కడప మేయర్ పదవి నుంచి తొలగింపు.. ఎమ్మెల్యే మాధవి మాట నెగ్గింది
చిన్న అంశం చిలికి చిలికి గాలివానలా మారటమే కాదు.. చివరకు మేయర్ పదవిని పోగొట్టుకునే వరకు వెళ్లింది.
By: Garuda Media | 24 Sept 2025 11:43 AM ISTచిన్న అంశం చిలికి చిలికి గాలివానలా మారటమే కాదు.. చివరకు మేయర్ పదవిని పోగొట్టుకునే వరకు వెళ్లింది. కడప మేయర్ గా వ్యవహరిస్తున్న వైసీపీ నేత కొత్తమద్ది సురేష్ బాబును ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లుగా తాజాగా ఏపీ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.దీంతో కడప రాజకీయం మరోసారి హాటెక్కింది. ఈ ఉదంతంలో కడప ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న టీడీపీ మహిళా నేత మాధవి పంతం నెగ్గించుకున్నట్లుగా చెప్పాలి. అసలేం జరిగిందంటే..
కడప మేయర్ సురేష్ బాబు వైసీపీ నేత. కడప ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న మాధవి టీడీపీకి చెందిన వారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కడప మేయర్ గా కంటిన్యూ అవుతున్నారు సురేష్ బాబు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా చెత్త సేకరణ విషయంలో కడప మేయర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. ఉద్దేశపూర్వకంగానే క్లాప్ ఆటోల్ని తగ్గించటంపై విమర్శించారు ఎమ్మెల్యే మాధవి. కడప సిటీలో చెత్త సేకరణ జరగటం లేదని ఆమె పదే పదే ప్రశ్నించారు.
ఈ సందర్భంగా వైసీపీ నేతలు రియాక్టు అవుతూ.. కడప సిటీలో చెత్త సేకరణలో.. స్థానిక ఎమ్మెల్యే.. రాష్ట్ర ప్రభుత్వమే ఫెయిల్ అయ్యాయంటూ ఆరోపించారు. ఈ క్రమంలో మేయర్ ఫెయిల్యూర్ ను ప్రశ్నిస్తూ కొందరు ఆయన ఇంటి ఎదుట చెత్త వేసి నిరసన తెలిపారు. ఇదంతా ఎమ్మెల్యే మాధవినే చేయించారని సురేష్ భావించారు.దీంతో వీరి మధ్య గ్యాప్ మరింత పెరిగింది.
కట్ చేస్తే.. 2024 ఆగస్టులో నిర్వహించిన కడప సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే మాధవికి వేసిన కుర్చీని తొలగించారు. దీంతో.. మేయర్ కుర్చీని తాను దించుతానని స్పష్టం చేసిన ఆమె శపధం లాంటి పనే చేశారు. ఆ తర్వాత పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మేయర్ కుటుంబీకులు కడప కార్పొరేషన్ లో వర్ధిని కన్ స్ట్రక్షన్స్ కంపెనీతో రోడ్డు పనులు చేశారని.. దీనికి సంబంధించిన విచారణకు రావాలంటూ పురపాలక శాఖ నోటీసులు జారీ అయ్యాయి. దీనిపై మేయర్ సురేష్ హైకోర్టులో కేసు వేశారు.
ఇదిలా ఉండగా మే 13న పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎదుట హాజరైన మేయర్ సురేష్ తన వాదనలు వినిపించారు. ఆయన్ను మేయర్ పదవి నుంచి తొలగిస్తూ.. రెండు వారాల తర్వాత అమల్లోకి వచ్చేలా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కోర్టుకు వెళ్లిన సురేష్ కు చుక్కెదురైంది. తిరిగి హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించగా..ఆయన వాదన వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని ఆదేశిస్తూ కోర్టు పేర్కొంది. అంతేకాదు.. పురపాలక శాఖ జారీ చేసిన మేయర్ అనర్హత ఉత్తర్వులను రద్దు చేస్తూ కోర్టు అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది.
అనంతరం ఆయన తన వాదన వినిపించేందుకు వీలుగా పురపాలక శాఖ నోటీసులు జారీ చేయగా.. అందుకు హాజరు కాలేదు. మళ్లీ నోటీసు జారీ చేయటంతో సురేష్ బాబు తన వాదనను వినిపించారు. పురపాలక శాఖ వర్ధిని కన్ స్ట్రక్షన్ చేపట్టిన పనుల వివరాల్నిపూర్తిస్థాయిలో పరిశీలించిన అనంతరం.. ఆయనపై అనర్హత ఉత్తర్వులు జారీ చేయటంతో.. మేయర్ పదవి నుంచి సురేష్ బాబు వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కడప ఎమ్మెల్యే మాధవి చెప్పినట్లే.. సభలో తన కుర్చీని తీయించిన మేయర్ కుర్చీ ఉండదన్న మాటను నెగ్గించుకున్నట్లైంది.
