Begin typing your search above and press return to search.

కడపలో వైసీపీ రాజ్యం?.. ఎమ్మెల్యే మాధవీరెడ్డి స్పీడ్ కు బ్రేకులు!

కడప సీఐ రామక్రిష్ణ యాదవ్ ను వీఆర్ లోకి పంపుతూ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడం రాజకీయంగా దుమారం రేపుతోంది.

By:  Tupaki Political Desk   |   1 Oct 2025 12:29 PM IST
కడపలో వైసీపీ రాజ్యం?.. ఎమ్మెల్యే మాధవీరెడ్డి స్పీడ్ కు బ్రేకులు!
X

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సొంత జిల్లా కడపలో వైసీపీ రాజ్యమే నడుస్తుందా? రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలో ఉన్నప్పటికీ కడప జిల్లాలో వైసీపీ నేతల మాటే చెల్లుబాటు అవుతోందని టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రెడ్డప్పగారి మాధవీరెడ్డికి జరుగుతున్న అవమానాలు టీడీపీ కేడర్ కు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. ఆగస్టు 15న ఎమ్మెల్యే మాధవీరెడ్డిని వేదికపైకి ఆహ్వానించకపోవడం, తాజాగా ఆమెను సోషల్ మీడియాలో దూషించిన వారిపై కేసు నమోదు చేసిన సీఐ రామక్రిష్ణ యాదవ్ ను వీఆర్ లోకి పంపడం చూస్తే కడప జిల్లాలో అధికార పార్టీకి ప్రతికూలంగా విపక్షానికి అనుకూలంగా అధికారులు పనిచేస్తున్నట్లు కనిపిస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

కడప సీఐ రామక్రిష్ణ యాదవ్ ను వీఆర్ లోకి పంపుతూ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై సీఐ కేసు నమోదు చేసిన గంటల వ్యవధిలోనే ఆయనను వీఆర్ లోకి పంపుతున్నట్లు అధికారులు ప్రకటించడం టీడీపీ నేతలను విస్మయానికి గురిచేస్తోంది. కడప పోలీసు అధికారులు విపక్షానికి అనుకూలంగా పనిచేస్తున్నారా? అంటూ టీడీపీ అనుకూల మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి. ఎమ్మెల్యే మాధవీ రెడ్డి ఫిర్యాదు మేరకు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అంజాద్ బాషా, ఆయన సోదరుడు అహ్మద్ బాషాను నిందితులుగా చేర్చడం వల్లే సీఐని వీఆర్ కి పంపినట్లు కథనాలు వస్తున్నాయి.

కాగా, సీఐ రామక్రిష్ణ యాదవ్ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకే చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ సచికేత్ విశ్వనాథ్ వివరణ ఇస్తున్నారు. అయితే మాధవిరెడ్డి ఫిర్యాదు ప్రకారం వైసీపీ నేత అంజాద్ బాషా పీఏ ఖాజాను మాత్రమే నిందితుడిగా చేర్చాలని పోలీసు ఉన్నతాధికారులు సూచించారని, కానీ ఎమ్మెల్యే ఫిర్యాదులో మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ఆయన సోదరుడు అహ్మద్ బాషా పేర్లు కూడా ఉండటంతో సీఐ వారిద్దరిని నిందితులుగా చేర్చారని అంటున్నారు. అయితే తమ సూచనలు బేఖాతరు చేస్తూ సీఐ వైసీపీ నేతలను నిందితులుగా పేర్కొనడంతో సీఐని వీఆర్ లోకి పంపినట్లు టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

ఈ మొత్తం పరిణామాలను పోలీసు క్రమశిక్షణగా ఆ శాఖ వర్గాలు చెబుతున్నా, టీడీపీ శ్రేణులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు కావస్తున్నా, కడపలో ఎమ్మెల్యే మాధవీరెడ్డి మాట చెల్లుబాటు కావడం లేదని ఆరోపిస్తున్నాయి. దీనికి ఆ పార్టీ నేతలు అనేక ఉదాహరణలు చూపుతున్నారు. తొలుత కడప కార్పొరేషన్ లో ఎమ్మెల్యేకు కుర్చీవేయకపోవడం, ఆగస్టు 15 ఉత్సవాల్లో ఎమ్మెల్యేకి తగిన గౌరవం ఇవ్వకపోవడం, ఇప్పుడు ఎమ్మెల్యేను దూషిస్తున్న వారిపై ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసిన సీఐని విధుల నుంచి తప్పించడం చూస్తుంటే ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పరిస్థితులు ఉన్నట్లు చూపుతున్నారు. అయితే సీఐపై పోలీసు శాఖ తీసుకున్న చర్యలపై ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఇంతవరకు స్పందించలేదు. అసలే ఫైర్ బ్రాండ్ అయిన మాధవీరెడ్డి ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవుతారనేది ఉత్కంఠ రేపుతోంది.