స్మశానంలో కూడా రిజర్వేషన్.. ఇదెక్కడి విడ్డూరం భయ్యా!
కనీ విని ఎరుగని రీతిలో ఏకంగా స్మశానంలో రిజర్వ్డ్ బోర్డులు కనిపించడంతో ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు.
By: Madhu Reddy | 29 Aug 2025 11:48 AM ISTబస్సు, రైలు, విమానం ఇలా తదితర వాహనాలలో మనం రిజర్వేషన్ చూస్తూ ఉంటాము. అంతేకాదు స్కూల్, కాలేజ్ అటు ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యపరిచే ఘటన చూసి అందరూ ఆశ్చర్యపోవడం అటు ఉంచితే.. ఇదెక్కడి విడ్డూరం అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. కనీ విని ఎరుగని రీతిలో ఏకంగా స్మశానంలో రిజర్వ్డ్ బోర్డులు కనిపించడంతో ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. స్మశానంలో రిజర్వ్డ్ బోర్డులు ఏంటి? ఎందుకు పెట్టారు? ఎవరి కోసం పెట్టారు? అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదండోయ్ ఇటీవల మహానటి కీర్తి సురేష్.. 'కలర్ ఫోటో' హీరో సుహాస్ జంటగా నటించిన 'ఉప్పుకప్పురంబు' సినిమాని కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఆ సినిమాలో పాతి పెట్టడానికి సమాధి లేక గొడవపడితే.. ఇక్కడ ముందుగానే సమాధి కోసం రిజర్వ్ చేసుకోవడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి.
అసలు విషయంలోకి వెళ్తే.. భర్త చనిపోతే భార్య.. భార్య చనిపోతే భర్త.. తమ వారి సమాధి నిర్మించి.. పక్కనే తమ సమాధికి అవసరమైన స్థలాన్ని ముందుగానే రిజర్వ్ చేసుకుంటున్నారు. బ్రతికున్నప్పుడే కాదు మరణాంతరం కూడా తమ భాగస్వామితో కలిసి ఉండాలని ఇలా చేస్తున్నారట అక్కడి ప్రజలు. ఇది ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాయలసీమ ప్రాంతమైన కడప రిమ్స్ సమీపంలోని క్రైస్తవుల సమాధి తోటలో ఇలా రిజర్వ్ చేసిన ప్రాంతాలలో బోర్డులు పాతారు. బ్రతికుండగానే చిన్న చిన్న విషయాలకే విడిపోతున్న జంటలను మనం ఎన్నో చూసాం. అలాంటి ఈ జనరేషన్లో కూడా ఇలాంటి అద్భుత భావన ఇక్కడ కనిపించడం ప్రత్యేకమే అని చెప్పవచ్చు.
పెళ్లి.. రెండు శరీరాలు ఒక్కటవ్వడం కాదు.. రెండు ఆత్మలు ఒక్కటి అవ్వాలి. అప్పుడే పెళ్లి అనే బంధానికి అసలైన రూపం ఏర్పడుతుంది. అలా పెళ్లి చేసుకుని జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటారు. కానీ మరణాంతరం ఎవరి దారి ఎటువైపో ఎవరికి తెలియని పరిస్థితి. అయితే ఇక్కడ మరణాంతరం కూడా కలిసే ఉండాలనే కాన్సెప్ట్ ను తీసుకురావడం నిజంగా ప్రశంసనీయమని పలువురు పెద్దలు కామెంట్లు చేస్తున్నారు. చిన్నాచితక విషయాలకే గొడవపడి విడాకులు తీసుకుంటున్న ఈ రోజుల్లో కూడా పెళ్లి బంధానికి విలువ ఇస్తూ మరణాంతరం కూడా భార్య భర్తలు కలిసి ఉండాలని తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా గొప్పదని చెప్పవచ్చు. మరి కనీసం ఇలాంటి ఘటనలనైనా దృష్టిలో పెట్టుకొని భార్యాభర్తలు గొడవ పడకుండా .. విడాకుల వరకు వెళ్లకుండా జీవితాంతం కష్టాలలో సుఖాలలో పాలుపంచుకుంటూ ముందుకు నడవాలి అని ప్రతి ఒక్కరు ఆకాంక్షిస్తున్నారు.
