కరోనాతో ఐటీకి గుడ్ బై.. వరుసగా 13 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన నాగేంద్రసాయి స్ఫూర్తిదాయక ప్రయాణం
కడప నగరంలోని రాజారెడ్డి వీధికి చెందిన నాగేంద్రసాయి చిన్ననాటి నుంచే విద్యలో తన ప్రతిభను చాటారు.
By: A.N.Kumar | 27 July 2026 11:24 AM ISTనేటి పోటీ ప్రపంచంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గగనంగా మారింది. ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్లు.. లైబ్రరీల చుట్టూ తిరిగినా ఆశించిన ఫలితం దక్కక ఎంతోమంది నిరాశలో కూరుకుపోతున్నారు. కానీ సరైన ప్రణాళిక, పట్టుదల, నిరంతర శ్రమ తోడైతే విజయం సాధించడం అసాధ్యమేమీ కాదని నిరూపించారు వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన లొమడ నాగేంద్రసాయి. ఏకంగా ఒక్క ఏడాదిలోనే 13 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు.
ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి ప్రభుత్వ ఉద్యోగం దిశగా..
కడప నగరంలోని రాజారెడ్డి వీధికి చెందిన నాగేంద్రసాయి చిన్ననాటి నుంచే విద్యలో తన ప్రతిభను చాటారు. స్థానిక పాఠశాలల్లో పదో తరగతి పూర్తి చేసి 9.7 జీపీఏ సాధించిన ఆయన హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. అనంతరం జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అత్యుత్తమ ర్యాంకు సాధించి.. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన పశ్చిమ బెంగాల్ ఐఐటీ ఖరగ్‌పూర్ లో ఇండస్ట్రియల్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్‌లో ఇంటిగ్రేటెడ్ బీటెక్-ఎంటెక్ పూర్తి చేశారు.
కరోనా తెచ్చిన మార్పు.. తిరోగమనమే విజయాకి పునాది
ఆయన చదువు పూర్తయ్యే సమయానికి ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కుదిపేసింది. ఐటీ రంగంలో పెరిగిన అనిశ్చితి, ఉద్యోగాల కోతలను గమనించిన నాగేంద్రసాయి, ప్రైవేట్ ఉద్యోగాల కంటే ప్రభుత్వ ఉద్యోగాల్లోనే భద్రత, స్థిరత్వం ఉంటాయని భావించారు. ప్రభుత్వ ఉద్యోగులైన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పోటీ పరీక్షల బరిలోకి దిగారు.
తొలి ప్రయత్నంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్.ఎస్.సీ) పరీక్షలో తృటిలో ఉద్యోగం చేజారినప్పటికీ ఆయన ధైర్యం కోల్పోలేదు. ఆ అపజయాన్ని ఒక పాఠంగా భావించి, తన లోపాలను విశ్లేషించుకుంటూ హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకున్నారు. వచ్చిన ప్రతి కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌కూ దరఖాస్తు చేస్తూ, పక్కా ప్రణాళికతో పరీక్షలు రాశారు.
2025లో ఉద్యోగాల పంట
ఆయన పట్టుదలకు ఫలితంగా 2025 సంవత్సరంలో విజయాల పరంపర ప్రారంభమైంది. ఎయిమ్స్, ఎస్ఎస్.సీ, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) వంటి అత్యున్నత కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఏకంగా 13 ఉద్యోగాలు సాధించి అరుదైన రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆయన తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్.ఐసీ) బ్రాంచ్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఉద్యోగార్థులకు నాగేంద్రసాయి ఇచ్చే సందేశం
తన విజయానికి నిరంతర శ్రమ, క్రమశిక్షణ, రోజుకు 10 నుండి 12 గంటల నాణ్యమైన చదువు, తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణమని నాగేంద్రసాయి చెబుతున్నారు. "తొలి ప్రయత్నంలో ఓటమి ఎదురైనంత మాత్రాన నిరాశపడకూడదు. ప్రతి అపజయం ఒక కొత్త పాఠం నేర్పుతుంది. మన లక్ష్యంపై నమ్మకం, చేసే శ్రమపై విశ్వాసం ఉంటే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఏమాత్రం అసాధ్యం కాదు" అని పేర్కొంటున్నాడు. ఏళ్ల తరబడి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న లక్షలాది మంది యువతకు నాగేంద్రసాయి విజయగాథ ఒక గొప్ప స్ఫూర్తిదాయక పాఠం.
