రూ.5 కోట్ల అశ్వాన్ని చూశారా.. ప్రత్యేకతలివే!
అవును... హర్యానాలోని కురుక్షేత్రలోని గీత జయంతి మేళా మైదానంలో డీ.ఎఫ్.ఏ పశువుల మేళాను నిర్వహిస్తోంది.
By: Raja Ch | 13 Jan 2026 1:00 PM ISTఅశ్వములయందు ఈ అశ్వము వేరయా.. అందంలోనూ, పెర్ఫార్మెన్స్ లోనే కాదు ధరలోనూ పీక్స్ అయా అన్నట్లుగా ఉంది తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ గుర్రం వ్యవహారం. హర్యానా కురుక్షేత్రలోని గీతా జయంతి మైదానంలో జరుగుతున్న మేళాలో పలు మేలుజాతి పశువులు చూపరులను ఆకట్టుకుంటుండగా.. వాటిలో మరీ ముఖ్యంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది 'కాకా' అనే గుర్రం. పంజాబ్ లోని లుధియానా నుంచి సన్నీ అనే వ్యక్తి దాన్ని పశువుల మేళాకు తీసుకొచ్చారు.
అవును... హర్యానాలోని కురుక్షేత్రలోని గీత జయంతి మేళా మైదానంలో డీ.ఎఫ్.ఏ పశువుల మేళాను నిర్వహిస్తోంది. ఈ మేళాలోకి పలు రాష్ట్రాల నుండి పశువుల పెంపకందారులు తమ జంతువులతో వచ్చారు. ఈ సమయంలో... పంజాబ్ లోని లూధియానాకు చెందిన సన్నీ కూడా నుక్రే జాతి గుర్రంతో వచ్చాడు. ఈ గుర్రం పేరు 'కాకా' కాగా.. దాని విలువ అక్షరాలా రూ.5 కోట్లు కావడం గమనార్హం. తల నుండి కాలి వరకు పూర్తిగా తెల్లగా ఉంటూ చూపరులను ఇది విపరీతంగా ఆకట్టుకుంటుంది.
ఆ గుర్రం వయస్సు 4 సంవత్సరాలు కాగా.. ఇప్పటివరకు 21 పోటీలలో మొదటి స్థానాన్ని గెలుచుకుంది. ఇదే క్రమంలో.. కురుక్షేత్ర పశువుల సంతలో కూడా మొదటి స్థానాన్ని గెలుచుకుంది. దీని తండ్రి గుర్రమైన 'కింగ్', తల్లి అశ్వమైన 'నాజ్' కూడా గతంలో పలు పోటీల్లో విజేతలుగా నిలవడం గమనార్హం.
ఈ సందర్భంగా స్పందించిన గుర్రం యజమాని సన్నీ... కాకా అన్ని పోటీలలో ఛాంపియన్ గా నిలిచాడని.. ప్రదర్శనలో ఉన్న ఇతర జంతువుల పెంపకందారులు కూడా గుర్రం ధర విని ఆశ్చర్యపోయారని తెలిపాడు. తాము పోటీ కోసం కాకాను కురుక్షేత్ర జంతు ప్రదర్శనకు తీసుకువచ్చామని.. ఈ నేపథ్యంలో అక్కడ మొదటి స్థానంలో నిలిచాడని తెలిపాడు. మార్వారీ నుక్రే జాతి గుర్రం సన్నని, పొడవైన, నిటారుగా ఉండే మెడను కలిగి ఉంటుందని అన్నాడు.
గుర్రం మంచి ఎత్తు ఉండాలని.. కాళ్ళు, తోక పరిమాణం మందంగా ఉండాలని.. ముఖం, ఎత్తు, అనేక ఇతర విషయాలు సరిగ్గా ఉండాలని.. అలా ఉన్న గుర్రం మాత్రమే పోటీలలో గెలుస్తుందని చెప్పుకొచ్చాడు. ఇక.. తనకు గుర్రాలంటే చాలా ఇష్టంమని.. తాను 2007 నుండి గుర్రపు పోటీలలో పాల్గొంటున్నానని.. గుర్రపు దాణాను కూడా తయారు చేస్తానని.. దాణా తయారీ వ్యాపారం కూడా ఉందని తెలిపాడు.
