు చెబుతున్న యువకుడు రైలు పట్టాలపై ప్రాణాలొదిలాడు. ఈ ఘటన కాకినాడ జిల్లా సామర్ల కోటలో జరిగింది.
హత్య - ఆత్మహత్య... అసలేం జరిగింది?:
సామర్ల కోట మండలం, పనసపాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సమీపంలోని గాడేరు కాలువగట్టుపై జి.దీప్తి (17) అనే ఇంటర్ విద్యార్థిని మృతదేహం కనిపించింది. దీంతో ఆ మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు ఆమె హత్యకు గురైనట్లు తేల్చారు. అదే సమయంలో హుస్సేన్ పురం రైల్వే ట్రాక్ పై గుండుతో ఉన్న కే.అశోక్ (19) అనే యువకుడి మృతదేహం కనిపించింది.
ఆ బాలిక చనిపోయినచోట ఓ టోపీ లభ్యమైవ్వడం.. రైలు పట్టాలపై మరణించిన యువకుడు గుండుతో ఉండటంతో.. ఆ టోపీ ఆధారంగా అతనే హత్య చేసి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ప్రాథమికంగా తేల్చిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. రైల్వే పట్టాల సమీపంలో దొరికిన బైక్ నంబర్ ఆధారంగా వారిని గుర్తించారు.
ఇందులో భాగంగా... ఆ యువకుడు, బాలిక గొల్లప్రోలు మండలంలోని దుర్గాడ గ్రామానికి చెందినవారని తేల్చారు. మరోవైపు వారిద్దరి సెల్ ఫోన్ లలోని కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి పని మొదలుపెట్టింది. ఈ సమయంలో అసలు ఈ హత్య, ఆత్మహత్య వెనుక ఉన్న కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు అత్యంత ఆసక్తిగా మారింది.
సదరు యువకుడు పాలిటెక్నిక్ చదివి ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం కోసం ఇటీవల చెన్నై వెళ్లి.. మంగళవారం తిరిగి విజయవాడ వచ్చి తలనీలాలిచ్చి సొంత గ్రామానికి చేరుకున్నాడట. అనంతరం సదరు విద్యార్థినికి ఫోన్ లో టచ్ లోకి వెళ్లి.. బంధువుల బైక్ తీసుకుని కాకినాడ వెళ్లి.. ఆమెతో పనసపాడు చేరుకున్నాడు.
ఈ క్రమంలో గాడేరు కాలువ సమీపంలోకి వెళ్లిన తర్వాత ఆమె గొంతుకోసి హత్య చేశాడని పోలీసులు భావిస్తున్నారు. అనంతరం అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే... అశోక్ ఆత్మహత్యకు పాల్పడే ముందు తన తండ్రి ఫోన్ కు మెసేజ్ పెట్టాడు. ఇందులో భాగంగా... 'ఐయాం సారీ.. ఐ లవ్ యూ సోమచ్ నాన్నా.. నిన్ను వదిలివెళ్లిపోతున్నాను' అని రాశాడు.
అయితే... వీరి ప్రేమకు కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడం వల్ల ఈ దారుణానికి ఒడిగట్టాడా.. లేక, ఈ దారుణాల వెనుక వేరే ఎవరిదైనా హస్తం ఉందా.. అదీగాక, మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.. వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది.
