Begin typing your search above and press return to search.

టీడీపీ సీనియర్ ఫ్యామిలీకి రెండు టికెట్లు కన్ఫర్మ్ ట ?

టీడీపీలో ఒక విధంగా చూస్తే సంస్కరణల పర్వం కొనసాగుతోంది. పాత నీరు నెమ్మదిగా పోతోంది. కొత్త నీరు వస్తోంది.

By:  Satya P   |   7 July 2026 9:20 AM IST
టీడీపీ సీనియర్ ఫ్యామిలీకి రెండు టికెట్లు కన్ఫర్మ్ ట ?
X

టీడీపీలో ఒక విధంగా చూస్తే సంస్కరణల పర్వం కొనసాగుతోంది. పాత నీరు నెమ్మదిగా పోతోంది. కొత్త నీరు వస్తోంది. ఈ పరిణామం 2024లోనే మొదలైంది. ఎమ్మెల్యేలు చాలా మంది కొత్త వారు వచ్చారు. అలాగే మంత్రులలో కూడా ఎక్కువ మంది కొత్త వారే చాన్స్ అందుకున్నారు. ఇక 2029లో అయితే నూటికి తొంబై శాతం పైగా అంతా కొత్త రక్తం టీడీపీలో కనిపిస్తుంది అని అంటున్నారు. పార్టీ ఎమ్మెల్యే టికెట్లు కానీ ఎంపీ టికెట్లు కానీ యువతకు జూనియర్లకు ఇచ్చేందుకు కూడా ఒక ప్రణాళిక సిద్ధం అవుతోంది అని ప్రచారం సాగుతోంది. దాంతో చాలా మంది సీనియర్లు తాము పక్కకు తప్పుకుని తమ వారసులకు అయినా టికెట్లు దక్కించుకోవాలని చూస్తున్నారు. ఈ నేపధ్యంలో గోదావరి జిల్లాలకు చెందిన ఒక టీడీపీ పెద్దాయన అయితే తమ కుటుంబానికి 2029 ఎన్నికల్లో రెండు టికెట్లు ఖాయమని స్పష్టంగా చెప్పేశారు.

పోటీ చేయడమే ఇక :

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన సీనియర్ నాయకుడు జ్యోతుల నెహ్రూ తాజాగా ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను ప్రస్తావించారు. తాను టీడీపీ నుంచి ప్రజారాజ్యంలోకి ఎలా చేరాను అలాగే వైసీపీలోకి ఎలా వెళ్లాల్సి వచ్చింది ఈ విషయాలు అన్నీ ఆయన చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో టీడీపీ అంటే తనకు ఇష్టమని కొన్ని కారణాల వల్లనే వేరే పార్టీలలోకి వెళ్ళాల్సి వచ్చింది అని అన్నారు. అయినా తాను అక్కడ ఎక్కువ కాలం లేనని టీడీపీతోనే తాను ఉండాలనుకుని వెనక్కి వచ్చేశాను అన్నారు. ఇక తమ కుటుంబ రాజకీయం 2029 ఎన్నికల గురించి జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తాను జగ్గంపేట నుంచి మరోసారి పోటీ చేసి తీరుతాను అన్నారు. అదే సమయంలో తన కుమారుడు కాకినాడ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ నవీన్ బాబు 2029లో టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అని స్పష్టంగా చెప్పారు.

జిల్లాలో ఎక్కడైనా :

తన కుమారుడు నవీన్ బాబు జిల్లాలో ఎక్కడ సీటు ఇచ్చినా పోటీ చేసి గెలుస్తాడు అని జ్యోతుల నెహ్రూ చెప్పారు. ఇక తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అన్నారు. ఎంపీగా పోటీ చేసేది ఉండదని అన్నారు. గతంలో చంద్రబాబు ఎంపీగా పోటీ చేయమని కోరినా తాను వద్దు అని సున్నితంగా తిరస్కరించాను అని గుర్తు చేశారు. ఇక తనకు తన కుమారుడికి రెండు టికెట్లు కచ్చితంగా పార్టీ ఇస్తుంది అని ధీమాను ఆయన వ్యక్తం చేశారు అదే సమయంలో ఆయన చిరకాల కోరిక మంత్రి పదవి ప్రస్తావన కూడా వచ్చింది. వైసీపీలో కొనసాగి ఉంటే 2019లో మంత్రి అయి ఉండేవాడిని అన్నారు. అయితే జగన్ విధానాలు నచ్చకే పార్టీ నుంచి బయటకు వచ్చేశాను అన్నారు.

మంత్రి కావాలనేనా :

ఇక జ్యోతుల నెహ్రూ 2029లో పోటీ అంటే మంత్రి కావాలనే పోటీ చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. ఇప్పటికి అనేక సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. ప్రజారాజ్యం వైసీపీలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. అయినా సరే మంత్రి కాలేకపోయారు. ఇక 2024లో ఆయన మంచి మెజారిటీతో గెలిచినా కాకినాడ జిల్లా నుంచి పవన్ ఉప ముఖ్యమంత్రిగా ఉండడంతో సామాజిక ప్రాంతీయ సమీకరణల వల్ల చాన్స్ రాలేదు. దాంతో తన జీవిత కాల కోరిక అయిన మంత్రిగా చేయాలన్నది 2029లో అయినా నెరవేర్చుకోవాలని జ్యోతుల నెహ్రూ చూస్తున్నారు అని అంటున్నారు. అయితే టీడీపీ ఒకే కుటుంబానికి ఒకే టికెట్ విధానాన్ని అమలు చేస్తోంది. పైగా సీనియర్లను పక్కన పెడుతోంది. మరి జ్యోతుల కుటుంబంలో నవీన్ బాబుకు టికెట్ దక్కవచ్చు అని అంటున్నారు. జ్యోతుల నెహ్రూకి కూడా టికెట్ ఇస్తారా అలా ఒకే ఫ్యామిలీకి ఇస్తే మిగిలిన చోట్ల డిమాండ్లు రావా అన్న చర్చ ఉంది. కానీ ఈ ఇంటర్వ్యూలో నెహ్రూ బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. తమకు ఆ హామీ ఉందని. సో 2029లో జ్యోతుల ఫ్యామిలీ నుంచి తండ్రీ కొడుకూ పోటీలో ఉంటారు అన్న మాట.