Begin typing your search above and press return to search.

ఏడేళ్ల నిశ్శబ్దం వీడింది.. చంద్రబాబుకు తారక్ విషెస్!

ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

By:  Tupaki Political Desk   |   20 April 2026 12:20 PM IST
ఏడేళ్ల నిశ్శబ్దం వీడింది.. చంద్రబాబుకు తారక్ విషెస్!
X

ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇది టీడీపీ, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. సుమారు ఏడేళ్ల తర్వాత చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ తారక్ ట్వీట్ చేయడం విశేషంగా చెబుతున్నారు. ఇది జూనియర్ ఎన్టీఆర్ లో మారిన వైఖరిని ప్రతిఫలిస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వారసుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. కానీ ఆయన సినిమాలకు మాత్రమే పరిమితమై రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు కుటుంబంతో ఆయనకు గ్యాప్ ఉందనే ప్రచారం చాలా కాలం నుంచి ఉంది. ఈ ఊహాగానాలకు తెరదించుతూ జూనియర్ ఎన్టీఆర్ పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు 76వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలవురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా విషెస్ చెబుతున్నారు. అయితే సీఎం మేనల్లుడు, నందమూరి నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ మాత్రం ఆకర్షణీయంగా ఉందని చెప్పుకుంటున్నారు. గత కొంతకాలంగా చంద్రబాబు కుటుంబంతో జూనియర్ దూరంగా ఉంటున్నట్లు సినీ, రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన ఏ కార్యక్రమంలోనూ చంద్రబాబు, జూనియర్ కలుసుకోలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మావయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ తారక్ చేసిన ట్వీట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిజానికి గత ఏడాది కానీ, అంతకు ముందు కొన్నేళ్ల నుంచి కానీ తారక్ ఈ తరహాలో శుభాకాంక్షలు తెలియజేయకపోవడాన్ని ప్రస్తావిస్తూ, ఇప్పుడు పూర్తి ఆప్యాయతతో ‘మావయ్యా గారూ’ అంటూ సంభోదిస్తూ తారక్ చేసిన ట్వీట్ కొత్త చర్చలకు తెరలేపుతోందని అంటున్నారు.

టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం

తెలుగుదేశం పార్టీ వారసుల్లో ఒకరిగా జూనియర్ ఎన్టీఆర్‌ను భావించే కార్యకర్తలు, ఈ పరిణామంతో పండగ చేసుకుంటున్నారు. సినిమాలపైనే దృష్టి పెడుతూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ, కుటుంబ సభ్యుడిగా తారక్ చేసిన ఈ ప్రయత్నం పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. యంగ్ టైగర్ నుంచి వచ్చిన ఈ ఒక్క పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్ సాధిస్తోంది. తారక్ ట్వీట్ పై అభిమానులు కూడా భారీగా స్పందిస్తున్నారు. తారక్ కు చంద్రబాబు స్వీట్ తినిపిస్తున్న ఫొటోను కామెంట్ బాక్స్ లో పోస్టు చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు చంద్రబాబు, బాలయ్య, లోకేశ్, తారక్ కలిసి నవ్వులు చిందిస్తున్నట్లు ఏఐ జనరేటెడ్ ఫొటోను తారక్ పోస్టుకు జత చేస్తున్నారు.

కాగా, తారక్ ట్వీట్ తో ఆయన నారా-నందమూరి కుటుంబంతో గ్యాప్ పూడ్చుకునేలా అడుగులు వేస్తున్నారా? అన్న చర్చ జరుగుతోంది. చాలాకాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, బాబాయ్ బాలయ్యకు ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. గతంలో 'ఆర్ఆర్ఆర్' సాధించిన విజయంపై చంద్రబాబు అభినందించినప్పుడు మాత్రమే స్పందించిన తారక్, ఇప్పుడు స్వయంగా చొరవ తీసుకుని విష్ చేయడం వారి మధ్య సంబంధాలు మునుపటిలా బలపడేందుకు దోహదం చేస్తుందని అంటున్నారు. మొత్తానికి చాలా కాలం తర్వాత తారక్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా 'మావయ్య'కు శుభాకాంక్షలు తెలపడం.. అటు నందమూరి, ఇటు నారా అభిమానులను సంతోషానికి గురిచేస్తోంది.