Begin typing your search above and press return to search.

కడప మేయర్ ఎన్నిక...జగన్ కి కొత్త సవాల్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో ఆ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మరో ఎన్నిక మారనుంది అదే కడప కార్పొరేషన్ మేయర్ ఎన్నిక.

By:  Satya P   |   8 Dec 2025 9:10 AM IST
కడప మేయర్ ఎన్నిక...జగన్ కి కొత్త సవాల్
X

వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో ఆ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మరో ఎన్నిక మారనుంది అదే కడప కార్పొరేషన్ మేయర్ ఎన్నిక. కడప మేయర్ ఎన్నిక కోసం ఎన్నికల సంఘం అయితే నోటిఫికేషన్ ని తాజాగా జారీ చేసింది. ఈ నెల 11న ముహూర్తంగా నిర్ణయించింది. ఆ రోజున జరిగే ప్రత్యేక సమావేశంలో కొత్త మేయర్ ఎన్నిక జరుగుతుంది అని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఇక అవినీతి ఆరోపణలు నేపథ్యంలో వైసీపీ తరఫున ఎన్నిక అయిన మేయర్ సురేష్ బాబుని తొలగించారు. దాంతో కొత్త మేయర్ ఎన్నిక అనివార్యంగా మారింది అని అంటున్నారు.

కేవలం అయిదు నెలలే :

కొత్త మేయర్ గా ఎవరు ఎన్నిక అయినా పదవీ కాలం కేవలం అయిదు నెలలు మాత్రమే ఉంది. అయినా సరే కడప గడపలో మేయర్ పీఠాన్ని దక్కించుకుని వైసీపీకి గట్టి ఝలక్ ఇవ్వాలని టీడీపీ రెడీ అవుతోంది అని అంటున్నారు. ఇక చూస్తే కనుక రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదితి సింగ్ కొత్త మేయర్ ఎన్నిక కోసం తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. దాంతో జగన్ సొంత ఇలాకాలో సరికొత్త రాజకీయ వేడి రాజుకుంది అని చెప్పాల్సి ఉంది.

బలాబలాలు చూస్తే :

ఇక కడప కార్పోరేషన్ లో బలాబలాలు చూస్తే కనుక మొత్తం 50 వార్డులకు గానూ వైసీపీకి 48, టీడీపీకి ఒకటి, జనసేనకు ఒకటి బలం ఉంది. అయితే ఎన్నికల తరువాత ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొందరు కార్పోరేటర్లు కూటమిలో చేరిపోయారు అని అంటున్నారు. దీంతో బలాలలో కొంత మార్పు వచ్చింది. సురేష్ బాబు ని దించేసి కూటమి తరఫున టీడీపీ మేయర్ ని గెలిపించుకోవాలి అంటే 26 మంది సభ్యుల బలం ఉండాలి. అయితే కడప చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ఎక్స్ అఫీషియో మెంబర్స్ తో పాటు వైసీపీ నుంచి వచ్చే కార్పోరేటర్ల మీద కూటమి ధీంగా ఉందని అంటున్నారు. ఏలాగైనా కడప మేయర్ పదవిని వైసీపీకి దక్కకుండా చేసి టీడీపీ గెలవాలని చూస్తోంది అని అంటున్నారు.

అనివార్యంగా ఎన్నిక :

ఇదిలా ఉంటే సురేష్ బాబుని మేయర్ గా తొలగించిన నేపధ్యంలో కడపలో అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా కొత్త మేయర్ ఎన్నిక అనివార్యం అని అంటున్నారు. ప్రస్తుతానికి చూస్తే సురేష్ బాబు స్థానంలో డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగంను తాత్కాలిక మేయర్‌గా నియమించారు.కానీ పూర్తి కాలం మేయర్ ఉంటేనే కడప నగరం అభివృద్ధి చెందుతుందనే ఈ ఎన్నికలు జరుపుతున్నారు.

సురేష్ బాబు పిటిషన్ :

తనను అకారణంగా మేయర్ పదవి నుంచి తొలగించారని పేర్కొంటూ ఎన్నికల నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ సురేష్ బాబు తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు అయన ఆయన దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై ఈ నెల 9న విచారణ జరగనుందని చెబుతున్నారు. దాంతో కోర్టు ఇచ్చే తీర్పు తర్వాతే మేయర్ ఎన్నికపై ఫుల్ క్లారిటీ వస్తుందని అంటున్నారు. కడప మేయర్ కి ఎన్నికలు కనుక జరిగితే మాత్రం అది తీవ్ర ఉత్కంఠను రేపే చాన్స్ అయితే ఉంది అని అంటున్నారు.