జూబ్లీహిల్స్ బైపోల్.. పోల్ పర్సంటేజీయే విజేతను నిర్ణయిస్తుందా?
హైదరాబాద్ నగరంలో పట్టు పెంచుకునేందుకు అధికార కాంగ్రెస్, సిటింగు సీటును కాపాడుకోడానికి ప్రతిపక్ష బీఆర్ఎస్, ఉనికి చాటుకునే ప్రయత్నంలో బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి
By: Tupaki Political Desk | 26 Oct 2025 1:00 AM ISTతెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. హైదరాబాద్ నగరంలో పట్టు పెంచుకునేందుకు అధికార కాంగ్రెస్, సిటింగు సీటును కాపాడుకోడానికి ప్రతిపక్ష బీఆర్ఎస్, ఉనికి చాటుకునే ప్రయత్నంలో బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. బీజేపీ కూడా ప్రధాన పార్టీలకు దీటుగా పోటీ ఇస్తోంది. అయితే 2009లో ఆవిర్భవించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు మూడు పార్టీలు గెలవగా, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఒక్కరే రెండు పార్టీల తరఫున మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు. తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందనేదే ఉత్కంఠగా మారింది.
హైదరాబాద్ నగరంలో అతిపెద్ద నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్ ఒకటి. ఇక్కడ సంపన్నవర్గాలతోపాటు పేదలు అధిక సంఖ్యలో ఓటర్లుగా నమోదయ్యారు. మైనార్టీ ఓట్లు నిర్ణయాత్మకశక్తిగా ఫలితాన్ని ప్రభావితం చేసేవిగా అంచనాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో దాదాపు నాలుగు లక్షల ఓట్లు ఉండగా, గత నాలుగు విడతలుగా జరిగిన ఎన్నికల్లో సుమారు 50 శాతానికి దగ్గరగా ఓటింగు జరుగుతోంది. నగర ఓటర్లు ఓటింగుకు వచ్చేందుకు విముఖంగా ఉండటంతో ముస్లింలు, పేద, కార్మిక వర్గాలతో మమేకమయ్యేవారే విజేతలుగా జెండా ఎగరేస్తున్నారని గత నాలుగు ఎన్నికల ఫలితాలను విశ్లేషించి చెబుతున్నారు.
2009లో ఆవిర్భవించిన జూబ్లీహిల్స్ లో తొలిసారి కార్మిక నేత, దివంగత కాంగ్రెస్ పార్టీ నాయకుడు పి.జనార్దనరెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పట్లో సుమారు 52.77% ఓటింగు నమోదైంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విష్ణు 39.84 శాతం ఓట్లు తెచ్చుకున్నారు. ఇక ఆ తర్వాత అత్యధికంగా 56.85 శాతం ఓటింగు 2014లో నమోదైంది. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ తన అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ ను బరిలోకి దింపింది. ఈ ఎన్నికల్లో సుమారు 30 శాతం ఓట్లతో గోపీనాథ్ విజేతగా నిలిచారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ లో చేరి 2018, 2023 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.
2014లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన గోపీనాథ్ కేవలం 30 శాతం ఓట్లతోనే గెలిచినా, ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ సుమారు 44 శాతం ఓట్లు తెచ్చుకుని గెలుపొందారు. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలకు 35 శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు మధ్య సుమారు 8 నుంచి 9 శాతం ఓట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. గత నాలుగు ఎన్నికల్లో ప్రధాన పోటీ మూడు పార్టీల మధ్య ఉండటంతో మూడో పక్షం చీల్చే ఓట్లు ఎన్నికల ఫలితాన్ని తేల్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ లెక్కలన్నీ పరిగణనలోకి తీసుకుంటున్న ప్రధాన పార్టీల తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ కాంగ్రెస్ తన ఓటింగు శాతాన్ని మెరుగు పరుచుకుని గెలవాలని ప్లాన్ చేస్తోంది. గతంలో జరిగిన అన్ని ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈ ఉప ఎన్నికల్లో గెలవాలంటే పోల్ మేనేజమ్మెంట్ పక్కాగా ఉండాలని పార్టీ నేతలకు సూచించినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ నేతలు ఓటర్ల జాబితాను దగ్గరపెట్టుకుని ప్రజలను కలుస్తున్నారు. నవంబరు 11న జరిగే ఎన్నికల్లో ఇప్పటివరకు ఓటింగుకు దూరంగా ఉన్నవారిని పోలింగు కేంద్రానికి తీసుకువచ్చి ఓటు వేయించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ తమ ఓటింగు శాతం జారిపోకుండా కాపాడుకుంటే చాలన్న రీతిలో వ్యూహరచన చేస్తోంది. అయితే గత రెండు ఎన్నికల్లో వెన్నుదన్నుగా నిలిచిన ఎంఐఎం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీకి టెన్షన్ గా మారిందని అంటున్నారు.
దీంతో మైనార్టీ ఓట్లు తగ్గితే.. ఇతర వర్గాల ఓట్లను పెంచుకునేలా బీఆర్ఎస్ వ్యూహం రచిస్తోంది. ఇదే సమయంలో బీజేపీ హిందుత్వ ఓట్లను సంఘటితం చేసేలా పావులు కదుపుతోందని అంటున్నారు. దీంతో మూడు పార్టీల పోల్ మేనేజ్మెంట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల నిర్వహణలో ప్రతిభావంతంగా పనిచేయగలిగే వారినే విజయం వరించే చాన్స్ ఉన్నట్లు పరిశీలకులు సూచిస్తుండటంతో ప్రధాన పోటీదారులు ముగ్గురు ఒకవైపు ప్రచార కార్యక్రమాలను జోరుగా చేస్తూనే.. బూతులు వారీగా పోలయ్యే ఓట్లు, ఆయా చోట్ల తమకు వచ్చే ఓట్లు లెక్కలు, తీసివేతల్లో బిజీగా గడుపుతున్నారు. దీంతో జూబ్లీహిల్స్ పోరుపై ఉత్కంఠ నెలకొంటోంది.
