Begin typing your search above and press return to search.

జూబ్లీహిల్స్ ఉపపోరుపై హైప్ పెంచి రేవంత్ రిస్కు తీసుకుంటున్నారా?

త్వరలో జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవటం ద్వారా.. తన సత్తా చాటాలని భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

By:  Garuda Media   |   15 Sept 2025 10:18 AM IST
జూబ్లీహిల్స్ ఉపపోరుపై హైప్ పెంచి రేవంత్ రిస్కు తీసుకుంటున్నారా?
X

అనూహ్య రీతిలో అనారోగ్యానికి గురైన జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ చౌదరి మరణంతో ఉప పోరును తెర మీదకు తీసుకొచ్చింది. త్వరలో జరిగే ఈ ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా.. హైదరాబాద్ మహానగరం నుంచి ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవకపోవటం తెలిసిందే. అనూహ్య రీతిలో కారు ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం నేపథ్యంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ విజయం సాధించటం ద్వారా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ మహానగరంలో ఖాతా తెరిచింది.

త్వరలో జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవటం ద్వారా.. తన సత్తా చాటాలని భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోకే వస్తుంది. దీనికి తోడు నగరంలో కాంగ్రెస్ పట్టు సాధిస్తుందన్న సంకేతాల్ని ఇచ్చేందుకు జూబ్లీహిల్స్ ఉప పోరును సంకేతంగా చూపించాలని రేవంత్ తపిస్తున్నారు. నిజానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా క్యాడర్ లేదు.

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను రంగంలోకి దించినప్పటికీ ఓటమి తప్పలేదు. ఇటీవల ఆయన్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన నేపథ్యంలో మరో అభ్యర్థి రంగంలోకి దిగటం ఖాయమని చెప్పక తప్పదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ఉపపోరులో కాంగ్రెస్ విజయం సాధించాలంటే ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ.. అనర్హత వేటు వేలాడుతున్న దానం నాగేందర్ సరైన అభ్యర్థిగా చెబుతున్నారు. మిగిలిన ఆశావాహులతో పోలిస్తే ఈ నియోజకవర్గం మీద దానంకు పట్టు ఉండటం.. ఇక్కడి ఓటర్లలో ఫలితాన్ని డిసైడ్ చేసే మైనార్టీ ఓటు బ్యాంకును తన వైపునకు మళ్లించే సత్తా దానంకు మాత్రమే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అభ్యర్థి ఎవరన్న దానిపై స్పష్టత రానప్పటికి.. జూబ్లీహిల్స్ ఉప పోరును తాను వ్యక్తిగతంగా తీసుకుంటున్న విషయాన్ని సీఎం రేవంత్ తన చేతలతో స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో మరే నియోజకవర్గంలో లేని విధంగా జూబ్లీహిల్స్ మీద ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. పలువురు మంత్రుల్ని తరచూ నియోజకవర్గంలోఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహించేలా ప్లాన్ చేయటమే కాదు.. ఉపపోరులో పార్టీ గెలుపు కోసం పార్టీలోని ప్రతి ఒక్కరూ పని చేయాలన్న పిలుపును ఇస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్.

నిజానికి ఆయన వ్యక్తిగతంగా ప్రదర్శిస్తున్న ప్రత్యేక ఆసక్తితో జూబ్లీహిల్స్ ఉపపోరు మీద హైప్ అంతకంతకూ పెరుగుతోంది. ఇలా వ్యవహరించటం ద్వారా సీఎం రేవంత్ రిస్కు తీసుకుంటున్నారా? అన్న వాదన వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉపపోరు ఫలితం ముఖ్యమంత్రి భావిస్తున్నట్లుగా కాకుండా ప్రతికూల ఫలితమే ఏర్పడితే.. ఆయన ఇమేజ్ కు భారీ డ్యామేజ్ తప్పదని చెప్పాలి. సీఎమ్మే ప్రత్యేకంగా ఫోకస్ చేసిన తర్వాత పార్టీ ఓటమి.. ముఖ్యమంత్రి మీదనే కాదు.. ప్రభుత్వం మీదా పడుతుంది. అందుకే.. తెర వెనుక పక్కాగా ప్లానింగ్ చేసుకొని ఉపపోరు షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి అస్త్రాల్ని ఒక్కొక్కటిగా బయటకు తీయటం ఒక ఎత్తు.

అందుకు భిన్నంగా జూబ్లీహిల్స్ ఉపపోరు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ ఆలోచనలు వేరుగా ఉన్నట్లు చెబుతున్నారు. ఉపపోరు వేళకే అధికార పార్టీకి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ గా తీసుకురావటం.. ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడేసేలా కార్యక్రమాల్ని చేపట్టటం ద్వారా వారిలో ఓటమి భయాన్ని ప్రచారంలోనే కనిపించేలా చేస్తే.. తాము విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. సీఎం రేవంత్ వ్యూహంలో భాగంగా జూబ్లీహిల్స్ ఉపపోరు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుందన్న హైప్ తీసుకొచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. అదెంతవరకు వర్కువుట్ అవుతుందన్నది తేలాలంటే మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదు.