Begin typing your search above and press return to search.

కాకాణి పాద‌యాత్ర‌.. స‌ర్వేప‌ల్లి రాజకీయం హీటెక్కింది.. !

నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు.

By:  Garuda Media   |   13 Jan 2026 7:00 PM IST
కాకాణి పాద‌యాత్ర‌.. స‌ర్వేప‌ల్లి రాజకీయం హీటెక్కింది.. !
X

నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. తన నియోజకవర్గంలో పాటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఆయన పాదయాత్ర చేయనున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా లభించినట్టు తెలుస్తోంది. నిజానికి సర్వేపల్లి నియోజకవర్గంలో అప్రతిహతంగా విజయం సాధించిన గోవర్ధన్ రెడ్డి గత ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. నిజానికి ఆయన పోటీ చేసిన తరువాత ఓడిపోవడం అన్నది గత ఎన్నికల్లోనే కనిపించింది.

ఈ నేపథ్యానికి తోడు ఆయనపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో రాజకీయంగా సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి గ్రాఫ్ తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో తిరిగి ఆయన పుంజుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో 60 ఏళ్ల వ‌య‌సులో ఆయ‌న పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్నార‌ని స‌మాచారం. దీనికి పార్టీ అధిష్టానం నుంచి కూడా అనుమతి లభించినట్టు తెలుస్తోంది. గ్రామీణ స్థాయిలో తనను తాను నిలబెట్టుకోవడం కోసం, తన గ్రాఫ్ ను ప‌టిష్టపరుచుకోవడం కోసం గోవర్ధన్ రెడ్డి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు.

సంక్రాంతి అనంతరం దీనిపై ఒక స్పష్టమైన ప్రకటనను ఆయన చేయనున్నట్టు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. వాస్తవానికి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అప్పట్లో పెద్దగా ఎటువంటి ఆరోపణలు లేని గోవర్ధన్ రెడ్డి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి ప‌ద‌విని చేప‌ట్టారు. ఆ త‌ర్వాతే ఆయ‌న‌పై పలు విషయాల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు బలమైన కూటమి ప్రభావంతో గత ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల నాటికి తనను తాను నిలబెట్టుకోవడం కోసం పాదయాత్ర చేయడం ద్వారా తన గ్రాఫును పటిష్ట పరచుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

రెడ్ల కోస‌మేనా.. ?

గోవ‌ర్ధ‌న్ రెడ్డికి నెల్లూరు రెడ్డి సామాజిక వ‌ర్గంలో మంచి పేరుంది. అయితే.. ఆయ‌న‌పై కేసులు న‌మోదు కావ‌డంతోపాటు జైలుకు కూడా వెళ్లిన త‌ర్వాత‌.. రెడ్డి సామాజిక వ‌ర్గం దాదాపు ఆయ‌న‌కు దూరంగా జ‌రిగింది. ఈ గ్యాప్ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌రింత పెరిగితే.. అది రాజ‌కీయంగా ఆయ‌న‌కు టీడీపీ కంటే కూడా బ‌ల‌మైన ప్ర‌భావం చూపించ‌నుంది. ఈ నేప‌థ్యంలోనే రెడ్డి సామాజిక వ‌ర్గం స‌మ‌స్య‌లు తెసుకునేందుకు.. వారికి తాను అండ‌గా నిలుస్తాన‌ని భ‌రోసా క‌ల్పించేందుకే పాద‌యాత్ర వ్యూహాన్ని గోవ‌ర్ధ‌న్ రెడ్డి ఎంచుకున్న‌ట్టు స‌మాచారం. అయితే.. దీనిలో ఏమేర‌కు ఆయ‌న స‌క్సెస్ అవుతారో చూడాలి. కాగా.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి(ప్ర‌స్తుత ఎమ్మెల్యే) కుమారుడు చేప‌ట్టిన పాద‌యాత్ర సోమిరెడ్డి విజ‌యానికి దారితీసింద‌నే చ‌ర్చ ఉంది.