Begin typing your search above and press return to search.

తెలుగు గర్వం గౌరవం జస్టిస్ సుదర్శన్ రెడ్డి

ఈ రోజున దేశంలో ఒక పెద్ద చర్చ సాగుతోంది. రాజ్యాంగ పరిరక్షణ కోసం చాలా గొంతులు వినిపిస్తున్నాయి.

By:  Satya P   |   20 Aug 2025 11:40 AM IST
తెలుగు గర్వం గౌరవం జస్టిస్ సుదర్శన్ రెడ్డి
X

ఆయన నిలువెత్తు న్యాయం. ఆయన నిబద్ధతకు మారు రూపం. ఆయన గొంతు సమానత్వం అంటుంది. ఆయన చూపు సమ న్యాయం సామాజిక న్యాయం వైపు ఉంటుంది. ఇంతకీ ఆయన ఎవరో కాదు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. అచ్చ తెలుగు బిడ్డ. తెలుగు జాతికి ఆయనే ఒక గౌరవం. సిసలైన న్యాయానికి అసలైన దర్పణం. దేశంలోని అత్యున్నత రెండవ రాజ్యాంగ పదవికి అనూహ్యంగా ఆయన అభ్యర్థి అయ్యారు. దేశంలో రెండు కూటముల మధ్య ఢీ కొడుతున్న రాజకీయం రాజ్యాంగ పదవి వైపు సైతం సాగుతున్న వేళ ఈ సమున్నత పదవికి రాజ్యాంగ నీతి కోవిదుడు, న్యాయ స్రష్ట అయిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్ధిత్వం ఒక మంచి ఎంపిక. ఒక మేలు మలుపుగా అంతా భావిస్తున్నారు.

రాజకీయ వాసనలు లేని వైనం :

ఆయన ఏ పార్టీకి చెందిన వారు కాదు, రాజకీయ వాసనలు అంతకంటే అంటని వారు. ఆయన గురించి నిఖార్సుగా చెప్పాలీ అంటే ప్రజల పక్షం. పేదల పక్షం, బడుగుల పక్షం. ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎన్నో తీర్పులు ఇచ్చారు. వాటిని చూసిన వారికి అర్ధమయ్యేది ఏమిటి అంటే ఆయన న్యాయం పక్షం అని. ఆయన ఎన్నో విలక్షణమైన తీర్పులు ఇచ్చారు. అవి సంచలనం రేపాయి. ప్రజాస్వామ్య పరులలో ఆలోచనలు రేకెత్తించాయి. మేధావులలో చర్చలకు తావిచ్చాయి.

సరైన సమయంలో ధీటైన అభ్యర్ధి :

ఈ రోజున దేశంలో ఒక పెద్ద చర్చ సాగుతోంది. రాజ్యాంగ పరిరక్షణ కోసం చాలా గొంతులు వినిపిస్తున్నాయి. ఉన్నత స్థానాలలో మరింత సమున్నతమైన తీరున వ్యవస్థలు సాగాలని సకల జనం అభిలషిస్తున్నారు. అవసరమైతే మరింత మార్పులు చేర్పులు కూడా చేయాలని తపిస్తున్నారు. ఈ కీలక సమయంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉప రాష్ట్రపతి పదవికి అభ్యర్ధిగా ముందుకు రావడం అంటే నిజంగా గొప్ప విషయమే. ఒక విధంగా అరుదైన అవకాశమే అని చెప్పాలని అంటున్నారు.

ఉప రాష్ట్రపతి స్థానం రాజ్యాంగబద్ధమైన పదవి :

అవును ఉప రాష్ట్రపతి పదవి రాజకీయ పదవి కాదు, రాజ్యాంగబద్ధమైన పదవి ఈ పదవికి ఇండియా కూటమి పోటీగా నిలిపిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్ని విధాలుగా సరైన అభ్యర్ధి అని అంతా అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ పదవికి ఇండియా కూటమి అభ్యర్ధిగా ఎంపిక తరువాత సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన భావాలను పంచుకున్నారు. అత్యున్నతమైన రాజ్యాంగబద్ధమైన ప్దవి విషయంలో జరుగుతున్న ఎన్నికల్లో దేశంలోని అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు సరైన నిర్ణయం తీసుకుంటారనుకుంటున్నానని చెప్పారు. ఈ ఉన్నత పదవికి సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని ఎంపీలను కోరుతున్నానని ఆయన చెప్పారు.

సమానత్వం స్వేచ్చ కోసం :

ఈ సందర్భంగా ఆయన మరిన్ని విషయాలు తన గురించి మీడియా ముఖంగా పంచుకున్నారు. ఇది రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న పోరు కాదు అని స్పష్టం చేశారు. అంతే కాదు తనకు ఎలాంటి భావజాలం లేదని స్పష్టత ఇచ్చారు. ఇక తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు అని తేల్చి చెప్పారు. ఇక తనకు సమానత్వం స్వేచ్ఛ పై పూర్తి అవగాహన ఉంది అని ఆయన పేర్కొన్నారు. అందువల్ల తాను ఈ పదవికి అర్హుడను అని ఆయన చెప్పకనే చెబుతున్నారు.

మార్పు మొదలవ్వాలి :

ఇదే సందర్భంలో ఆయన మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు భారత రాజకీయ వ్యవస్థలో కొంత మార్పు జరగాలని ఆకాంక్షించారు. రాజ్యసభను నిష్పక్షపాతంగా నడపటం అవసరం అని ఆయన నొక్కి చెప్పారు. పెద్దల సభగా గౌరవ సభగా ఉన్న రాజ్యసభలో అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలన్నది తన అభిమతమని చెప్పారు. ఇక తనను ఉప రాష్ట్రపతిగా ఎన్నుకుంటే రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. మొత్తం మీద చూస్తే సుదర్శన్ రెడ్డి ఉప రాష్ట్రపతి పదవి విషయంలో తన అభిప్రాయాలు చెప్పారు మేధావుల నుంచి వస్తున్న చర్చ కూడా ఆయన సరైన అభ్యర్ధి అని. మరి చూడాలి ఈ పోటీలో అనూహ్యంగా ఆయన నెగ్గుతారేమో అన్నది.