మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటం అస్సలు ఊహించని అమ్మాయికి..
మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని కేరళకు చెందిన 19 ఏళ్ల కజియా లిజ్ మెజో సొంతం చేసుకున్నారు.
By: A.N.Kumar | 24 Aug 2026 9:27 AM ISTమిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని కేరళకు చెందిన 19 ఏళ్ల కజియా లిజ్ మెజో సొంతం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఆదివారం రాత్రి జరిగిన గ్రాండ్ ఫినాలేలో దేశవ్యాప్తంగా ఎంపికైన 52 మంది ఫైనలిస్టులతో పోటీ పడిన ఆమె విజేతగా నిలిచారు. ఈ విజయంతో నవంబర్‌లో ప్యూర్టో రికోలో జరగనున్న 75వ మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించే అరుదైన అవకాశం కజియాకు దక్కింది.
మిస్ యూనివర్స్ ఇండియా 2025 విజేత మణికా విశ్వకర్మ.. కజియా లిజ్ మెజోకు కిరీటం తొడిగి అధికారికంగా తన వారసురాలిగా ప్రకటించారు. జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన ఈ కిరీటాన్ని దక్కించుకున్న కజియా.. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమవుతున్నారు.
దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆడిషన్లు, ఇంటర్వ్యూలు, వివిధ దశల ప్రాథమిక పోటీల అనంతరం 52 మంది ఫైనలిస్టులు తుది పోటీలకు చేరుకున్నారు. చివరి రౌండ్లలో అందం, ప్రతిభ, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం, ప్రశ్నలకు సమాధానాలు చెప్పే విధానం వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని విజేతను ఎంపిక చేశారు. అన్ని దశల్లోనూ ఆకట్టుకున్న కజియా చివరికి విజేతగా నిలిచారు.
తుది ఫలితాల్లో తమిళనాడుకు చెందిన వైష్ణవి గణేష్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు. గుజరాత్‌కు చెందిన అనుశ్రీ సతావలేకర్ సెకండ్ రన్నరప్‌గా ఎంపికయ్యారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన యువతులు ఈ పోటీలో పాల్గొనడంతో ఫైనల్ పోటీ ఉత్కంఠగా సాగింది.
ఈ కార్యక్రమానికి ప్రముఖులు జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు. 1994లో భారత్ తరఫున తొలిసారి మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న సుష్మితా సేన్ జ్యూరీకి నాయకత్వం వహించారు. మాజీ మిస్ యూనివర్స్ ఇండియా విజేతలు సెలీనా జైట్లీ, ఊర్వశి రౌతేలా, రియా సింఘాతో పాటు ప్రజ్ఞా కపూర్, విషా లధియా, అన్నా బ్లాంకో, డాక్టర్ స్టుటి ఖరే శుక్లా తదితరులు జ్యూరీ ప్యానెల్‌లో ఉన్నారు.
కజియా లిజ్ మెజో విజయంతో కేరళకు చెందిన ఈ యువతి ఒక్కసారిగా జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇప్పుడు ఆమె ముందున్న అతిపెద్ద సవాలు అంతర్జాతీయ వేదిక. నవంబర్‌లో ప్యూర్టో రికోలో జరిగే 75వ మిస్ యూనివర్స్ పోటీలో ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన అందాల రాణులతో కజియా పోటీ పడనున్నారు.
భారత్ నుంచి మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న సుష్మితా సేన్, లారా దత్తా వంటి ప్రముఖుల సరసన దేశానికి మరో అంతర్జాతీయ కిరీటం తీసుకురావాలనే లక్ష్యంతో కజియా సిద్ధమవుతున్నారు. కేరళ నుంచి జాతీయ స్థాయిలో వెలుగులోకి వచ్చిన ఈ 19 ఏళ్ల యువతి అంతర్జాతీయ పోటీలో ఎలా రాణిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
