అందరి వాడిని...అందరికీ మిత్రుడిని !
ప్రతీ వారితో చాలా చక్కని మిత్ర బంధం ఉందని కూడా చెప్పారు. ఇంతకీ ఎవరాయన అంటే ఇండియా కూటమి తరఫున ఉప రాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్న జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి.
By: Satya P | 20 Aug 2025 5:00 PM ISTఒక్క మాటలో ఆయన తేల్చేశారు. తాను అందరి వాడిని అని ఆయన స్పష్టంగా చెప్పేశారు తనకు అందరూ స్నేహితులే అని కూడా అన్నారు. తనకు రాజకీయ వాసనలు లేవని కానీ రాజకీయ పార్టీల నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. తాను ప్రతీ ఒక్కరికీ తెలుసు అని అలాగే అన్ని పార్టీలలోని కీలక నేతలు తనకూ తెలుసు అన్నారు. ప్రతీ వారితో చాలా చక్కని మిత్ర బంధం ఉందని కూడా చెప్పారు. ఇంతకీ ఎవరాయన అంటే ఇండియా కూటమి తరఫున ఉప రాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్న జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి.
మాట పక్కా..మనిషి పక్కా :
ఆయన మాట పక్కాగా ఉంది. మనిషి కూడా పక్కాగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పే నైజం. ముక్కుసూటితనం ఆయన లక్షణం. అందరితో మంచి సంబంధాలు ఉన్నాయీ అంటే ఆయన ఎంతటి స్నేహశీలి అన్నది తెలుస్తూనే ఉంది. ఇక ఆయనది న్యాయ రంగంలో సుదీర్ఘమైన ప్రస్థానం ఉంది. అందుకే ఆయనకు ఎందరితోనో ప్రత్యక్షంగా పరోక్షంగా పరిచయాలు ఉన్నాయి. నిలువెత్తు నిజాయతీకి రూపంగా ఉన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడినపుడు ఉప రాష్ట్రపతి ఎన్నికల మీద ఆయనకు ఉన్న ఆలోచనలు అవగాహన విషయ పరిశీలన అన్నీ అందరికీ పూర్తిగా అర్ధం అయ్యాయి.
నంబర్ గేమ్ కాదు ఇది :
ఈ మాట ఎంత చక్కగానో ఆయన చెప్పారనిపించింది. అవును ఇది విజ్ఞుల ఎన్నిక. ఒక రాజ్యాంగబద్ధమైన పదవికి జరిగే ఎన్నిక. ఉప రాష్ట్రపతి. దేశంలోనే రెండవ అతి పెద్ద రాజ్యాంగ పదవి. అందుకే దీనిని ఆయన నంబర్ గేమ్ తో అసలు చూడడం లేదు ఆ మాటను కూడా ఆయన అంగీకరించడం లేదు కూటములు వాటికి ఉన్న ఓట్లు, సంఖ్య ఇవన్నీ కాదని జస్టిస్ సుదర్శన్ రెడ్డి అంటున్నారు. ఉప రాష్ట్రపతిని ఎంపీలు ఎన్నుకుంటారు అని ఆయన అన్న్నారు. అందువల్ల ఎంపీలే విజ్ఞతతో ఆలోచించి ఓటు చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కూటముల మధ్య పోటీ కాదు:
అందరూ అనుకుంటున్నట్లుగా ఇది కూటముల మధ్య పోటీ కానే కాదని సుదర్శన్ రెడ్డి తేల్చేశారు. వీరికి ఇంత మంది వారికి ఇంత మంది అన్న చర్చ అనవసరం అన్నారు. పార్లమెంట్ సభ్యులే ఓటర్లు కాబట్టి వారే విజేతను నిర్ణయిస్తారు అని ఆయన చెప్పుకొచ్చారు. వారే తగిన నిర్ణయం తీసుకుని వారే తన అభ్యర్ధిత్వానికి విజయం చేకూరుస్తారని ఆయన అన్నారు.
అభ్యర్ధిత్వం అలా ఖరారు :
ఇక తన ఉప రాష్ట్రపతి అభ్యర్ధిత్వం ఖరారు మీద జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఉప రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గె తనకు ఫోన్ చేశారని కోరారని చెప్పారు. అలా ప్రతిపాదన తన వద్దకు వచ్చిందని అన్నారు ఆ మీదట తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి సహా ఇతర నేతలు తనను కలిశారు అని ఆయన వివరించారు. అంతా కలసి చర్చించిన తరువాతనే తన అభ్యర్థిత్వం ఖరారు అయింది అని తెర వెనక జరిగిన సంగతులను ఆయన ఆసక్తికరంగా వివరించారు. ఇండియా కూటమి అభ్యర్ధిగా తనను ఎన్నుకున్నందుకు ఆయన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియచేశారు.
టీడీపీ వైసీపీ బీఆర్ఎస్ ఓకే :
తెలుగుదేశంతో మంచి సంబంధాలు ఉన్నాయి. వైసీపీలో కూడా మంచి పరిచయస్తులు ఉన్నారని ఆయన అన్నారు. అంతే కాదు బీఆర్ ఎస్ తోనూ తనకు తెలిసిన వారు చాలా మంది ఉన్నారని సుదర్శన్ రెడ్డి వివరించారు. ఇవాళా నాకు నేనుగా కొత్తగా వారికి చెప్పాల్సింది లేదని అన్నారు. వారు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటారనే భావిస్తున్నాను అని సుదర్శన్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుభవం కలిగిన నాయకుడని ఆయన అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని చెప్పారు.
అవసరం అయితే అన్ని రాష్ట్రాల్లో ఉన్న పార్లమెంట్ సభ్యులను కలుస్తాను అని ఆయన చెప్పారు. తనకు ఎవరితోనూ పేచీ పూచీ లేదని ఏ ఇబ్బందీ లేదని కూడా చాలా ఓపెన్ మైండ్ తోనే సుదర్శన్ రెడ్డి చెప్పారు. మొత్తం మీద చూస్తే ఆయన మాట తీరు కానీ ఆలోచనా విధానం కానీ ఆయన ఓపెన్ గా వ్యవహరించే తీరు కానీ ఆ అత్యున్నత పదవికి సరిగ్గా సరిపోతాయని అంతా అంటున్నారు. రెడ్డి గారు బ్రహ్మాండమైన అభ్యర్ధి అన్నది పలువురి మాటగా ఉంది.
