Begin typing your search above and press return to search.

‘ఇదేమి ఖర్మ మన కడపకు..’ కలకలం రేపుతున్న పోస్టర్లు

మేయర్ సురేష్ కు వ్యతిరేకంగా వేసిన పోస్టర్లపై కడపలో పెద్ద రాజకీయ దుమారమే రేగుతోంది.

By:  Tupaki Political Desk   |   13 Dec 2025 4:58 PM IST
‘ఇదేమి ఖర్మ మన కడపకు..’ కలకలం రేపుతున్న పోస్టర్లు
X

ఆస్తిపన్ను కట్టనోడు కడప మేయర్! నన్నెవడ్రా అడిగేది.. పన్ను కట్టనే కట్టను... రోడ్డే వేయని పాత మేయర్.. రోడ్లపై రోడ్డు వేస్తున్న కొత్త మేయర్..’’ ఇది కడప మేయర్ పాకా సురేష్ కు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు. తాను ఉంటున్న ఇంటికి పదేళ్లుగా పన్ను కట్టలేదని మేయర్ సురేష్ పై ఆరోపణలు చేస్తూ గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు వేశారు. మేయర్ గా పాకా సురేష్ ప్రమాణ స్వీకారం చేసిన మరునాడే ఈ పోస్టర్లు కనిపించడంతో రాజకీయ సంచలనంగా మారింది. ఈ పోస్టర్లను ఎవరు వేశారనేది బహిరంగ రహస్యమే అంటున్నారు. మాజీ మేయర్ సురేష్ ను పంతం పట్టి తప్పించిన ఎమ్మెల్యే మాధవీరెడ్డి.. కార్పొరేషన్ లో టీడీపీ పాగా వేయాలని భావించారని, కానీ, ఫలితం వ్యతిరేకంగా రావడంతో జీర్ణించుకోలేక మేయర్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.

మేయర్ సురేష్ కు వ్యతిరేకంగా వేసిన పోస్టర్లపై కడపలో పెద్ద రాజకీయ దుమారమే రేగుతోంది. ఈ పోస్టర్ల ద్వారా వైసీపీని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోందని అంటున్నారు. మరోవైపు మేయర్ సురేష్ ఇంటి పన్ను కట్టలేదని, పదేళ్లుగా బకాయి ఉన్నారని ఆరోపంచడం సంచలనం రేపుతోంది. అధికార పార్టీ మద్దతు లేకుండా ఎవరూ ఈ పని చేయలేరని అనుమానిస్తున్నారు. పక్కా సమాచారం సేకరించిన తర్వాత కొత్త మేయర్ సురేష్ ను ఇరకాటంలో పడేయడానికే ఈ పోస్టర్లు వేశారని అనిపిస్తోందని అంటున్నారు. దీంతో కడప కార్పొరేషన్ రాజకీయం మరెన్ని మలుపులు తిరుగుతుందోనని సందేహిస్తున్నారు.

ఇంటిపన్ను కట్టని వారు మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా చెబుతున్నారు. కొత్తమేయర్ పదేళ్లుగా ఇంటి పన్ను కట్టలేదని ప్లెక్సీల్లో ఆరోపించారు. దీంతో ఆయన కార్పొరేటర్ గా వేసిన నామినేషనే చెల్లుబాటు అవుతుందా? అనే సందేహం మొదలైంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఎన్నిక సవాల్ చేసి ఇబ్బంది పెట్టేంతంటి సమయం లేనందున, కొత్త మేయర్ నైతికతను ప్రశ్నించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రచారానికి దిగినట్లు భావిస్తున్నారు. కడప కార్పొరేషన్ కు 2021 మార్చిలో ఎన్నికలు జరిగాయి. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఎన్నికైన కొత్త మేయర్ పై ఫిర్యాదులు చేసి, ఆయనను పదవి నుంచి తొలగించడం కుదరే పని కాకపోవడంతోనే ఆయన రాజకీయ ప్రత్యర్థులు ప్లెక్సీలతో కలకలం సృష్టించారని అంటున్నారు.

కడప నగరంలో వైసీపీకి చాలా పట్టు ఉందనే ప్రచారం ఉంది. కానీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో కడప ఎమ్మెల్యేగా మాధవీరెడ్డి గెలిచిన తర్వాత బలాబలాల్లో స్పష్టమైన మార్పువచ్చింది. కార్పొరేషన్ లో మాధవీరెడ్డికి మెజార్టీ ఓట్లు పడటంతో ఎమ్మెల్యేగా సునాయాసంగా గెలిచారు. ఇక తర్వాత కార్పొరేషన్ పై పట్టుకోసం ఎమ్మెల్యే మాధవీరెడ్డి చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. అయితే నగరపాలక సంస్థలోని కార్పొరేటర్లు మొత్తం వైసీపీకి చెందిన వారే ఉండటంతో ఎమ్మెల్యే ఒంటరి పోరాటం చేయాల్సివస్తోంది. నగరంలో మొత్తం 50 డివిజన్లు ఉండగా, గత ఎన్నికల్లో టీడీపీ ఒకే డివిజన్ గెలుచుకుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల తరువాత దాదాపు ఏడుగురు కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. అయితే మాజీ మేయర్ సురేష్ ఎమ్మెల్యేకు కొరకరాని కొయ్యగా మారడంతో నిబంధనలను చూపి ఆయనపై ఎమ్మెల్యే అనర్హత వేటు వేయించారు. ఆ తర్వాత కార్పొరేషన్ ను చేజిక్కించుకోవాలని చూసినా కుదరలేదు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం వైసీపీకి చెందిన పాకా సురేష్ కొత్త మేయర్ గా ఎన్నికయ్యారు. ఈ పరిస్థితుల్లో వెలసిన పోస్టర్లు కాకరేపుతున్నాయి.