Begin typing your search above and press return to search.

దీపాల కింద కూర్చుని చదువుకున్నా..సీజేఐ కన్నీటి కథ

జస్టిస్‌ సూర్యకాంత్‌ 1962 ఫిబ్రవరి 10న హరియాణా రాష్ట్రం, హిస్సార్‌ జిల్లాలో జన్మించారు. 1981లో పట్టభద్రులైన ఆయన, అనంతరం 1984లో రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్‌ విశ్వవిద్యాలయం (ఎండీయూ) నుంచి న్యాయశాస్త్ర డిగ్రీ పూర్తి చేశారు.

By:  A.N.Kumar   |   24 Nov 2025 11:00 PM IST
దీపాల కింద కూర్చుని చదువుకున్నా..సీజేఐ కన్నీటి కథ
X

భారత న్యాయవ్యవస్థలో మరో ముఖ్య ఘట్టం నమోదైంది. దేశంలోని అత్యున్నత న్యాయస్థానానికి 53వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన ఈ అత్యున్నత పదవిలో కొనసాగనున్నారు. ముఖ్యంగా, సుప్రీంకోర్టు సీజేఐ హోదాను చేపట్టబోయే తొలి హరియాణా వాసిగా జస్టిస్‌ సూర్యకాంత్‌ చరిత్రలో నిలిచే రికార్డు సృష్టించబోతున్నారు.

ఇప్పటి వరకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ బి.ఆర్‌. గవాయ్‌ పదవీ కాలం ఆదివారంతో ముగియడంతో ఆయన స్థానాన్ని భర్తీ చేస్తూ జస్టిస్‌ సూర్యకాంత్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.

చీకటి నుంచి వెలుగు వైపు: జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రయాణం

ఒక చిన్న గ్రామంలో పుట్టి, కనీస వసతులు లేని పరిస్థితుల నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానం పీఠం వరకు జస్టిస్ సూర్యకాంత్ ప్రయాణం ఎందరికో ఆదర్శప్రాయం. "మా ఊరికి విద్యుత్ సరఫరా సరిగ్గా ఉండేది కాదు. దీపాల కింద కూర్చుని చదువుకున్నా. సీజేఐ అవుతానని ఓ చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన తాను ఎప్పుడూ అనుకోలేదు. అప్పట్లో న్యాయవ్యవస్థ అంటే ఏంటో కూడా తెలియదు," అని ఆయన ఓ ఇంటర్వ్యూలో తన బాల్యాన్ని గుర్తుచేసుకున్నారు.

జస్టిస్‌ సూర్యకాంత్‌ 1962 ఫిబ్రవరి 10న హరియాణా రాష్ట్రం, హిస్సార్‌ జిల్లాలో జన్మించారు. 1981లో పట్టభద్రులైన ఆయన, అనంతరం 1984లో రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్‌ విశ్వవిద్యాలయం (ఎండీయూ) నుంచి న్యాయశాస్త్ర డిగ్రీ పూర్తి చేశారు. అదే సంవత్సరం హిస్సార్‌ జిల్లా కోర్టులో న్యాయవాదిగా తన వృత్తి ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1985లో పంజాబ్–హరియాణా హైకోర్టులో చేరి కీలక కేసులను వాదించారు. 2001లో సీనియర్‌ అడ్వొకేట్‌ హోదా పొంది, 2004 జనవరి 9న పంజాబ్–హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుదీర్ఘ అనుభవం తర్వాత, 2019 మే 24న ఆయన సుప్రీంకోర్టుకు ఎలివేట్‌ అయ్యారు. న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు సీనియర్లు ఎంతో సాయం చేశారని, హైకోర్టుకెళ్లాక 5-6 ఏళ్లలోనే విజయవంతమైన లాయర్‌గా పేరు తెచ్చుకున్నానని ఆయన చెప్పారు.

కీలక తీర్పుల్లో భాగస్వామ్యం

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రెండు దశాబ్దాల వృత్తి జీవితంలో జస్టిస్‌ సూర్యకాంత్‌ పలు కీలక డివిజన్‌ బెంచ్‌లలో, రాజ్యాంగ బెంచ్‌లలో భాగమయ్యారు. ఆయన కీలక తీర్పుల్లో భాగస్వామిగా నిలిచిన కొన్ని ముఖ్యమైన కేసులు చూస్తే.. ఆర్టికల్‌ 370 రద్దు, బిహార్‌ ఓటర్ల జాబితా సవరణ కేసు, పెగాసస్‌ వివాదంపై దర్యాప్తు పర్యవేక్షణ,

పౌర హక్కులు, పరిపాలన సంస్కరణలపై ప్రముఖ తీర్పులు, న్యాయపరమైన స్పష్టత, రాజ్యాంగ విలువలపై దృఢ నిబద్ధతకు ఆయన పేరుగాంచారు.

అంతర్జాతీయ అతిథుల హాజరు

సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అంతర్జాతీయ ప్రతినిధులు భారీ సంఖ్య హాజరయ్యారు.. నేపాల్‌, భూటాన్‌, శ్రీలంక, మారిషస్‌, కెన్యా, మలేసియా తదితర దేశాల నుంచి దాదాపు 15 మంది ప్రతినిధుల బృందాలు, వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యాయి.

జస్టిస్‌ సూర్యకాంత్‌ బాధ్యతలు స్వీకరించడం ద్వారా భారత న్యాయవ్యవస్థకు కొత్త దిశ నిర్దేశం కానుంది. హరియాణా నుంచి తొలిసారిగా సీజేఐ పదవి చేపట్టబోయే ఆయన నాయకత్వం, భవిష్యత్‌ న్యాయసంస్కరణలకు ప్రాధాన్యతనివ్వనుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.