Begin typing your search above and press return to search.

కడప వైసీపీ మేయ‌ర్... కృష్ణా జిల్లా అల్లుడికి జ‌గ‌న్ గ్రీన్‌సిగ్న‌ల్‌... ?

కడప కార్పొరేషన్‌లో ఎలాగైనా విజయం సాధించి, తమ కంచుకోటను కాపాడుకోవాలని వైఎస్సార్‌సీపీ గట్టి పట్టుదలతో ఉంది.

By:  Garuda Media   |   30 Aug 2026 6:00 PM IST
కడప వైసీపీ మేయ‌ర్... కృష్ణా జిల్లా అల్లుడికి జ‌గ‌న్ గ్రీన్‌సిగ్న‌ల్‌... ?
X

కడప కార్పొరేషన్‌లో ఎలాగైనా విజయం సాధించి, తమ కంచుకోటను కాపాడుకోవాలని వైఎస్సార్‌సీపీ గట్టి పట్టుదలతో ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కడప మేయర్ పదవిపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఒకవేళ కడప మేయర్ స్థానం ఓసీ జనరల్‌కు కేటాయిస్తే, వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసేందుకు పలువురు ఆశావాహులు ఆసక్తి చూపుతున్నారు. వీరిలో వైఎస్సార్‌సీపీ డాక్టర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన డాక్టర్ గోసుల శివభారత్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

కడప నివాసి అయిన డాక్టర్ శివభారత్‌రెడ్డికి వైఎస్సార్ కుటుంబంతో దశాబ్దాల కాలంగా మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఆయన సతీమణి సీతారామలక్ష్మి కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దుట్టా రామచంద్రరావు కుమార్తె. వైఎస్ రాజశేఖరరెడ్డితో దుట్టా కుటుంబానికి సుదీర్ఘ అనుబంధం ఉంది. వైఎస్సార్‌, దుట్టా ఇద్ద‌రు క‌లిసి చ‌దువుకున్నారు. ఈ క్ర‌మంలోనే దుట్టాకు జ‌గ‌న్ 2014లో గ‌న్న‌వ‌రం అసెంబ్లీ టిక్కెట్ కూడా ఇచ్చారు. ఇక దుట్టా అల్లుడు శివభారత్‌రెడ్డి భార్య కాపు (బలిజ) సామాజిక వర్గానికి చెందినవారు. దీంతో కడప నగరంలో గణనీయంగా ఉన్న బలిజ సామాజిక వర్గ ఓటర్ల మద్దతు కూడా ఆయనకు లభించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. శివ‌భ‌ర‌త్ రెడ్డి భార్య ప్ర‌స్తుతం కృష్ణా జిల్లా ఉంగుటూరు వైసీపీ జ‌డ్పీటీసీగా ఉన్నారు.

ఇక శివ‌భ‌ర‌త్ రెడ్డికి వైఎస్ జగన్‌తో మంచి స్నేహం ఉండటం, వివాద రహితుడు, విద్యావంతుడు కావడం, స్థానికంగా ఆర్థికంగా స్థితిమంతుడు కావడం డాక్టర్ శివభారత్‌రెడ్డికి రాజకీయంగా పెద్ద కలిసివచ్చే అంశాలు ప్రస్తుతం ఆయన స్థానికంగా మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారని సమాచారం. కడప నగరంలో వైఎస్సార్‌సీపీ ప్రభావం గట్టిగా ఉన్నందున, సరైన అభ్యర్థిని రంగంలోకి దించితే గెలుపు సులువవుతుందని పార్టీ భావిస్తోంది.

రిజర్వేషన్ అనుకూలించడం, జగన్ ఆశీస్సులు ఎలాగూ ఉంటాయ‌న్న ధీమాతో శివభారత్‌రెడ్డి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కడప నగరంలోని డివిజన్ల విభజనపై ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. ఈ న్యాయపరమైన అంశాలు కొలిక్కి వచ్చిన తర్వాతే ఎన్నికల హ‌డావిడి మొద‌ల‌వుతుంది.