ఏపీలో ఏకగ్రీవాల జోరు సరే.. ఉమ్మడి కడపలో సీన్ ఏంటి?
వైఎస్ జగన్మోహన్ సొంత నియోజకవర్గమైన పులివెందుల విషయానికి వస్తే.. ఇక్కడ మొత్తం 18 వార్డులు.. కడప కార్పొరేషన్లో 64 డివిజన్లు టీడీపీకి ఏకగ్రీవం కానున్నాయి.
By: Garuda Media | 20 Oct 2026 11:28 AM ISTఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు సాగుతోంది. ఐదేళ్ల క్రితం అప్పటి జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో మాదిరి భారీ ఎత్తున ఏకగ్రీవాలు నమోదు కాకున్నా.. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లోనూ ఏకగ్రీవాల జోరు సాగుతోంది. నగర కార్పొరేషన్లు.. మున్సిపాలిటీలు.. నగర పంచాయితీలకు జరుగుతున్న ఎన్నికల తొలి దశలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ సోమవారంతో ముగిసింది. నామినేషన్ల ఉప సంహరణకు రేపటి (బుధవారం) వరకు గడువు ఉంది. ఈ గడువు ముగిసిన తర్వాత ఏకగ్రీవాలు ఎన్ని అన్న దానిపై మరింత స్పష్టత రానుంది.
ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అధికారపక్షంగా ఉన్న కూటమి ఖాతాలో తొమ్మిది మున్సిపాలిటీలు.. మూడు నగర పంచాయితీలు చేరాయి. రాయచోటి, రాజంపేట, బద్వేలు, పుంగనూరు, పిడుగురాళ్ల, నగరి, దర్శి, గుత్తి, గురజాల మున్సిపల్ ఛైర్ పర్సన్ స్థానాలు కూటమికి ఏకగ్రీవం కానున్నాయి. జనసేన ఖాతాలో దర్శి పడింది. కనిగిరి.. ప్రొద్దుటూరు చైర్ పర్సన్ పదవులు టీడీపీకి ఏకగ్రీవం కానున్నాయి. వైసీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురి కావటమే దీనికి కారణం.
నగర పంచాయితీల విషయానికి వసతే.. కమలాపురం, ఎర్రగుంట్ల, దాచేపల్లి ఏకగ్రీవం కానున్నాయి. వీటిల్లో ఎర్రగుంట్ల బీజేపీ ఖాతాలో పడితే.. కమలాపురం, దాచేపల్లి టీడీపీ ఖాతాలో పడ్డాయి. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉండే ఉమ్మడి కడప జిల్లాలో తాజాగా జరుగుతున్న స్థానిక ఎన్నికలు జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అందునా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో ఆయన ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతోంది. ఉమ్మడి కడప జిల్లాలో కమలాపురం, ఎర్రగుంట్ల, రాజంపేట, రాయచోటి, బద్వేలు ఛైర్ పర్సన్ స్థానాలు కూటమికి ఏకగ్రీవం కానున్నాయి. ప్రొద్దుటూరులో వైసీపీ అభ్యర్థి నామినేషన్ రిజెక్టు అయ్యింది.
వైఎస్ జగన్మోహన్ సొంత నియోజకవర్గమైన పులివెందుల విషయానికి వస్తే.. ఇక్కడ మొత్తం 18 వార్డులు.. కడప కార్పొరేషన్లో 64 డివిజన్లు టీడీపీకి ఏకగ్రీవం కానున్నాయి. ఇంతకాలం పులివెందులలో జగన్ కుటుంబం చెప్పిందే వేదంగా సాగుతున్న పరిస్థితి. అందుకు భిన్నంగా తాజాగా మాత్రం జగన్ సొంతూరులోనూ గట్టి పోటీ ఎదుర్కొంటున్న పరిస్థితి. పులివెందుల మున్సిపాలిటీలో మొత్తం 40 వార్డులు ఉండగా.. 18 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం చేసుకుంది. మిగిలిన వార్డులకు.. ఛైర్ పర్సన్ పదవికి ఎన్నికలు జరగనున్నాయి.
కడప కార్పొరేషన్ లో మొత్తం 66 డివిజన్లకు రెండు డివిజన్లలో మాత్రమే వైసీపీ అభ్యర్థులు బరిలో ఉండటం గమనార్హం. ఇక్కడ మిగిలిన 64 డివిజన్ లు టీడీపీకి ఏకగ్రీవం కావటం.. వైసీపీకి.. జగన్ కుటుంబానికి ఎదురైన పెద్ద ఎదురుదెబ్బగా చెబుతున్నారు. ఎర్రగుంట్ల నగర పంచాయితీ ఛైర్ పర్సన్ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. అక్కడ ఆ పార్టీ అభ్యర్థి మధులత ఒక్కరే నామినేషన్ వేయటంతో.. ఆ స్థానం ఏకగ్రీవమైంది. కమలాపురం నగర పంచాయితీలో వైసీపీ నుంచి ఛైర్ పర్సన్.. కౌన్సిలర్ పదవుల ఎన్నికలకు వైసీపీకి చెందిన ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో.. ఛైర్ పర్సన్ పదవితో పాటు అన్ని వార్డులు టీడీపీకి ఏకగ్రీవం కానున్నాయి.
రాజంపేట మున్సిపాలిటీ విషయానికి వస్తే ఇక్కడ వైపీపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు వేళ.. సరైన పత్రాల్ని జత చేర్చకపోవటంతో నామినేషన్ ను రిజెక్టు చేశారు. దీంతో టీడీపీ అభ్యర్థి గాయత్రి ఛైర్ పర్సన్ పదవికి ఏకగ్రీవం కానున్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోనూ సరైన పత్రాలు దాఖలు చేయని కారణంగా వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి నామినేషన్ ను రిజెక్టు చేశారు. ఇక్కడ కూడా ఛైర్మన్ అభ్యర్థి ఏకగ్రీవంగా ప్రకటించనున్నారు. రాయచోటి మున్సిపాలిటీతో పాటు పుంగనూరు మున్సిపాలిటీ కూడా టీడీపీకి ఏకగ్రీవం కానున్నాయి.
పుంగనూరు ఏకగ్రీవం కావటంతో ఇంతకాలం పెద్దిరెడ్డి అధిక్యానికి తిరుగులేదన్న భావనకు చెక్ పడినట్లుగా చెప్పొచ్చు. చిత్తూరు జిల్లాలోని నగరి మున్సిపల్ ఛైర్మన్ పదవితో పాటు.. నాలుగో వార్డు టీడీపీకి ఏకగ్రీవం కానుంది.అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ ఛైర్మన్ పదవి కూడా టీడీపీ ఖాతాలో పడింది. ఇక్కడ వైసీపీ అభ్యర్థి బరిలో లేకపోవటంతో ఏకగ్రీవమైంది. ఇక.. కడప జిల్లా మైదకూరు మున్సిపాలిటీలో ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం తాత్కాలికంగా నిలిపేయటం తెలిసిందే.
