రేవంత్ వెంటే పసుపుదళం? జూబ్లీహిల్స్ ఫలితాలను శాసించిన టీడీపీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా పోటీ జరిగింది.
By: Tupaki Political Desk | 15 Nov 2025 2:58 PM ISTజూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా పోటీ జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో అసలు పోటీలోనే లేని టీడీపీపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో సుమారు 20 వేలకు పైబడి టీడీపీ సానుభూతిపరుల ఓట్లు ఉన్నాయని ఎన్నికలకు ముందు అంచనాలు వెలువడ్డాయి. వీరి ఓట్ల కోసం అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా తీవ్రంగా ప్రయత్నించాయి. టీడీపీ ఓటర్లను ఆకట్టుకునేలా అనేక హామీలు గుప్పించాయి. ఇందులో ప్రధానమైనది హైదరాబాద్ నగరంలోనే ప్రధానమైన కూడలిగా భావించే అమీర్ పేట సెంటర్ లో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహం పెడతామనే హామీ. ఇక ఎన్నికలు ముగిసిన తర్వాత ఫలితాల సరళిని చూస్తే టీడీపీ సానుభూతిపరులు కాంగ్రెస్ పార్టీకే జైకొట్టినట్లు కనిపిస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు.
నిజానికి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ పుట్టింది. టీడీపీ రక్తంలోనే కాంగ్రెస్ వ్యతిరేకత ఉంది. కానీ, తెలంగాణలో టీడీపీ కేడర్ కాంగ్రెస్ తో కలిసిమెలిసి తిరుగుతున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం టీ.సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పార్టీపరంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా.. ఆయన తమ వాడిగానే టీడీపీ కేడర్ భావిస్తోందని విశ్లేషిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కూడా రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. తాను టీడీపీ నుంచే వచ్చానని, టీడీపీ కేడర్ ఏం కోరుకుంటుందో తనకు తెలుసునని బహిరంగంగా తేల్చిచెప్పారు. అంతేకాకుండా మైత్రీవనంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టిస్తానని చెప్పడమే కాకుండా, ఆ విగ్రహాన్ని తానే ఆవిష్కరిస్తానని హామీ కూడా ఇచ్చారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఇప్పటివరకు నాలుగు సార్లు ఎన్నికలు జరిగితే ఒకసారి కాంగ్రెస్, మరోసారి టీడీపీ గెలిచింది. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన మాగంటి గోపీనాథ్ ఆ తర్వాత టీఆర్ఎస్.. ఇప్పటి బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో టీడీపీ ఓటర్లు సైతం ఆయన వెంట వెళ్లిపోయారని అంటున్నారు. దీంతో 2018, 2023 ఎన్నికల్లో టీడీపీ మద్దతుతోనే మాగంటి గెలిచారని విశ్లేషిస్తున్నారు. అయితే మాగంటి అకాల మరణం తర్వాత టీడీపీ ఓటర్లు ఆయన కుటుంబానికి మద్దతుగా నిలుస్తారా? లేక తమకు ఇష్టమైన నాయకుడు రేవంత్ రెడ్డి నాయకత్వానికి వెన్నుదన్నుగా నిలబడతారా? అన్నదే చర్చగా మారింది. బీఆర్ఎస్ కూడా తాము సెటిలర్లను బాగా చూసుకున్నామని, మాగంటితోపాటు తమ రక్తంలోనూ టీడీపీ రక్తం ప్రవహిస్తుందని చెప్పకుంది. సాక్షాత్తూ బీఆర్ఎస్ వర్కింగు ప్రెసిడెంట్ కేటీఆర్ నోటి నుంచే ఈ మాటలు వచ్చినా, టీడీపీ కేడర్ విశ్వసించలేదని ఎన్నికల ఫలితాలను చూస్తే అర్థమవుతోందని అంటున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ పట్ల, పార్టీ అధినేత చంద్రబాబుపైన బీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలను మరచిపోలేని తెలంగాణ కేడర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనే కలిసినట్లు స్పష్టమవుతోందని అంటున్నారు.
అదేసమయంలో సీఎం రేవంత్ రెడ్డి టీడీపీ సానుభూతిపరులైన కొన్ని కుల సంఘాలతో ప్రత్యేకంగా సమావేశమవడం, ఆ సామాజికవర్గంలోని ప్రముఖులను వ్యక్తిగతంగా కలిసి మద్దతు కోరడం కూడా టీడీపీని తెలంగాణ కాంగ్రెస్ కు దగ్గర చేసిందని అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ యాదవ్, ఆయన తండ్రి శ్రీశైలం యాదవ్ కు కూడా గతంలో టీడీపీతో దగ్గర సంబంధాలు ఉండటం కూడా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపునకు కలిసొచ్చిందని విశ్లేషిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు 25 వేల ఓట్లు మెజార్టీ రావడం చూస్తే.. టీడీపీ కేడర్ మొత్తం కాంగ్రెస్ వెనుకే ర్యాలీ అయ్యారనే అభిప్రాయమే వినిపిస్తోంది. వాస్తవానికి జూబ్లీహిల్స్ లో పోటీచేసిన ముగ్గురు అభ్యర్థులు ఒకప్పుడు కోర్ టీడీపీ నేతలే.. అయితే ఇప్పుడు వారి ముఖాలు చూడకుండా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి దన్నుగా నిలవాలన్న ఆలోచనతోనే నవీన్ యాదవ్ ను గెలిపించారని అంటున్నారు. దీనికి 2023 ఎన్నికల నాటి ఘటనలను సైతం గుర్తు చేస్తున్నారు. 2023 ఎన్నికల సమయంలో ఫలితాలు విడుదలైనప్పుడు టీడీపీ కేడర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి వద్ద.. ఇటు గాంధీభవన్ వద్ద సంబరాలు చేసుకోడాన్ని ప్రస్తావిస్తున్నారు. మొత్తానికి టీడీపీ కేడర్ రేవంత్ రెడ్డిని ఓన్ చేసుకుందనే భావిస్తున్నారు.
