Begin typing your search above and press return to search.

'కొండా'కు కేఏ పాల్ బంపర్ ఆఫర్ !

‘కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుల పదవులకు ఎలాంటి ఢోకా ఉండదు. కానీ బీసీ నాయకుల పదవులకు మాత్రం ప్రమాదం.

By:  Garuda Media   |   3 Sept 2026 1:34 PM IST
కొండాకు కేఏ పాల్ బంపర్ ఆఫర్ !
X

‘కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుల పదవులకు ఎలాంటి ఢోకా ఉండదు. కానీ బీసీ నాయకుల పదవులకు మాత్రం ప్రమాదం. మీరు ఏ పార్టీలోకి వెళ్లకండి. మీకు ప్రజాశాంతి పార్టీ ఉంది. బడుగు, బలహీనవర్గాలకు న్యాయం జరగాలంటే ప్రజాశాంతి పార్టీ ఒక్కటే మార్గం’ అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మంత్రి కొండా సురేఖను ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆహ్వానించారు.

హస్తినలో గత మూడు రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో మంత్రి పదవికి రాజీనామా చేయాలని, లేకుంటే గవర్నర్ కు సిఫారసు చేసి మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాల్సి వస్తుందని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొండా సురేఖకు ఆదేశాలు ఇచ్చారన్న నేపథ్యంలో సురేఖ రాజీనామా చేస్తారా ? లేక బర్తరఫ్ వరకు ఎదురు చూస్తారా ? అన్న ఉత్కంఠ నేపథ్యంలో కేఏ పాల్ తన ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానం పలకడం గమనార్హం.

కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీని 2008లో స్థాపించారు. అప్పటి నుండి ఆ పార్టీ పోటీ చేసిన ఏ ఎన్నికల్లోనూ ప్రభావం చూపలేదు. స్వయంగా కేఏపాల్ 2022 మునుగోడు ఎన్నికల్లో పోటీ చేసి 805 ఓట్లు మాత్రమే సాధించి డిపాజిట్ కోల్పోయాడు. ఆయన వివిధ సంధర్భాలలో తన పార్టీలో చేరమని పలువురు ప్రముఖులు, పదవీ విరమణ చేసిన ఉన్నత ఉద్యోగులను ఆహ్వానించడం జరుగుతుంటుంది.

బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన కవితను తన పార్టీలో చేరాలని గతంలో కేఎ పాల్ ఆహ్వానించాడు. బీసీల కోసం పోరాడుతానని చెబుతున్న కవిత తన పార్టీలో చేరితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్ ఇచ్చి పోటీకి దింపుతానని కూడా అఫర్ చేయడం గమనార్హం. కవిత బీజేపీ పంపిన బాణం కాదు అని నిరూపించుకోవాలంటే తన పార్టీలో చేరాలని వ్యాఖ్యానించారు.

ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు 2018, 2019, 2023లలో ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆహ్వానించాడు. ప్రజాశాంతి పార్టీతో జనసేన పొత్తు పెట్టుకోవాలని, లేదు పవన్ కళ్యాణ్ తన పార్టీలో చేరుతాను అంటే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తానని కేఎ పాల్ అఫర్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నిధులు కూడా తెస్తానని అన్నాడు.

దివంగత ప్రజా యుద్దనౌక గద్దర్ 2022లో ప్రజాశాంతి పార్టీలో చేరడం విశేషం. ఆ తర్వాత మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని గద్దర్ ను కోరగా ఆయన పోటీ చేయలేదు. ఆ తర్వాత విభేదాలతో ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. 2023 అక్టోబరులో పటాన్ చెరు నుండి పోటీీ చేసిన నీలం మధును కూడా పార్టీలోకి ఆహ్వానించారు. కేఏ పాల్ పిలుపు మేరకు ఏపీలో అదనపు ఎస్పీగా పోటీ చేసిన దియోఫిలస్ మాంటీ, అంతర్జాతీయ వ్యాపారవేత్త వెంకటేష్ ప్రజాశాంతి పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.