పాపం.. 'పాల్' బాధను ఎవరైనా పట్టించుకోండయ్యా..?
ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా.. "నేనొచ్చి మాట్లాడితే శాంతి నెలకొంటుంది" అంటూ దూసుకెళ్లే గ్లోబల్ పీస్ మేకర్, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ గారికి ఇప్పుడు సొంత పాస్‌పోర్ట్ రూపంలో ఓ పెద్ద ‘యుద్ధం’ వచ్చిపడింది.
By: A.N.Kumar | 1 Oct 2026 3:39 PM ISTప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా.. "నేనొచ్చి మాట్లాడితే శాంతి నెలకొంటుంది" అంటూ దూసుకెళ్లే గ్లోబల్ పీస్ మేకర్, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ గారికి ఇప్పుడు సొంత పాస్‌పోర్ట్ రూపంలో ఓ పెద్ద ‘యుద్ధం’ వచ్చిపడింది. అమెరికాలో ల్యాండ్ అయిన ఆయన.. అక్కడ భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) ముందు నిలబడి తన ఆవేదననంతటినీ బయటపెట్టారు. గత మూడు నెలలుగా తన పాస్‌పోర్ట్ రెన్యూవల్ చేయకుండా అధికారులు నానా తిప్పలు పెడుతున్నారంటూ వాషింగ్టన్‌లోని ఎంబసీ ముందు ‘శాంతియుత’ గళమెత్తారు.
అసలే ప్రపంచ దేశాల సమస్యలను చిటికెలో పరిష్కరించే మహానేతకు, మన ఎంబసీ అధికారులు మూడ నెలలుగా పాస్‌పోర్ట్ ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెట్టడం ఏంటని ఆయన అభిమానులు, సోషల్ మీడియా జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ ఆలస్యం వెనుక ఏదో పెద్ద రాజకీయం ఉందనేది పాల్ గారి అనుమానం. ఊరికే ఉంటారా? వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పేర్లను నేరుగా ప్రస్తావిస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. "నేను నోరు తెరిస్తే మీకు అనవసర ఇబ్బందులు ఎదురవుతాయి. నా పాస్‌పోర్ట్ రెన్యూవల్ చేయొద్దని మీరేమైనా చెప్పారా? లేక విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారా? నేను భారత్‌కు వస్తాననే భయంతోనే ఇదంతా చేస్తున్నారా?" అంటూ పాల్ గారు వేసిన ప్రశ్నలకు ప్రస్తుతం సోషల్ మీడియాలో మీమ్స్, కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. "అబ్బో.. పాల్ గారు భారత్ వస్తే పొలిటికల్ ఈక్వేషన్లు మారిపోతాయనే భయంతోనే కేంద్రం ఇలా చేస్తోందేమో!" అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
ఏది ఏమైనా ప్రపంచ శాంతి కోసం తిరిగే నేతకు ఈ పాస్‌పోర్ట్ తిప్పలేంటో ఫాఫం.. అధికారులు సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం చేస్తున్నారా లేక నిజంగానే కేంద్ర పెద్దల ఆదేశాలు ఉన్నాయా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితేనేం అమెరికా ఎంబసీ ముందు నిలబడి పాల్ గారు చేసిన ఈ ‘హల్ చల్’ వీడియోలు మాత్రం ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
కేఏ పాల్ గారి ఈ సుదీర్ఘ పోరాటానికి ఎంబసీ అధికారులు త్వరలోనే తెరదించి ఆయన పాస్‌పోర్ట్ ఆయనకు ఇస్తే బాగుణ్ణు.. లేకపోతే ఆయన మరో "విశ్వశాంతి" ప్రయోగానికి తెరదీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
